ఏపీలోనూ విజయ డెయిరీకి ఆదరణ

ప్రధానాంశాలు

ఏపీలోనూ విజయ డెయిరీకి ఆదరణ

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ విశ్వాసం

ఈనాడు, విజయవాడ, న్యూస్‌టుడే విజయవాడసిటీ: తెలంగాణకు చెందిన విజయ డెయిరీని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దుతామని ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ విజయ బ్రాండ్‌ను ఆదరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. విజయ డెయిరీ ఉత్పత్తులను ఏపీలో పరిచయం చేసేందుకు శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సహకార రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు.హైదరాబాద్‌లోని శంషాబాద్‌ వద్ద 40 ఎకరాల్లో రూ.250 కోట్లతో మెగా డెయిరీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.  కార్యక్రమంలో విజయడెయిరీ ఎండీ శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్రన్‌, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తెలంగాణ పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ లోకా భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు భాజపా యత్నం
ఒక శాసన సభ స్థానం, జీహెచ్‌ఎంసీలో కొన్ని స్థానాలు గెలిచిన భాజపా నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని.. ఇది సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శించారు. ‘తెలంగాణలో 24 గంటలు విద్యుత్తు అందిస్తున్నాం. గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించాం. కోటి ఎకరాలకు సాగునీరు అందించాం. ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడైనా అమలు చేస్తున్నారా?. మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు భాజపా ప్రయత్నిస్తోంది’ అని విమర్శించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని