కత్తితో పొడుచుకున్న కౌలురైతు
close

ప్రధానాంశాలు

కత్తితో పొడుచుకున్న కౌలురైతు

అధికారులు పంట దక్కకుండా చేస్తున్నారని ఆరోపణ

వేమూరు, న్యూస్‌టుడే: పొలం వివాదాన్ని సాకుగా చూపి, తాను సాగు చేసిన పంటను స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో రెవెన్యూ, పోలీసు అధికారులు తనకు దక్కకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ భట్టిప్రోలుకు చెందిన కౌలురైతు సలీమ్‌ పొలంలోనే కత్తితో పొడుచుకొని ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా, వేమూరు మండలం, పోతుమర్రు గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామంలో ఉన్న 7.5ఎకరాల పొలం విషయంలో 2017 నుంచి అదే గ్రామానికి చెందిన పద్మావతికి, తెనాలికి చెందిన శివారెడ్డికి వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురిపై ఇప్పటికే వేమూరు పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. అయితే ఈ ఖరీఫ్‌లో పద్మావతి దగ్గర పొలం కౌలుకు తీసుకున్న సలీమ్‌ నాటు వేయగా, శివారెడ్డి అదే పొలాన్ని పోతుమర్రుకు చెందిన బాబూరావుకు కౌలుకు ఇచ్చాడు. సాగు చేసే విషయంలో కౌలుదారుల మధ్య వాగ్వాదం జరిగి కొట్టుకోవడంతో సలీమ్‌, బాబూరావులపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.

పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు: ప్రస్తుతం వరి పంట కోత దశకు చేరడంతో ఇటు సలీమ్‌, అటు శివారెడ్డి కోతకోయడానికి కూలీలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గొడవ జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఈ నెల 12వ తేదీన పొలం వద్ద పికెట్‌ ఏర్పాటు చేశారు. సమస్యపై తహసీల్దార్‌ శిరీషకు సమాచారం ఇవ్వండంతో ఆమె ఈ నెల 19న రెవెన్యూ చట్టం ప్రకారం 145 నోటీసు ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇరువర్గాలతో పనిలేకుండా పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు మంగళవారం యంత్రంతో కోత ప్రారంభిస్తున్న సమయంలో సలీమ్‌ రెండు కత్తులతో కడుపులో పొడుచుకొని, చేతిపై కోసుకున్నాడు. అధికారులు చేతగాని తనం వల్ల తనకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే పోలీసులు అతన్ని బలవంతంగా గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ‘మాపై ఎవ్వరి ఒత్తిడి లేదు. రెండు వర్గాలపై గతంలో ఆరు కేసులు నమోదయ్యాయి. సమస్యను తహసీల్దార్‌కు వివరించాం. రెవెన్యూ అధికారులు పంటను స్వాధీనం చేసుకునే క్రమంలో సలీమ్‌ అడ్డుపడడమే కాకుండా, ఆత్మహత్యకు ప్రయత్నించినందుకు అతనిపై కేసు నమోదు చేశాం’ అని ఎస్సై లోకేశ్వరరావు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని