close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇంటిపై యుద్ధం

టిడ్కో ఇళ్లపై అధికార, ప్రతిపక్షాల వాగ్వాదం
తీవ్రస్థాయికి చేరుకున్న వ్యక్తిగత విమర్శల పర్వం
చంద్రబాబు, స్పీకర్‌ మధ్య మాటల యుద్ధం

మాటలు హద్దులు మీరాయి. వ్యాఖ్యలు గీత దాటాయి. ఎక్కడికక్కడ వ్యక్తిగత విమర్శలు, దూషణ పర్వాలతో రెండోరోజు శాసనసభ సమావేశాలు దద్దరిల్లాయి. ప్రతిపక్షనేత చంద్రబాబుపై సీఎం జగన్‌, సభాపతి తమ్మినేని సీతారామ్‌ తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశారు. మండలిలోనూ అదే పరిస్థితి. తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ను ఉద్దేశించి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా వ్యాఖ్యానించారు. టిడ్కో ఇళ్ల కేటాయింపుపై మాట్లాడేందుకు చంద్రబాబు ఎన్నిసార్లు కోరినా అవకాశం ఇవ్వకపోవడంతో.. వెల్‌లోకి వెళ్లి నిరసనకు దిగిన 13 మంది తెదేపా సభ్యులను ఒక రోజు సస్పెండ్‌ చేశారు.

కేసులు వేసింది వైకాపా నేతలే
జగన్‌ తన పాదయాత్ర సమయంలో పట్టణ పేదలందరికీ ఉచితంగా ఇళ్లు ఇస్తామని చెప్పారు. 300 చదరపు అడుగుల ఫ్లాట్లు మాత్రమే ఇస్తానని చెప్పలేదు. పేదవాళ్ల పట్ల వివక్ష వద్దు. విస్తీర్ణం ఎంతన్నదాంతో సంబంధం లేకుండా అందరికీ ఇళ్లు ఇవ్వాలి. జగన్‌కు ప్యాలెస్‌లు కావాలి.. పేదలకు పూరిళ్లు ఉండా¦లా? తెదేపా హయాంలో 23 లక్షల ఇళ్లు ప్రారంభించి, 10 లక్షల ఇళ్లు పూర్తిచేశాం. పేదలకు ఇళ్లపట్టాలను తెదేపా అడ్డుకుంటోందని, కేసులు వేసిందని ఆరోపిస్తున్నారు. కోర్టులకు వెళ్లింది వైకాపా నాయకులే.

- చంద్రబాబు

నరకంలోనూ చోటు దొరకదు
చంద్రబాబుకు గుడ్డితనం వచ్చిందో, కళ్లద్దాల సైజు సరిపోవడం లేదో తెలీదు. పట్టణ పేదలకు 300 చదరపు అడుగుల ఇళ్లు ఉచితంగా ఇస్తానని నేనన్న విషయం స్పష్టంగా కనిపిస్తున్నా.. అబద్ధాలు చెబుతున్న చంద్రబాబుకు నరకంలోనూ చోటు దొరకదు. ఆయన దగ్గర సబ్జెక్టు లేదు. ఏం చెప్పాలనుకుంటున్నారో స్పష్టత లేదు. ఆయనను అర్జెంటుగా ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చితే తప్ప సమాజానికి, రాష్ట్రానికి ఇబ్బంది తప్పదు. ఆయన అప్పర్‌ కంపార్ట్‌మెంట్‌ పోయింది. ఆయనను అలాగే వదిలేస్తే రాష్ట్రంలో అందరికీ పిచ్చి పడుతుంది.

- సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: పేదలకు ఇళ్ల పట్టాలు, టిడ్కో గృహాల అంశంపై అధికార, విపక్ష సభ్యుల పరస్పర విమర్శలు, ఆరోపణలు, దూషణలు, ఆవేశకావేశాలతో మంగళవారం శాసనసభ దద్దరిల్లింది. ముఖ్యమంత్రి జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగింది. శాసనసభాపతి తమ్మినేని సీతారాం, చంద్రబాబు మధ్య కూడా ఒక దశలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ తమ చేతిలో ఉన్న కాగితాలను వారి ఎదురుగా ఉన్న బల్లలపై విసిరికొట్టారు. దానిపై స్పీకర్‌ తీవ్రంగా స్పందిస్తూ.. ‘వేలు చూపించి బెదిరిస్తే, మీ ఉడత ఊపులు.. పిల్లి శాపాలకు ఎవరూ భయపడరు’ అని వ్యాఖ్యానించారు. ‘ఏం మాట్లాడుతున్నావ్‌? పోడియం వద్దకు వచ్చి బెదిరిస్తున్నావ్‌. ఏమనుకుంటున్నావ్‌’ అని తీవ్రస్వరంతో హెచ్చరించారు. తాను మాట్లాడేటప్పుడు మంత్రులు, అధికారపక్ష నాయకులు పదే పదే అడ్డుతగలడం.. వారికి స్పీకర్‌ అవకాశమిస్తూ, తనను మాట్లాడనివ్వకపోవడంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి లోనయ్యారు. అసెంబ్లీ అంటే మీ సొంత వ్యవహారం కాదని హెచ్చరించారు. తమ నాయకుడికి మాట్లాడేందుకు మైకు ఇవ్వడం లేదని చంద్రబాబు మినహా సభలో ఉన్న తెదేపా ఎమ్మెల్యేలంతా వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. సీఎం సూచన మేరకు.. 13 మంది తెదేపా శాసనసభ్యులను సస్పెండ్‌ చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. వారిని మంగళవారం ఒక్కరోజు సమావేశాల నుంచి స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. వెల్‌లో ఉన్న ఎమ్మెల్యేలను మార్షల్స్‌ ఎత్తుకుని తీసుకువెళ్లేందుకు యత్నించగా కొందరు తెదేపా ఎమ్మెల్యేలు వారితో ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. తమ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు నిరసనగా చంద్రబాబు వాకౌట్‌ చేసి బయటకు వెళ్లిపోయారు. తర్వాత సీఎం ప్రసంగం కొనసాగింది.

స్పీకర్‌, చంద్రబాబు వాగ్యుద్ధం
ఇళ్లపట్టాలు, టిడ్కో గృహాలపై మంత్రులు శ్రీరంగనాథరాజు, బొత్స సత్యనారాయణ, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మొదట మాట్లాడారు. ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇస్తుంటే.. చంద్రబాబు కోర్టులో కేసులు వేయించి, తనకున్న పూర్వ పరిచయాలతో స్టేలు తెచ్చారని బొత్స విమర్శించారు. చంద్రబాబు హయాంలో కేంద్రం 7లక్షలకు పైగా టిడ్కో ఇళ్లు మంజూరు చేస్తే, 4.54 లక్షల ఇళ్లకే టెండర్లు పిలిచారని, వాటిలో 77,371 మాత్రమే 90% పూర్తయ్యాయని తెలిపారు. మౌలికవసతులు కల్పించలేదన్నారు. బొత్స చెబుతున్నదంతా ‘ఫేక్‌’ అని చంద్రబాబుపేర్కొన్నారు. తండ్రిలాంటి మామను చంపాలన్న ఆలోచన చంద్రబాబుకే తప్ప తమకు ఉండదని బొత్స అన్నారు. వైఎస్‌ను జగనే చంపించారని శాసనసభలోనే బొత్స అన్నారని తెదేపా ఎమ్మెల్యే డీబీవీ స్వామి చెప్పారు. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ వేడెక్కింది. పేదలకు 30 లక్షల ఇళ్లస్థలాలు ఇస్తున్న జగన్‌ పేరును గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కించాలని వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి పేర్కొనగా, మంత్రి కన్నబాబు దాన్ని సమర్థించారు. వాళ్లు మాట్లాడుతున్నంతసేపూ తనకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను చంద్రబాబు కోరుతూనే ఉన్నారు. అంతలో వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కి స్పీకర్‌ అవకాశం ఇవ్వడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది ఈ నాలుగు గోడల మధ్య వ్యవహారం కాదు. 5కోట్ల మంది గమనిస్తున్నారు. సభా సంప్రదాయాలు పాటించాలి. ఇది అసెంబ్లీ అని గుర్తుపెట్టుకోండి. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. దానికి స్పీకర్‌ తీవ్రంగా స్పందించారు. ‘నా ప్రవర్తన గురించి మాట్లాడతావా.. టేక్‌ కేర్‌. ప్రతిపక్ష నేత అయితేఏంటి? వేలుపెట్టి వార్నింగ్‌ ఇస్తావా..జాగ్రత్త’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. సీఎం జోక్యం చేసుకుని.. చర్చ మొదలయ్యాక, అధికారపక్షం తరఫున మొదటి సభ్యుడు మాట్లాడకముందే చంద్రబాబుకు అంత అసహనం ఏంటని ప్రశ్నించారు. స్పీకర్‌కి చంద్రబాబు క్షమాపణ చెప్పాలని మంత్రి శంకరనారాయణ డిమాండ్‌ చేశారు. అంబటి రాంబాబు, మంత్రి అంజాద్‌బాషా, కరణం ధర్మశ్రీ తదితరులు కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ విషయాన్ని చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నానని, సభ కొనసాగిద్దామని స్పీకర్‌ పేర్కొన్నారు.

కోర్టులకు వెళ్లింది మీ వాళ్లే: చంద్రబాబు
తెదేపా హయాంలో పట్టణ పేదల కోసం కట్టిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు ఇవ్వడం లేదని, తీవ్ర అనిశ్చితి నెలకొందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘బాబు స్కీం కావాలా, జగన్‌ స్కీం కావాలా? అని ప్రభుత్వం ప్రకటన ఇవ్వడం విడ్డూరం. ఆధారాలతో సహా వాస్తవాలు చెబుతుంటే అధికారపక్షం ఉలిక్కి పడుతోంది. మా హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు జగన్‌ పేరు పెట్టుకుంటున్నారు. జగన్‌ స్టిక్కర్‌ సీఎం అని తేలిపోయింది. వైఎస్‌ హయాంలో ఇళ్ల నిర్మాణంలో రూ.4,500 కోట్ల అవినీతి జరిగింది. మా హయాంలో అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి ఇంటినీ జియోట్యాగింగ్‌ చేశాం. షియర్‌వాల్‌ టెక్నాలజీతో నాణ్యమైన ఇళ్లు కట్టించాం’ అని పేర్కొన్నారు.  తెదేపా హయాంలో 23 లక్షల ఇళ్లు ప్రారంభించి, 10 లక్షల ఇళ్లు పూర్తిచేశామని తెలిపారు. ‘‘వైకాపా అధికారంలోకి వచ్చాక ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. పేదలకు ఇళ్లపట్టాలను తెదేపా అడ్డుకుంటోందని, కోర్టులో కేసులు వేసిందని ఆరోపిస్తున్నారు. ఒక్క ఆధారం చూపండి. కోర్టులకు వెళ్లింది వైకాపా నాయకులే. తణుకు ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారని, వైకాపా నాయకుడు, మాజీ మున్సిపల్‌ఛైర్మన్‌ లేఖ రాశారు. తెనాలిలో రూ.5లక్షల విలువ చేసే భూమిని రూ.70లక్షలకు కొని అక్రమాలకు పాల్పడితే కోర్టు స్టే ఇచ్చింది. ఆవ భూముల్లో రూ.400కోట్ల అవినీతికి పాల్పడ్డారు. మడ భూముల్లో స్థలాలిస్తున్నారు. కుందూ నదికి దగ్గర్లో 7,500 మందికి పట్టాలు ఇస్తున్నారు. వాటిపై కోర్టులు స్టే ఇచ్చాయి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. 


తెదేపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

ఆ అంశంపై చంద్రబాబు మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా.. ఇక ఆయన ఎంతసేపు మాట్లాడినా అదే విషయం పదే పదే తిప్పి చెబుతారని, తాను మొత్తం వివరంగా చెబుతానని సీఎం పేర్కొన్నారు. చంద్రబాబుకు అవకాశం ఇవ్వకపోవడంతో తెదేపా ఎమ్మెల్యేలంతా వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. దీంతో బెందాళం అశోక్‌, కె.అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవాని, నిమ్మకాయల చినరాజప్ప, గణబాబు, జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్‌, గద్దె రామ్మోహన్‌, వెలగపూడి రామకృష్ణబాబు, రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, సత్యప్రసాద్‌, డీబీవీ స్వామిలను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. మార్షల్స్‌ వారిని చేతులతో పైకెత్తి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ కొంత దురుసుగా వ్యవహరించడంతో.. రవికుమార్‌, స్వామి, సత్యప్రసాద్‌ వారిని నెట్టేశారు. దురుసు ప్రవర్తన మానుకోవాలని చంద్రబాబు మార్షల్స్‌ని హెచ్చరించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు