
ప్రధానాంశాలు
తొలి రోజు 332 కేంద్రాల్లో 33,200 మందికి కరోనా వ్యాక్సిన్
దిల్లీ నుంచి ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
విజయవాడ జీజీహెచ్‌కు రానున్న ముఖ్యమంత్రి జగన్
లబ్ధిదారుల ఫోన్లకు ఎస్ఎంఎస్లు
ఈనాడు, అమరావతి: కొవిడ్ టీకా పంపిణీ శనివారం నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 332 కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బందికి టీకాలు ఇవ్వనున్నారు. ఇందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసింది. ప్రధాని మోదీ ఉదయం 10.30 గంటలకు లాంఛనంగా టీకా పంపిణీ ప్రారంభిస్తారు. విజయవాడ జీజీహెచ్‌లో ఉండే లబ్ధిదారులతో ప్రధాని మోదీ దిల్లీ నుంచి వర్చువల్ విధానంలో మాట్లాడే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ జీజీహెచ్‌కు ఉదయం 11.25 గంటలకు వస్తారు. అనంతరం టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.10 గంటలకు తిరిగి బయలుదేరుతారు. టీకా వేయించుకునే వారితో సీఎం మాట్లాడే అవకాశం ఉంది. రాష్ట్రానికి 4.96 లక్షల డోసుల టీకా వచ్చింది. ఇందులో 20వేల డోసులు కొవాగ్జిన్ (భారత్ బయోటెక్), మిగిలినవి కొవిషీల్డ్ (సీరం). తొలివిడతలో కొవిషీల్డ్‌నే లబ్ధిదారులకు వేయనున్నారు.
తొలిరోజు ఒక్కోచోట వందమంది చొప్పున 332 కేంద్రాల్లో 33,200 మందికి టీకాలు ఇవ్వబోతున్నారు. ప్రాధాన్యక్రమంలో వీరి సెల్ఫోన్లకు శుక్రవారం నుంచి సంక్షిప్త సమాచారం వెళ్లడం మొదలైంది. దీని ప్రకారం వారు టీకా వేయించుకోవాలి. గుర్తింపుకార్డు
చూపిస్తేనే పంపిణీ కేంద్రానికి అనుమతిస్తారు. కనీసం 15 రోజుల వరకు ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రోజూ 33,200 మందికి టీకా వేస్తారు. ¸టీకా వేయించుకున్న వారికి తిరిగి 28 రోజుల తర్వాత మలివిడత టీకా వేస్తామని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ భాస్కర్ కాటంనేని తెలిపారు.
పంపిణీ కేంద్రాల ఆసుపత్రుల్లో పనిచేసే వారికి తొలి ప్రాధాన్యం
టీకా పంపిణీకి ఎంపికచేసిన కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి బోధనాసుపత్రి వరకు ఉన్నాయి. వందమందికి పైగా ఆరోగ్య సిబ్బంది పనిచేసే ప్రైవేటు ఆసుపత్రులనూ కేంద్రాలుగా ఎంపికచేశారు. తొలుత వీటిలో పనిచేసే ఆరోగ్య సిబ్బందికి టీకా ఇస్తారు. ఆ తర్వాత సమీపంలోని ఆసుపత్రుల్లో పనిచేసే ఆరోగ్య సిబ్బందిని ఎంపిక చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నుంచి వెళ్లిన ఆదేశాలను బట్టి జిల్లాల్లోనూ ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి కేంద్రాల సంఖ్యను క్రమంగా పెంచుతారు. అదనంగా వచ్చే టీకా, మౌలిక సదుపాయాలను బట్టి ఈ కేంద్రాల పెంపు ఉంటుంది. ప్రతి కేంద్రంలో వైద్యాధికారితో కలిపి ఆరుగురు వ్యాక్సినేషన్ సిబ్బంది ఉంటారు. ఈ 332 కేంద్రాల్లో కలిపి 2,324 మంది విధులు నిర్వర్తించబోతున్నారు. ప్రతి కేంద్రంలో మూడు గదులు ఏర్పాటుచేశారు.
వైద్యబృందాలు సిద్ధం
టీకా పంపిణీ సందర్భంగా ఎవరికైనా ప్రతికూల పరిస్థితులు తలెత్తితే వెంటనే చికిత్స అందించేందుకు ప్రత్యేక బృందాలను వైద్యశాఖ సిద్ధం చేసింది. ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఈ బృందాలు అందుబాటులో ఉంటాయి. అత్యవసర చికిత్సకు అవసరమైన ఇంజక్షన్లు, మందుల కిట్లను పంపిణీ కేంద్రాల్లోనే సిద్ధం చేశారు. ప్రతి కేంద్రాన్నీ వైద్యాధికారి పర్యవేక్షిస్తారని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటంనేని వెల్లడించారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ఆ యాడ్‌లోని చిన్నారి కృతిశెట్టినే..!
- ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
- నటి హిమజకు పవన్ లేఖ
- బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
- భార్య, బిడ్డ బతికితే చాలనుకున్నా!
- అంబానీ ఇంటి వద్ద వాహనం మా పనే
- రేణిగుంట ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత
- సమ్మర్ మూడ్‌లో కీర్తి.. బికినీలో బిపాస..
- గాలికొడుతుండగా పేలిన టైరు: ఇద్దరు మృతి
- విద్యార్థిని అత్యాచారం డ్రామా!