close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నిండాముంచిన నివర్‌

తీరం దాటుతూ విధ్వంసం సృష్టించిన తుపాను
చిగురుటాకులా వణికిన చిత్తూరు
నెల్లూరుకు కన్నీరు.. కడప జిల్లాపై తీవ్ర ప్రభావం
ప్రకాశం, కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లోనూ నష్టం
పుదుచ్చేరి కకావికలం... నీట మునిగిన చెన్నై
తిరుమల శ్రీవారి మాడ వీధుల్లో మోకాలి లోతు నీరు
ఈనాడు యంత్రాంగం

నివర్‌ తుపాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. గురువారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని దాటుతూ  పుదుచ్చేరితోపాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో తీవ్ర నష్టాన్ని కలిగించింది. భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు విలవిలలాడగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పంటలు నేలకొరిగాయి. ఈదురుగాలులు, భారీ వర్షాలు చిత్తూరు జిల్లాను అతలాకుతం చేశాయి. తిరుపతి నగరం సహా తూర్పు మండలాల్లోని గ్రామాల్లో ఇళ్లలోకి పెద్దఎత్తున నీరు చేరింది. తిరుమలలోని శ్రీవారి ఆలయం పరిసరాల్లో   వరద ప్రవహించింది. తుపాను నెల్లూరుకు సైతం కన్నీరును మిగిల్చింది. జిల్లాలోని 11 ప్రాంతాల్లో 15 నుంచి 30 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఫలితంగా పెన్నా, స్వర్ణముఖి, కైవల్య, కండలేరు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమశిల నుంచి 1.10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రానికి వదులుతున్నారు. తిరుపతి విమానాశ్రయం నుంచి నాలుగు విమానాలను రద్దు చేశారు. తిరుపతి-సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ రైలునూ రద్దు చేశారు.

చిత్తూరు జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు విస్తారంగా కురిసిన వర్షాలతో తూర్పు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. తిరుపతి నగరంలో కపిలతీర్థం కాలువను ఆనుకొని ఉన్న కొరమేనుగుంట, ఎర్రమిట్ట, మధురానగర్‌, శ్రీరామ్‌నగర్‌ కాలనీ, షికారీ కాలనీ సహా పలుచోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. రామచంద్రాపురం మండలం గొల్లపల్లి, మదనపల్లె పట్టణంలోని ఓ కాలనీ, తిరుపతి అర్బన్‌ మండలం మంగళం సమీపంలోని కేబీఆర్‌నగర్‌ నీట మునిగాయి. రేణిగుంట-కడప జాతీయ రహదారి కోతకు గురైంది. తిరుపతి-మదనపల్లె, కుప్పం-పలమనేరు, పుంగనూరు-ముళబాగల్‌, పుంగనూరు-బెంగళూరు మార్గంలో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. తిరుమలలో గురువారం తెల్లవారు జామున రెండో ఘాట్‌రోడ్డులోని 9, 10, 15 కిలోమీటర్‌ వద్ద కొండచరియలు విరిగి పడగా, 14వ కిలోమీటర్‌ వద్ద బొలెరో వాహనంపై బండరాయి పడింది. మొదటిఘాట్‌ రోడ్డులోని 54వ మలుపు వద్ద భారీవృక్షం కూలడంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్పడింది. పాపవినాశనం, ఎంబీసీ ప్రాంతాల్లోనూ చెట్లు విరిగిపడ్డాయి. బాలాజీనగర్‌లో కమ్యూనిటీ భవనం రక్షణ గోడకూలి రెండు బైక్‌లు ధ్వంసమయ్యాయి. తిరు మాడవీధుల్లో, శ్రీవారి ఆలయం ఎదుట వరద పారింది. తిరుమలోని పాపవినాశనం, గోగర్భం జలాశయాల గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. కుమారధార, పసుపుధార, ఆకాశగంగ డ్యామ్‌లు పూర్తిగా నిండి నీరు పొంగి పొర్లుతోంది. శ్రీవారి మెట్ల మార్గంలో బండరాళ్లు పడుతుండడంతో తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తితిదే అధికారులు గురువారం ప్రకటించారు. భక్తులను తిరిగి అనుమతించే విషయాన్ని తెలియజేస్తామన్నారు.

చిత్తూరు నగరంలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జి కింద చెన్నారెడ్డికాలనీలో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని గురువారం రాత్రి వరద నీరు చుట్టుముట్టింది. అప్పటికే కార్యాలయంలో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీధర్‌గుప్తా, మరో నలుగురు సిబ్బంది బయటకు రాలేక ఆందోళన చెందారు. చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలోని ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది తాడు సాయంతో సబ్‌ రిజిస్ట్రార్‌, సిబ్బందిని కార్యాలయం నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వీరితో పాటు కాలనీలోని మరో 34 మందిని సురక్షితంగా బయటకు తెచ్చారు.

నెల్లూరుపై విరుచుకుపడిన తుపాను
నెల్లూరు జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. గూడూరు-మనుబోలు మధ్యలో ఆదిశంకర కళాశాల వద్ద చెన్నై-కోల్‌కత జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. వెంకటగిరి-రాపూరు మార్గంలో లింగసముద్రం వద్ద వంతెన కూలిపోగా.. మన్నేగుంట, వెంకటగిరిపాళెం-కోట మార్గాల్లో వంతెనలు కొట్టుకుపోయాయి. గూడూరు-రాజంపేట, గూడూరు-పొదలకూరు మార్గాల్లో తిప్పవరప్పాడు వద్ద కైవల్యా నది ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. సౌత్‌మోపూరు వద్ద కనుపూరు కాలువ కట్ట తెగింది. కొండాపురం మండలం గానుగపెంట మిడతవాగు నుంచి కొమ్మి చెరువుకు నీరొచ్చే కాలువకు గండి పడి పంటపొలాలు నీటమునిగాయి. కలిగిరి మండలం కాకుటూరు చెరువుకట్ట ప్రమాదకరంగా మారడంతో అలుగు వద్ద అధికారులు గండి కొట్టించారు. దొరవారిసత్రం మండలం మేలనత్తూరులో చెరువు కట్టకు గండిపడింది. కావలి యడవల్లిలో వర్షపునీరు మగ్గం గుంతల్లోకి చేరింది. చేజర్ల మండలంలో అయిదు గ్రామాలు జలదిగ్బంధంలోకి చేరాయి. స్తంభాలు నేలకూలి విద్యుత్తుశాఖకు సుమారు రూ.90లక్షల నష్టం వాటిల్లింది. గూడూరు పట్టణ పరిసరాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. జిల్లాలో పరిస్థితిపై మంత్రి అనిల్‌కుమార్‌ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

వరదలో చిక్కుకున్న 100 మంది ప్రయాణికులు
గూడూరు మండలం తిప్పవరపాడు-సైదాపురం మధ్య కైవల్యానది ఉప్పొంగడంతో గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, ఒక లారీ, మూడు ఆటోలలో ప్రయాణిస్తున్న 100 మంది వరదలో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

కడప జిల్లాపై తీవ్ర ప్రభావం
కడప జిల్లాపైనా నివర్‌ తీవ్ర ప్రభావం చూపింది. ప్రధానంగా రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేలు, కమలాపురం నియోజకవర్గాల్లో బుధవారం రాత్రి నుంచి భారీ వర్షాలు పడ్డాయి. మిగిలిన ప్రాంతాల్లోనూ ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షపాతం నమోదైంది. కమలాపురం, రాయచోటి, మైదుకూరు, రాజంపేట, రైల్వేకోడూరు భారీగా పంట నష్టం జరిగింది. కుక్కలదొడ్డి, ఊటుకూరు  సమీపంలో కడప-రేణిగుంట ప్రధాన రహదారి కోతకు గురైంది. కమలాపురం సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న సంధ్య(24) పాపఘ్నినది వంతెనపై వర్షానికి అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొని నదిలో పడిపోయారు. అగ్నిమాపక సిబ్బంది ఆమెను కాపాడి కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.

తడిసిముద్దయిన ప్రకాశం
కుండపోత వానలతో ప్రకాశం జిల్లా తడిసి ముద్దయింది. జనజీవనం స్తంభించింది. అత్యధికంగా ఉలవపాడులో 19.4 సెం.మీ., కందుకూరులో 16, కొత్తపట్నం 15 వర్షపాతం నమోదైంది. ఉలవపాడు, నాగులుప్పలపాడు మండలంలోని కనపర్తి, కందుకూరులోని ఓగూరు ప్రాంతాల్లో రహదారికి అడ్డంగా చెట్లు విరిగి పడ్డాయి.

కృష్ణా డెల్టాలో తీరని నష్టం
నివర్‌ తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో బుధవారం రాత్రి వర్షం కురుస్తూనే ఉంది. జిల్లావ్యాప్తంగా మోస్తరు వర్షం పడటంతో కృష్ణా పశ్చిమడెల్టాలో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా లక్ష హెక్టార్లలో వరి పంట నేలవాలి దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. కృష్ణా జిల్లాలోనూ వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం కలుగుతోంది. అవనిగడ్డ, మచిలీపట్నం, మోపిదేవి, గుడివాడ, కైకలూరు, నాగాయలంక ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మచిలీపట్నాన్ని వరదలు ముంచెత్తాయి.

తూర్పులో ఎడతెరిపిలేని వాన
తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, రామచంద్రపురం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన జోరువానలు కురిశాయి.  మన్యం, కోనసీమలోనూ మంచి వర్షం కురిసింది.

పశ్చిమలో భారీ వర్షం
పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి నిరంతరాయంగా వర్షం కురుస్తూనే ఉంది. 15 మండలాల్లో 15 మిమీ కంటే అధికవర్షపాతం నమోదైంది. ఈదురు తాడేపల్లిగూడెం, ఆచంట, పోలవరం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, పాలకొల్లు, వీరవాసరం, బుట్టాయాగూడెం, వరిచేలు నేలకొరిగాయి. కూరగాయల పంటలు పూత దశలో ఉండటంతో నష్టం ఎక్కువగా ఉంటుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు