
ప్రధానాంశాలు
డీపీఆర్‌లు ఇవ్వకుండా కొత్త వాటిని చేపట్టొద్దు
ఆంధ్ర ఒక ప్రాజెక్టుకే ఇచ్చింది
తెలంగాణ ఒక్కటీ ఇవ్వలేదు
ముఖ్యమంత్రులకు కేంద్ర జల్‌శక్తి మంత్రి షెకావత్ లేఖలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు ముందు చేపట్టినా, కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపినా, ప్రాజెక్టు పరిధి మారితే కొత్తదిగానే పరిగణించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు తక్షణమే అందజేయండి. వాటికి అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపే వరకు... ఒప్పందాలు చేసుకోవద్దు. నిర్మాణాలూ చేపట్టవద్దు.
- కేంద్ర మంత్రి షెకావత్
ఈనాడు, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్) వెంటనే అందజేయాలని కేంద్రం ఆదేశించింది. వాటికి అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపే వరకు... ఒప్పందాలు చేసుకోవద్దని, నిర్మాణాలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. కృష్ణా, గోదావరి నదుల పరీవాహకంలో (బేసిన్) రెండు తెలుగు రాష్ట్రాలు చేపట్టిన 34 ప్రాజెక్టులను ఆపాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్మోహన్రెడ్డి, కేసీఆర్‌లకు వేర్వేరుగా లేఖలు రాశారు. అవి శనివారం వెలుగులోకి వచ్చాయి. 15 ప్రాజెక్టులకుగానూ తెలంగాణ నుంచి ఒక్క ప్రాజెక్టు డీపీఆర్ కూడా అందలేదని, ఆంధ్రప్రదేశ్ నుంచి 19 ప్రాజెక్టులకుగానూ ఒకటి మాత్రమే అందిందని, మరో రెండింటివి అందినా సమగ్రంగా లేవని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు రెండు రాష్ట్రాలు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిశీలనకు డీపీఆర్‌లు సమర్పించడం తప్పనిసరని, తర్వాత అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తెలపాల్సి ఉంటుందని గుర్తు చేశారు. పునర్విభజన చట్టంతో సంబంధం లేకుండా కృష్ణా, గోదావరి నదులపై ఏ ప్రాజెక్టు చేపట్టినా కేంద్రం నుంచి నీటి లభ్యత, అంతర్రాష్ట్ర, పర్యావరణ అనుమతి, పెట్టుబడి అనుమతులు ఇవ్వబోమని, కృష్ణా జల వివాద ట్రైబ్యునల్‌లో ప్రస్తావించారా, పునర్విభజన చట్టంలో ప్రస్తావించారా... అన్న దాంతో సంబంధం లేకుండా కేంద్ర జలసంఘం నుంచి సాంకేతిక, ఆర్థిక అనుమతి, జల్‌శక్తి సాంకేతిక సలహా మండలి (టీఎసీ) అనుమతి పొందాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి షెకావత్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు ముందు చేపట్టినా, కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపినా, ప్రాజెక్టు పరిధి మారితే కొత్తదిగానే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టత ఇచ్చారు. గత ఏడాది అక్టోబరు ఆరున జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో డీపీఆర్‌లు సమర్పించడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయని గుర్తు చేశారు. డీపీఆర్‌లు అందజేసిన తర్వాత అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే కేంద్ర మంత్రి లేఖలో పేర్కొన్న ప్రాజెక్టుల్లో రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే పూర్తయినవి కూడా కొన్ని ఉండటం గమనార్హం.
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి..
2020 డిసెంబరు 16న జరిగిన సమావేశంలో డీపీఆర్‌లపై చర్చించాం. మన సమావేశం తర్వాత వాటి గురించి మంత్రిత్వశాఖ అధికారులను అడిగా. రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించిన డీపీఆర్ వచ్చినా నిబంధనల ప్రకారం లేకపోవడంతో.. తిరిగి సమర్పించాలని ఆంధ్రప్రదేశ్‌ను కోరినట్లు జలసంఘం అధికారులు తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతలకు సంబంధించి ఒకటి, రెండు వాల్యూమ్‌లు గత అక్టోబరు 5న గోదావరి బోర్డుకు అందాయి. మూడో వాల్యూమ్నూ అందజేయాలని బోర్డు కోరింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు సంబంధించి డిసెంబరు 21న సమర్పించిన డీపీఆర్ తప్ప మరొకటి రాలేదని అధికారులు చెప్పారు. ఈ లేఖకు జత చేస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు అందజేసి, అనుమతి పొందండి...
* కృష్ణా పరీవాహకంలోని 15 ప్రాజెక్టుల్లో ముచ్చుమర్రి, గుండ్రేవుల, గాజులదిన్నె స్థిరీకరణ ప్రాజెక్టు, గురు రాఘవేంద్ర ఎత్తిపోతల, పులికనుమ, సిద్దాపురం, శివభాష్యం ఎత్తిపోతల, మున్నేరు పథకం, ఆర్డీఎస్ కుడికాలువ సామర్థ్యం పెంపు, ఆర్డీఎస్-సుంకేశుల మధ్య తుంగభద్రపై ఎత్తిపోతల, వైకుంఠపురం బ్యారేజీ సామర్థ్యం పెంపు, గోదావరి-పెన్నా అనుసంధానం, వేదవతి ఎత్తిపోతల, నాగులదిన్నె ఎత్తిపోతల, రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు, బనకచెర్ల సామర్థ్యం 80 వేల క్యూసెక్కులకు పెంచే పనులున్నాయి.
* గోదావరి బేసిన్లో పట్టిసీమ ఎత్తిపోతల, పురుషోత్తపట్నం ఎత్తిపోతల, చింతలపూడి ఎత్తిపోతల, చింతలపూడి-పట్టిసీమల ద్వారా గోదావరి-పెన్నా అనుసంధానం మొదటి దశ ఉన్నాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు..
కృష్ణా, గోదావరి పరీవాహకంలో 15 ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు ఒక్కటీ అందలేదు. డిసెంబరు 11న మీతో జరిగిన సమావేశంలో డీపీఆర్‌లపై చర్చించామని, ఈ సమావేశం తర్వాత తెలంగాణ అందజేసిన డీపీఆర్‌ల వివరాలను సమర్పించాలని జల్‌శక్తి మంత్రిత్వశాఖను అడగ్గా ఇప్పటివరకు ఏమీ రాలేదని సమాధానమిచ్చారని కేంద్ర మంత్రి లేఖలో పేర్కొన్నారు. డీపీఆర్‌లు రావాల్సిన వాటిలో...
* కృష్ణా బేసిన్లో... పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, భక్తరామదాసు, మిషన్ భగీరథ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు, తుమ్మిళ్ల, కల్వకుర్తి, నెట్టెంపాడు, శ్రీశైలం ఎడమగట్టు కాలువ పనులున్నాయి.
* గోదావరి బేసిన్లో... గోదావరి ఎత్తిపోతల మూడో దశ, సీతారామ ఎత్తిపోతల, తుపాకులగూడెం, తాగునీటి సరఫరా పథకం, లోయర్ పెన్‌గంగపై మూడు బ్యారేజీలు, రామప్ప చెరువు నుంచి పాకాలకు నీటిని మళ్లించే పని, కాళేశ్వరం ఎత్తిపోతల మూడో టీఎంసీల పనులకు సంబంధించిన డీపీఆర్‌లు అందజేయాలి.
ప్రధానాంశాలు
దేవతార్చన

- నేనున్నానని..
- పంత్ ‘GOAT’ అవుతాడు: దాదా
- యువతిపై 60 మంది అత్యాచారం!
- బైక్ ఎక్కిన కృతి.. పుస్తకం పట్టిన కాజోల్
- 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు జాతీయ కమిటీ
- మనసు లాగుతోందా బంగారం
- రివ్యూ: పవర్ ప్లే
- పేలింది పంత్ పటాకా
- విమానం బయల్దేరే ముందు షాకిచ్చాడు..
- చెల్లి పెళ్లికి అధిక కట్నం ఇస్తున్నారని అక్కసు!