close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రజాప్రతినిధులు..అధికారానికి తాత్కాలిక ధర్మకర్తలు

అపరిమిత సమీక్షాధికారం.. దుర్వినియోగం అవుతుంది
గత ప్రభుత్వ నిర్ణయాల్ని సులువుగా రద్దు చేయకూడదని ‘సుప్రీం’ చెప్పింది
రాష్ట్రం పురోభివృద్ధికి ప్రభుత్వ విధానాల్లో నిలకడ అవసరం
ఉపసంఘం, సిట్ ఏర్పాటుపై దాఖలైన వ్యాజ్యాల్లో హైకోర్టు ఉత్తర్వులు
ఈనాడు - అమరావతి

ప్రభుత్వానికి అపరిమితమైన పునఃసమీక్ష అధికారం కల్పిస్తే ప్రతిసారీ ఎన్నికల తర్వాత అది దుర్వినియోగం అయ్యేందుకు దారితీస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. పునఃసమీక్షించే అధికారం ఏ ప్రభుత్వానికీ స్వతఃసిద్ధంగా లేదని పేర్కొంది. గత ప్రభుత్వ స్థాయిలో తీసుకున్న నిర్ణయాల్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు అంత సులువుగా రద్దు చేయకూడదని, అసంపూర్ణంగా మిగిలిపోయిన పనులను పూర్తిచేయాల్సిన బాధ్యత తర్వాత వచ్చే ప్రభుత్వంపై ఉందని ‘స్టేట్ ఆఫ్‌ హరియాణా వర్సెస్‌ స్టేట్ ఆఫ్‌ పంజాబ్‌’ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని గుర్తుచేసింది. గత ప్రభుత్వ నిర్ణయాల్ని పునఃసమీక్షించేందుకు ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చర్యలను నిలుపుదల చేస్తూ.. తెదేపా సీనియర్‌ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ దాఖలుచేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. గురువారం ఉత్తర్వుల ప్రతి అందుబాటులోకి వచ్చింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.
ఇష్టానుసారం మార్చడానికి వీల్లేదు
‘కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులు/నిర్ణయాలు/విధానాల్ని రాజకీయ కారణాలతో పునఃసమీక్షించడం లేదా విస్మరించడం చేయకూడదని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసింది. రాజకీయ కారణాలతో, పక్షపాతంతో గత ప్రభుత్వ నిర్ణయాలను విస్మరించకూడదని సుప్రీం తీర్పుల ఆధారంగా అర్థమవుతోంది. రాష్ట్రం పురోభివృద్ధికి ప్రభుత్వ విధానాల్లో నిలకడ అవసరం. తీవ్రమైన చట్ట ఉల్లంఘనలు, స్పష్టమైన మోసం జరిగిన సందర్భాల్లో తప్ప రాజకీయ కారణాలతో ఇష్టానుసారంగా విధానాలను మార్చడానికి వీల్లేదు. చట్టాల ఉద్దేశం ఇదే. ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరూ దానికి కట్టుబడి ఉండాలి. ఆ విషయాన్ని విస్మరిస్తే.. పరిస్థితిని చక్కదిద్దేందుకు హైకోర్టు జోక్యం చేసుకుంటుంది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని నడుపుతారు. చట్ట ప్రకారం పరిపాలించేందుకు ఇచ్చిన అధికారానికి వారు తాత్కాలిక ధర్మకర్తలు. ఆల్‌ఫ్రెడ్‌ లార్డ్‌ టెన్నిసన్‌ పుస్తకం ప్రకారం ‘ప్రభుత్వం’ అనేది స్థిరంగా ఉంటుంది. పాలకులు వస్తుంటారు.. పోతుంటారు. ప్రభుత్వం నిరంతర ప్రక్రియ. ఈ విషయాన్ని పగ్గాలు చేపట్టినవారు తరచు మరిచిపోతారు. ప్రజాస్వామ్యంలో తాత్కాలిక ధర్మకర్తలు నిర్దిష్ట కాలం వరకే పరిపాలిస్తారు. చట్టాలకు కట్టుబడి పరిపాలించేందుకు అధికారం అప్పగించడమే ప్రజాస్వామ్యం ప్రధాన ఉద్దేశం. చట్టబద్ధ పాలనకు ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్లు కట్టుబడి ఉండాలి.
నేరాలు జరిగినట్లు ముందుగానే నిర్ణయానికి వచ్చినట్లుంది
గత ప్రభుత్వ నిర్ణయాల్ని సమీక్షించేందుకు గతేడాది జూన్‌ 26న మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ జారీచేసిన జీవోను పరిశీలిస్తే గతంలో నేరాలు చోటుచేసుకున్నట్లు ప్రభుత్వం ముందుగానే నిర్ణయానికి వచ్చినట్లుంది. ‘హద్దులేని అవినీతి’, ‘భూ ఆక్రమణ’ తదితర పదాలను జీవోలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని రాజకీయ కారణాలతో ఏర్పాటు చేశారా, సరైన విచారణ జరపకుండానే ప్రభుత్వం ఇలాంటి అభిప్రాయానికి రావచ్చా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేరాలపై మంత్రివర్గ ఉపసంఘం, సిట్ అవసరం లేకుండానే పోలీసు వ్యవస్థతో దర్యాప్తు చేయించుకోవచ్చు. మంత్రివర్గ ఉపసంఘం, సిట్ ఏర్పాటుచేయాలని శాసనసభ స్పీకర్‌ ఆదేశించడానికి కారణాలు లేవు. ఉపసంఘం ఏర్పాటు అవసరం ఏమిటి? దీనికి ఆధారాలేంటో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.