ఇళ్ల పట్టాల పంపిణీని ఆపలేం: హైకోర్టు
close

ప్రధానాంశాలు

ఇళ్ల పట్టాల పంపిణీని ఆపలేం: హైకోర్టు

స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. కౌంటర్‌ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఉమాదేవితో కూడిన ధర్మాసనం గురువారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం ఇళ్ల స్థలాలను దూర ప్రాంతంలో ఇస్తోందని.. లబ్ధిదారుల కుటుంబం వేరే ప్రాంతానికి తరలి వెళ్లడం వల్ల నియోజకవర్గాల పునర్విభజనపై   ప్రభావం పడుతుందంటూ మాడుగుల నాగశంకర్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది డీఎస్‌ఎన్‌వీ ప్రసాదబాబు వాదనలు వినిపిస్తూ.. ‘’ఈనెల 25న రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనుంది. లబ్ధిదారుల కుటుంబాల్లో కోటి మందికిపైగా ఓటర్లు ఉంటారు. వారందరినీ ప్రభుత్వం ఏకపక్షంగా వలసపోయేలా చేస్తుంది. దీని వల్ల నియోజకవర్గాల పునర్విభజనపై ప్రభావం చూపుతుంది’’అని అన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ వలసలు అని ఎలా చెబుతారని  పునరావాసం కల్పించడంగా  ఎందుకు భావించకూడదని వ్యాఖ్యానించింది. ఈ కారణంగా ప్రభుత్వం చేపట్టిన ఈ పథకంపై స్టే ఇవ్వలేమని స్పష్టంచేసింది. ఇళ్ల స్థలం పేరుతో లబ్ధిదారుల జీవించే హక్కును హరించడానికి వీల్లేదని న్యాయవాది బదులిచ్చారు. ఇళ్ల స్థలాలను స్థానికంగా ఇవ్వాలి తప్ప దూరంగా కాదన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ అక్కడికెళ్లి స్థలం తీసుకోవాలని ఎవరు చెప్పారని ప్రశ్నించింది. స్థలం తీసుకోవాలా? లేదా? అనేది లబ్ధిదారుల ఇష్టంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.

ఏపీఐఐసీ భూముల్లో పట్టాలు ఇవ్వవద్దు
కడప జిల్లా గుండ్లమడుగు గ్రామంలోని ఏపీఐఐసీకి చెందిన 227 ఎకరాల్లో ఇళ్ల పట్టాల పంపిణీని నిలువరిస్తూ గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. గుండ్లమడుగులో ఇళ్ల స్థలాలిచ్చేందుకు ఏపీ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ)కి చెందిన 227 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 16న జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వ్యవసాయ కూలి జి.అంకల్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని