ఆ అధికారుల్ని తప్పించలేం

ప్రధానాంశాలు

ఆ అధికారుల్ని తప్పించలేం

సిబ్బందికి టీకాలు వేయకుండా ఎన్నికలు జరపలేం
వ్యాక్సిన్‌ వేసిన 60 రోజుల తర్వాతే నిర్వహించగలం
దానికి అనుగుణంగా కొత్త షెడ్యూల్‌ ప్రకటించండి
సుప్రీంలో విచారణ పూర్తయ్యే వరకు నోటిఫికేషన్‌ వద్దు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సీఎస్‌ లేఖ
ఈనాడు - అమరావతి

పోలింగ్‌ సిబ్బందికి కరోనా టీకా వేయడం, వారిని ఎన్నికల విధుల్లో నియమించడం ఒకేసారి సాధ్యం కావని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి రెండు డోసుల కరోనా టీకా వేసి, వారిలో పూర్తిస్థాయిలో రోగనిరోధకశక్తి పెంపొందే వరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేమని తేల్చిచెప్పింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది మొత్తానికి తొలి డోస్‌ కరోనా టీకా వేసిన 60 రోజుల తర్వాతే ఎన్నికలు నిర్వహించేలా కొత్త షెడ్యూల్‌ రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేశామని, దానిపై విచారణ ముగిసే వరకు ఎన్నికల నిర్వహణపై ముందుకెళ్లొద్దని విజ్ఞప్తి చేసింది. గత మార్చిలో ఎన్నికల ప్రక్రియలో అక్రమాల్ని, హింసను నిరోధించడంలో విఫలమైన అధికారులను విధుల నుంచి తప్పించాలన్న ఎస్‌ఈసీ ఆదేశాల్ని పాటించలేమనీ స్పష్టం చేసింది. ‘మీరు కళంకిత అధికారులుగా చెబుతున్నవారు కరోనా టీకాల కార్యక్రమంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు’ అని పేర్కొంది.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పంచాయతీ ఎన్నికలు, కరోనా టీకాల కార్యక్రమాల నిర్వహణకు అనువైన షెడ్యూల్‌ను రూపొందించుకోవచ్చని వివరించింది. ఈ మేరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ శుక్రవారం లేఖ రాశారు. ఆ లేఖను పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌ రాత్రి 8 గంటల సమయంలో ఎస్‌ఈసీ కార్యాలయానికి వెళ్లి సహాయ కార్యదర్శికి అందజేశారు. ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ స్వల్ప అస్వస్థతకు గురవడంతో వారిని కలవలేకపోయారని, అందుకే వారి నుంచి లేఖను సహాయ కార్యదర్శి తీసుకున్నారని ఎన్నికల కమిషన్‌ వర్గాలు తెలిపాయి.
షెడ్యూల్‌ ప్రకటించకముందే మాట్లాడాల్సింది
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలంటూ రమేశ్‌కుమార్‌ గురువారం తనకు రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు.. సీఎస్‌ లేఖలో బదులిచ్చారు.  రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు అనువైన వాతావరణం లేదన్నారు. అనుకూల వాతావరణం ఏర్పడినప్పుడు ఎస్‌ఈసీ ఆదేశాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలన్న ఎస్‌ఈసీ ఆదేశాలకు బదులిస్తూ.. ‘ఎన్నికల నిర్వహణపై సన్నద్ధతను తెలుసుకునేందుకు.. షెడ్యూల్‌ ప్రకటించకముందే ప్రభుత్వంతో అర్థవంతమైన సంప్రదింపులు జరపాల్సింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఎన్నికల నిర్వహణతో పాటు, టీకాల కార్యక్రమానికి రవాణా, తదితర ఏర్పాట్లను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించాలి. ఇందుకు త్వరలోనే తేదీని ఖరారు చేసి తెలియజేస్తాం. ఆ రెండు కార్యక్రమాల్నీ సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఎస్‌ఈసీపైనా ఉంది’ అని తెలిపారు.
అలాగైతే టీకాలను వాయిదా వేయాలి
‘ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సిన పోలీసులు, ఇతర విభాగాల సిబ్బందికి మొదటి డోస్‌ టీకా వేసిన నాలుగు వారాలకు రెండో డోస్‌ వేయాలి. తర్వాత మరో నాలుగు వారాలకు వారిలో రోగనిరోధకశక్తి ఏర్పడుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలంటే కరోనా టీకాల కార్యక్రమాన్ని వాయిదా వేయాలి. అది జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్ని ఉల్లంఘించడమే. 200 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనే కార్యక్రమానికి ‘క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌’ విధుల్లో వ్యాక్సిన్‌ వేయకుండా సిబ్బందిని పంపించలం. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బంది మొత్తానికి టీకా వేయాలంటే అవసరమైన ఏర్పాట్ల కోసం కేంద్రానికి లేఖ రాయాలి. ఎన్నికల్ని సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడుతుంది. అలాగే ఎన్నికల విధులకు పంపడానికి ముందు పోలింగ్‌ సిబ్బందికి టీకాలు వేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘమూ పూర్తిగా సహకరిస్తుందని భావిస్తున్నాం. ప్రజారోగ్యం, ప్రజాప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని.. ఎన్నికల షెడ్యూల్‌ను సవరించాలన్న మా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాం’ అని సీఎస్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘంలో పనిచేస్తున్న సిబ్బందిని ఎస్‌ఈసీ ఏకపక్షంగా తొలగించారని సీఎస్‌ పేర్కొన్నారు. ఎన్నికల సంఘానికి అవసరమైన సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని