రాజ్యాంగ విరుద్ధం

ప్రధానాంశాలు

రాజ్యాంగ విరుద్ధం

అధికారులతో సమీక్ష కూడా వద్దంటారా ?
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ ఆగ్రహం
గవర్నర్‌తో భేటీ
రాష్ట్ర ప్రభుత్వం, కొందరు మంత్రుల వ్యాఖ్యలపై ఫిర్యాదు
ప్రభుత్వ వైఖరిపై కోర్టుకెళ్లే యోచన
ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యవహారం.. రోజుకో మలుపు తిరుగుతోంది. పంచాయతీలకు వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం నిర్ణయించగా.. కొవిడ్‌ నేపథ్యంలో ఎన్నికలకు సిద్ధంగా లేమని, అంతా అనుకూలంగా ఉన్నప్పుడు చెబుతామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధతపై బుధవారం మధ్యాహ్నం జిల్లాల కలెక్టర్లు, అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తలపెట్టిన వీడియో సమావేశం కూడా అక్కర్లేదని కుండబద్దలు కొట్టింది. ప్రభుత్వ తీరుపై ఎన్నికల సంఘం మండిపడింది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రమేశ్‌కుమార్‌ బుధవారం ఉదయమే గవర్నర్‌ను కలిశారు. ఎన్నికలకు ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆయన ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ విముఖతను అవసరమైతే సుప్రీంకోర్టుకూ దృష్టికీ తీసుకెళ్లాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు సమాచారం.

పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు నిర్వహించలేమని, వాటికి సన్నద్ధతపై జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తలపెట్టిన వీడియో కాన్ఫరెన్స్‌ కూడా అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేయడంపై.. ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సీఎస్‌ నుంచి ఈ మేరకు తనకు ప్రత్యుత్తరం అందగానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ బుధవారం ఉదయం హుటాహుటిన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు విముఖత వ్యక్తం చేయడంపై సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాలని, హైకోర్టు దృష్టికీ ఆ అంశాన్ని తీసుకెళ్లాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్టు సమాచారం.
ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా లేమని సీఎస్‌ లేఖ రాయడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌  రమేశ్‌కుమార్‌ బుధవారం ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటోందనడానికి తమ దగ్గర కచ్చితమైన సమాచారం ఉందని గవర్నర్‌కు రమేశ్‌కుమార్‌ ఫిర్యాదు చేయడమే కాక నివేదిక రూపంలోనూ అందజేశారని తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కొందరు మంత్రులు కూడా విచక్షణరహితంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎన్నికల్ని అడ్డుకునే ఉద్దేశంతో ఉద్యోగుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని రమేశ్‌కుమార్‌ గవర్నర్‌కు చెప్పారు. ప్రభుత్వం, మంత్రుల తీరును తీవ్రంగా పరిగణించాలని.. వారు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించకుండా కట్టడి చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని కోరారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించేందుకూ ప్రభుత్వం వీలు కల్పించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి కోర్టుల్లో ఉన్న కేసుల గురించి, ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడానికి కారణాల గురించీ వివరించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు న్యాయపరంగా ఎలాంటి అవరోధాలూ లేవని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సహకారం అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడమే
ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎలాంటి సమీక్ష గానీ, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ గానీ నిర్వహించాల్సిన అవసరం లేదంటూ సీఎస్‌ నీలం సాహ్ని లేఖ రాయడంపై రమేశ్‌కుమార్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అది రాజ్యాంగ విరుద్ధమని, ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడమేనని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. ఈ మేరకు ఆయన సీఎస్‌కు సందేశం పంపినట్టు సమాచారం. ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల్ని గోప్యంగా ఉంచకుండా బయటకు పొక్కేలా చేశారని, అది కూడా తీవ్ర అభ్యంతరకరమని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ను తాము రద్దు చేసుకోలేదని, అది జరగకుండా ప్రభుత్వమే అడ్డుకుందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ‘ఎన్నికల సంఘం వ్యక్తిగతంగా అధికారులందరికీ లేఖ రాయదు. వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలనుకుంటున్నామని సీఎస్‌కు తెలియజేస్తుంది. అందర్నీ సమాయత్తపరచాల్సిన బాధ్యత సీఎస్‌దే’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి.


గవర్నర్‌ స్పందన చూశాక కోర్టుకు!

రమేశ్‌కుమార్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లిన అంశాలపై ఆయన ఎలా స్పందిస్తారో చూశాక, తప్పనిసరైతే ఈ అంశాన్ని కోర్టుకు నివేదించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో నిర్దిష్ట అభివృద్ధి పనులకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని, వారు అనుమతించకపోతే తమ దృష్టికి తీసుకురావాలని.. సుప్రీంకోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అభివృద్ధి పనులకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సవరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ కోర్టు ఆ సూచనలు చేసింది. దానిపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఆ కేసు విచారణకు వచ్చినప్పుడు... రాష్ట్రంలో తాజా పరిస్థితిని, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలనుకున్నా ప్రభుత్వం అడ్డుపడుతున్న తీరును అఫిడవిట్‌ రూపంలో సుప్రీంకోర్టుకు సమర్పించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగానూ ఈ అంశాన్ని తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టు తెలిసింది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని