మీ బిడ్డ పొరపాటు చేసి ఉంటే మన్నించండి
close

ప్రధానాంశాలు

మీ బిడ్డ పొరపాటు చేసి ఉంటే మన్నించండి

ప్రాజెక్టుల నిర్వాసితులను క్షమాపణ కోరిన సీఎం
గండికోటలో 26.85, చిత్రావతిలో 10.13 టీఎంసీల నిల్వ
పులివెందులలో రూ.5 వేల కోట్ల పనులకు శంకుస్థాపన
అపాచీ పరిశ్రమ, ఇర్మా ఏర్పాటుకు భూమిపూజ

ఈనాడు డిజిటల్‌, కడప: ‘ప్రభుత్వ చర్యలతో గండికోట, చిత్రావతి జలాశయ నిర్వాసితులకు ఇబ్బంది కలిగే ఉంటుంది. మీ బిడ్డ పొరపాటు చేసి ఉంటే నిర్వాసితులు మన్నించాలని కోరుతున్నా. వాళ్ల త్యాగంతోనే లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలుగుతున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కడప జిల్లాలో రెండోరోజు పర్యటనలో భాగంగా ఆయన పులివెందులలో రూ.5 వేల కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌, చర్చిలో కుటుంబసభ్యులతో కలిసి జగన్‌ ప్రార్థనలు చేశారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడుతూ ‘శ్రీశైలం నిండుగా ఉన్నప్పుడే రాయలసీమకు నీటిని తరలించాలనే ఉద్దేశంతోనే జలాశయాల్లో ఎక్కువ నీటిని నిల్వచేయాల్సి వచ్చింది. నిర్వాసితులకు త్వరితగతిన పరిహారం చెల్లించి ఇళ్లు ఖాళీ చేయించాం. ఇది కొంచెం కష్టమైనా ప్రభుత్వానికి సహకరించినందుకు నిర్వాసితులకు కృతజ్ఞతలు చెబుతున్నా. మరో 2 నెలల్లో నిర్వాసితుల ఇబ్బందులు పరిష్కరించి, వారి ముఖాలపై చిరునవ్వు వచ్చేలా కలెక్టర్‌ కృషిచేయాలి. రైతులకు మంచి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఎంతటి కష్టమైన పనైనా త్వరగా పూర్తిచేయవచ్చు. ఈ నెల 21 నాటికి గండికోటలో 26.85 టీఎంసీలు, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ జలాశయంలో 10.13 టీఎంసీల నీటిని నిల్వ చేయడమే ఇందుకు నిదర్శనం’ అని పేర్కొన్నారు.

ఆ ప్రాజెక్టుల కింద సూక్ష్మసేద్యం
గతేడాది డిసెంబరు 25న తాను శంకుస్థాపనలు చేసిన పనుల పురోగతిని సీఎం జగన్‌ సభలో వెల్లడించారు.పులివెందులలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం, వేముల మండలంలో యురేనియం ప్రభావిత 7 గ్రామాలకు తాగు, సాగునీటి సరఫరాకు చేపట్టిన ప్రాజెక్టు పనులను 2021 ఫిబ్రవరిలో ప్రారంభిస్తామని తెలిపారు. కొత్తగా శంకుస్థాపన చేస్తున్న పథకాలపై మాట్లాడుతూ.. ‘గండికోట నుంచి నీటిని చిత్రావతి, పైడిపాలెం జలాశయాలకు తరలించేందుకు వీలుగా రూ.3 వేల కోట్లతో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశా. పులివెందుల బ్రాంచి కాలువ, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, గండికోట ఎత్తిపోతల పథకం కింద ఉన్న ఆయకట్టును సూక్ష్మసేద్యం పరిధిలోకి తీసుకొస్తున్నాం’అని పేర్కొన్నారు.

పులివెందుల సమీపంలోని ఏపీ కార్ల్‌ వద్ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌- ఆనంద్‌ (ఇర్మా) ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, గుజరాత్‌కు చెందిన ఇర్మా సంస్థ అధ్యక్షుడు బిస్వాస్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం అపాచీ పరిశ్రమ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అపాచీ సంస్థ సుమారు రూ.70 కోట్ల పెట్టుబడితో పులివెందులలో పరిశ్రమను ఏర్పాటు చేస్తోందని సీఎం తెలిపారు. ఈ సంస్థ శ్రీకాళహస్తిలో మరో పరిశ్రమ ఏర్పాటు చేస్తుందన్నారు. తైపీ ఆర్థిక, సాంస్కృతిక కేంద్రం డీజీ బెన్‌ వాంగ్‌ మాట్లాడుతూ సీఎం వచ్చే ఏడాదిలో తైవాన్‌కు రావాలని ఆహ్వానించారు.


శ్రీశైలంలో నీళ్లున్నప్పుడు తోడుకోవాలి

‘గతంలో ఎన్నడూ గండికోటలో 12 టీఎంసీలకు మించి నిల్వ చేయలేకపోయారు. రెండేళ్లుగా శ్రీశైలంలో పుష్కలంగా నీళ్లున్నాయి. రికార్డులను పరిశీలిస్తే ఏటేటా శ్రీశైలంలో నీటి నిల్వ తగ్గుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌లో నీటిమట్టం 881 అడుగుల వరకు ఉంటేనే 44 వేల క్యూసెక్కులను కిందకు తీసుకోగలం. అది 854 అడుగులకు పడిపోతే 7 వేల క్యూసెక్కులే వస్తాయి. గత 15 ఏళ్ల లెక్కలుచూస్తే.. ఏడాదిలో  25 రోజులుమాత్రమే నీటిమట్టం 881అడుగులు ఉంటోంది. భవిష్యత్తులో శ్రీశైలంలో 40 రోజులపాటు వరద కొనసాగితే రాయలసీమలోని జలాశయాలన్నింటినీ నింపేలా కృషి చేస్తున్నాం’ అని జగన్‌ వివరించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని