ఇక మద్యం మాల్స్‌

ప్రధానాంశాలు

ఇక మద్యం మాల్స్‌

‘వాక్‌ ఇన్‌ షాప్స్‌’ పేరిట ఏర్పాటు
వాటిలో అన్ని బ్రాండ్ల అందుబాటు?
నూతన మద్యం విధానం ప్రకటన

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మద్యం మాల్స్‌ రానున్నాయి. ‘వాక్‌ ఇన్‌ షాప్స్‌’ పేరిట వీటిని రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇవి ఉన్నతశ్రేణి మద్యం దుకాణాలు. రాష్ట్రంలో 50-100 వరకు ఇలాంటి మాల్స్‌ నెలకొల్పనున్నట్లు సమాచారం. ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో వీటిని ఏర్పాటుచేస్తారు.

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) వీటిని నిర్వహిస్తుంది. అందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి నూతన మద్యం విధానాన్ని ప్రకటించింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ శుక్రవారం ఈ ఉత్తర్వులు జారీచేశారు.

ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి 2021 సెప్టెంబరు 30 వరకూ ఈ విధానం అమల్లో ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో కొన్ని రకాల బ్రాండ్లే ఉంటున్నాయి. తాజాగా ఏర్పాటు చేయనున్న ‘వాక్‌ ఇన్‌ షాప్స్‌’లో అన్ని బ్రాండ్లూ ఉంచాలని ఏపీఎస్‌బీసీఎల్‌ యోచిస్తోంది. ఇవి ఉండేచోట ప్రస్తుతమున్న మద్యం దుకాణాలను తొలగిస్తారు. రాష్ట్రంలో మొత్తం 2,934కు మించకుండా మద్యం దుకాణాలు ఉండేలా చూస్తారు.

మద్యం విధానంలోని ఇతర ప్రధానాంశాలు
* గతేడాది అక్టోబరు 1న ప్రభుత్వ ఆధ్వర్యంలో 3,500 మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మే 9న వీటిని 2,934కు కుదించారు.
* 2020-21 సంవత్సరంలోనూ అంతే సంఖ్యలో కొనసాగుతాయి.
* తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి అలిపిరి వరకూ ఆర్టీసీ బస్టాండు, లీలామహల్‌ సర్కిల్‌, నంది సర్కిల్‌, విష్ణు నివాసం, శ్రీనివాసం, ఎస్‌వీఆర్‌ఆర్‌ ఆసుపత్రి, స్విమ్స్‌ ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు అనుమతించరు.
* ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ విధానాన్ని పాటిస్తారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని