‘చందమామ’ బొమ్మల తాత ఇక లేరు

ప్రధానాంశాలు

‘చందమామ’ బొమ్మల తాత ఇక లేరు

ప్రముఖ చిత్రకారుడు శంకర్‌ కన్నుమూత

కోడంబాక్కం, న్యూస్‌టుడే: పట్టు వదలని విక్రమార్కుడు బేతాళుడి శవాన్ని భుజాన వేసుకుని బయల్దేరాడంటే వెంటనే ఠక్కున గుర్తుకొచ్చే బొమ్మ.. చందమామ ముఖచిత్రమే. అలాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలు గీసి ఆబాల గోపాలాన్ని అలరించిన బొమ్మల తాతయ్య ఇకలేరు. పిల్లల కథల పుస్తకం ‘చందమామ’లో తన కుంచెతో అద్భుతమైన బొమ్మలను గీసిన శంకర్‌ (96) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని పోరూరు సమీపం మాదాంతపురంలోని స్వగృహంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తుదిశ్వాస విడిచారు. బేతాళ కథలకు తనదైన శైలిలో చిత్రాలను రూపొందించి చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరి మన్ననలు అందుకున్నారు. ముఖ్యంగా ‘చందమామ’లోని కథలు, ఇతిహాసాలు, పురాణాలకు తన కుంచె ద్వారా అద్భుతమైన బొమ్మలను గీశారు. పౌరాణిక పాత్రలకు తన చిత్రకళతో మరింత వన్నె తీసుకొచ్చారు. 1951లో ‘చందమామ’లో చేరిన ఆయన 60 ఏళ్ల పాటు అందులోనే పనిచేశారు. చందమామ మూతపడ్డాక ‘రామకృష్ణ విజయం’ పత్రికలో పనిచేశారు. తన సృజనాత్మకతతో మరపురాని ఎన్నో చిత్రాలు గీసి తరతరాల పిల్లలను అలరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని