దివీస్‌.. ఒక్క ఇటుక కూడా కదపొద్దు

ప్రధానాంశాలు

దివీస్‌.. ఒక్క ఇటుక కూడా కదపొద్దు

సంస్థ ప్రతినిధులకు మంత్రి గౌతమ్‌రెడ్డి స్పష్టీకరణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రజల అభ్యంతరాలు, సందేహాలు తీరేవరకూ దివీస్‌ పరిశ్రమ ఒక్క ఇటుక కూడా కదపకూడదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. నిరసనకారులపై కేసుల ఉపసంహరణకు యాజమాన్యం ముందుకు రావాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్‌ ల్యాబ్‌్ ఏర్పాటు వివాదంపై పరిశ్రమల శాఖ అధికారులు, దివీస్‌ సంస్థ ప్రతినిధులు, కాలుష్య నియంత్రణ మండలి ఎండీతో మంత్రి గౌతమ్‌రెడ్డి శనివారం దృశ్యమాధ్యమ భేటీలో మాట్లాడారు. ఈ సందర్భంగా దివీస్‌ యాజమాన్యం ముందు మంత్రి పలు ప్రతిపాదనలు ఉంచారు. కాలుష్యం విషయంలో మత్స్యకారుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, వారితో చర్చించాలని సూచించారు. పరిశ్రమలో తప్పనిసరిగా స్థానికులకే 75% ఉద్యోగాలివ్వాలని చెప్పారు. సీఎస్‌ఆర్‌ నిధులతో పాటు స్థానికుల క్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

కేసుల ఉపసంహరణకు సిద్ధం: దివీస్‌ డైరెక్టర్‌
నిరసన వ్యక్తం చేసిన రైతులు, మత్స్యకారులపై పెట్టిన కేసుల ఉపసంహరణకు దివీస్‌ పరిశ్రమ డైరెక్టర్‌ కిరణ్‌ దివి అంగీకరించినట్లు మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలపై సానుకూలంగా ఉన్నాం. సీఎం, మంత్రి ఆదేశాల ప్రకారం మరింతగా సాయం చేసేందుకు సిద్ధం. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తాం’’ అని దివీస్‌ డైరెక్టర్‌ పేర్కొన్నట్లు వివరించింది.

ఎట్టి పరిస్థితుల్లో రాదు: దాడిశెట్టి రాజా
తొండంగి, తుని పట్టణం, న్యూస్‌టుడే: దివీస్‌ పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లో రాదని, ఈ విషయంలో పోరాడాల్సి వస్తే తానే ముందుంటానని తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. ఆందోళనల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకల వద్ద శనివారం ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. ఇటీవల తాను ఈ విషయమై ముఖ్యమంత్రిని కలవగా... ‘అన్నా మనమే మాటిచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్లడానికి కుదరదు. పర్యావరణానికి ఇబ్బందులు లేకుండా చూస్తామని కంపెనీ చెబుతోంది. వాళ్ల వివరణ విని మీకు నచ్చినట్లు చేద్దాం’ అని సీఎం చెప్పారన్నారు. ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా స్థానికులు, ఆందోళనకారులు అడ్డుతగిలారు.


ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా: యనమల

ఈనాడు, అమరావతి: దివీస్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మత్స్యకారులు, మహిళలపై తప్పుడు కేసులు పెట్టి, జైళ్లకు పంపడం దుర్మార్గమని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. కేసులు తక్షణం ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన శనివారం ఒక లేఖ రాశారు. ‘‘ఈ ప్రాంత ప్రజలకు మీరిచ్చిన హామీలను నెరవేర్చకుండా మాటతప్పి పర్యావరణ విధ్వంసానికి పూనుకోవడం, ప్రశ్నించిన వారి గొంతు నొక్కాలని చూడటం నిరంకుశ పాలనకు నిదర్శనం’’ అని యనమల మండిపడ్డారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని