చిత్తూరు, గుంటూరు కలెక్టర్లపై వేటు

ప్రధానాంశాలు

చిత్తూరు, గుంటూరు కలెక్టర్లపై వేటు

ఓ ఎస్పీ, డీఎస్పీ, నలుగురు సీఐలపైనా చర్యలు
ఆ అదనపు ఎస్పీకి ఎన్నికల విధులొద్దు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలు
తక్షణమే వారంతా విధుల నుంచి వైదొలగాలని నిర్దేశం
ఈనాడు - అమరావతి

ఎన్నికల ప్రక్రియలో ఉల్లంఘనల్ని అడ్డుకోవటంలో విఫలమయ్యారని, హింసను నియంత్రించలేకపోయారనే కారణాలతో పలువురు ఉన్నతాధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం విధుల నుంచి తొలగించింది. వీరిలో చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, తిరుపతి అర్బన్‌ ఎస్పీతో పాటు, శ్రీకాళహస్తి డీఎస్పీ (ప్రస్తుత అనంతపురం జిల్లా అదనపు ఎస్పీ), మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం (బదిలీ అయ్యారు), తాడిపత్రి ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. గతంలో పలమనేరు డీఎస్పీగా పనిచేసి ప్రస్తుతం తిరుపతి అదనపు ఎస్పీగా వ్యవహరిస్తున్న అరిఫుల్లాను ఎన్నికల విధులకు దూరం పెట్టింది. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం వీరిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో వేరేవారిని నియమించేందుకు వీలుగా ప్యానల్‌ జాబితాలు పంపించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఎన్నికల సంఘం ఆదేశించింది. గతేడాది మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా ఈ అధికారుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. వారిపై చర్యలు తీసుకోవాలంటూ రమేశ్‌కుమార్‌ 2020 మార్చి 15న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కొవిడ్‌ విస్తృతి నేపథ్యంలో.. ఎన్నికల ప్రక్రియను మధ్యలోనే వాయిదా వేయటం, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును సుప్రీంకోర్టు నిలిపివేయటంతో ఈ అంశంలో ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు అవరోధాలన్నీ తొలగిపోవటంతో.. కళంకిత అధికారులను తొలగించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ఈ నెల 8న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మరోమారు తాను లేఖ రాసినట్లు రమేశ్‌కుమార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో వారందరినీ విధుల నుంచి తొలగిస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చారు. గతేడాది మార్చి 15న జారీ చేసిన ఆదేశాల్లో అప్పటి గుంటూరు రూరల్‌ ఎస్పీ సీహెచ్‌.విజయరావును కూడా విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. సాధారణ బదిలీల్లో ఆయన రైల్వే ఎస్పీగా వెళ్లిపోవటంతో ప్రస్తుత ఆదేశాల్లో ఆయన అంశాన్ని ప్రస్తావించలేదు.
తప్పుడు సంకేతాలు ఇవ్వకూడదనే..
‘కళంకిత అధికారుల తొలగింపుపై ఈ నెల 21న మరోమారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశాను. ప్రభుత్వం మరోమారు అదే తరహా అవిధేయతను ప్రదర్శించింది. అలాంటి అధికారులను ఎన్నికల విధుల్లో కొనసాగిస్తే తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుంది. వారి పక్షపాత ధోరణి, ప్రవర్తన.. ఎన్నికల నిర్వహణపై కూడా ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం అభిప్రాయాల్ని మార్చుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆర్టికల్‌ 243(కే) రెడ్‌ విత్‌ ఆర్టికల్‌ 324 ప్రకారం.. సంబంధిత కళంకిత అధికారులను తొలగిస్తున్నా’ అని రమేశ్‌కుమార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని