close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆలయాలపై దాడులు

అక్రమాలు నిగ్గుతేల్చేందుకు ప్రధానాలయాల్లో షాడో కమిటీలు
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
రామమందిర నిర్మాణానికి రూ.30 లక్షల విరాళం

ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే-తిరుపతి: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి శుక్రవారం తిరుమల వచ్చిన ఆయన.. సంప్రదాయ దుస్తులు ధరించి ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించారు. దర్శనానంతరం పవన్‌ తిరుపతిలో విలేకర్లతో మాట్లాడారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 142 ఆలయాలపై దాడులు జరిగాయి. ఇవి వైకాపా ప్రభుత్వం చేసిందని నిందించట్లేదు. విగ్రహాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం నచ్చలేదు. రామతీర్థానికి నేను వెళ్లలేక కాదు. ఆలయాలపై దాడులు చేసేవారు కొద్దిమందే. నేను అక్కడికి వెళ్తే చాలామంది అమాయకులు బలవుతారు. విగ్రహాలు పోతే మళ్లీ పెడతాం, రథం కాలిపోతే ఇంకొకటి చేయిస్తాం అనడం సరైంది కాదు. ఇలాంటివి మరో మతంపై జరిగితే ఇలానే మాట్లాడతారా’ అని ప్రశ్నించారు.
ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు..
స్వామిపై నమ్మకం లేని వారు తితిదేలో పనిచేస్తున్నారని పవన్‌ ఆరోపించారు. ఆలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాజకీయాలకు వినియోగిస్తున్నారని విమర్శించారు. ‘తిరుమలలో ముక్కోటికి రెండు రోజులే ద్వారం తెరుస్తారు. పది రోజులు తెరవడమేంటి? అక్రమాలు వెలికి తీసేందుకు తిరుమల సహా ప్రధాన ఆలయాలకు షాడో కమిటీలు ఏర్పాటుచేస్తాం’ అని అన్నారు.

వారం రోజుల్లో నిర్ణయం
‘తిరుపతి పార్లమెంటుకు జనసేన పోటీ చేయాలని పార్టీ నేతలు కోరుతున్నారు. భాజపా నేతలు పక్కన పెడుతున్నారంటున్నారు. ఆ పార్టీ జాతీయ నాయకులకు, నాకు మధ్య అవగాహన చాలా బలమైంది. తిరుపతిలో ఎవరు పోటీ చేస్తారనేది వారంలో నిర్ణయిస్తాం’ అని పవన్‌కల్యాణ్‌ వివరించారు.
విరాళం అందజేత
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పవన్‌కల్యాణ్‌ రూ.30లక్షల విరాళాన్ని అందజేశారు. విరాళం డీడీని ఆర్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర చీఫ్‌ భరత్‌జీకి తిరుపతిలో శుక్రవారం అందించారు. తన వ్యక్తిగత సిబ్బంది సమకూర్చిన రూ.11,000 చెక్కునూ అందజేశారు.
కార్యకర్తల జోలికొస్తే తాట తీస్తాం
ఈనాడు డిజిటల్‌ ఒంగోలు: జనసేన పార్టీ కార్యకర్తల జోలికొస్తే తాట తీస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. ప్రకాశం జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్త వెంగయ్య ఇటీవల ఆత్మహత్య చేసుకోగా కుటుంబాన్ని పరామర్శించేందుకు శుక్రవారం రాత్రి ఆయన ఒంగోలు వచ్చారు. ‘నా కార్యకర్తలకు అన్యాయం జరిగితే కాళ్లు, చేతులు ముడుచుకుని కూర్చోలేను. వైకాపా నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును రానున్న ఎన్నికల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చూస్తాం’ అన్నారు.ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు