close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విస్తరిస్తున్న కలవరం!

కొమిరేపల్లిలో అంతుచిక్కని వ్యాధి బారిన 25 మంది
ఏలూరులో మరో ఇద్దరు
పూళ్లలో కాస్త తగ్గిన ఉద్ధృతి

ఈనాడు, అమరావతి, ఈనాడు డిజిటల్‌, ఏలూరు - దెందులూరు, న్యూస్‌టుడే: అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొమిరేపల్లిలో 25 మంది, భీమడోలులో ఇద్దరు, ఏలూరులో ఇద్దరు చొప్పున ఆసుపత్రి పాలయ్యారు. భీమడోలు మండలంలో బాధితుల సంఖ్య 36కు చేరింది. దెందులూరు మండలం కొమిరేపల్లిలో గురువారం రాత్రి తొలి కేసు నమోదవగా, శుక్రవారం కొత్తగా 24 మంది వ్యాధి బారినపడ్డారు. వీరిలో పురుషులు 16, మహిళలు 9 మంది ఉన్నారు. వీరిలో 21 మంది కోలుకోగా నలుగురు చికిత్స పొందుతున్నారు. మూడు చోట్లా బాధితులందరిలోనూ కళ్లు తిరగటం, స్పృహ కోల్పోవడం, నీరసంతో చతికిలపడటం, నోటి నుంచి నురగ రావడం వంటి లక్షణాలు కనిపించాయి. ఎవరికీ ప్రాణాపాయ పరిస్థితి లేదని వైద్యులు స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌సింఘాల్‌, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ భాస్కర్‌ కాటంనేని, ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ గీతా ప్రసాదినితోపాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని కొమిరేపల్లికి చేరుకున్నారు. కలెక్టర్‌ ముత్యాలరాజు, జాయింట్‌ కలెక్టర్‌ హిమాన్షు శుక్లా గ్రామంలో 10 మంది వైద్యులతో రెండు వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. జిల్లా ఆసుపత్రిలో మందులు, పడకలు సిద్ధం చేశారు.
ఏలూరులో డిసెంబర్‌ 4న మొదలైన అంతుచిక్కని వ్యాధి కలవరం దాదాపు రెండు వారాలపాటు కొనసాగింది.
మొత్తం 622 మంది వరకు ఆస్పత్రిలో చేరారు. క్రమంగా కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఇంతలోనే శుక్రవారం నగరంలోని రామకృష్ణాపురానికి చెందిన ఒక బాలిక, తూర్పువీధికి చెందిన ఓ వృద్ధుడు ఇవే లక్షణాలతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చారు.

ఇది వన్‌టైం ఎపిసోడ్‌
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఘటన ‘వన్‌టైం ఎపిసోడ్‌’ (ఒకసారి సంభవించే ఘటన)గా ఉన్నత స్థాయి కమిటీ అభిప్రాయపడినట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. కొమిరేపల్లిలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ... ‘గత ఏడాది డిసెంబరులో ఏలూరులో పలువురు అకస్మాత్తుగా పడిపోయిన సంఘటనకు కారణాలపై అధ్యయనం చేయడానికి జాతీయ సంస్థలు వివిధ రకాల నమూనాలను సేకరించాం. ముంబయి, దిల్లీ, పుణె, హైదరాబాద్‌, ఇతరచోట్ల ఉన్న వివిధ సంస్థల నుంచి వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించిన నివేదికను త్వరలో సీఎం జగన్‌కు అందచేస్తాం. అవసరమైనచోట్ల నీటి, ఆహార పదార్థాల నమూనాలు పరీక్షించేందుకు ప్రయోగశాలలను అభివృద్ధి చేయబోతున్నాం. ఏలూరు కెనాల్‌ వెంట ఉన్న గ్రామాల్లో నమూనాలను సేకరిస్తాం’ అని వివరించారు. అనంతరం సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ మాట్లాడుతూ... ‘సీఎం జగన్‌ ఆదేశాలతో కొమిరేపల్లికి వచ్చాం. వైద్యుల చికిత్సతో బాధితులు వెంటనే కోలుకుంటున్నారు. ఎవ్వరూ కంగారుపడాల్సిన అవసరంలేదు. వైద్య బృందాలు అన్ని వేళల్లోనూ సిద్ధంగా ఉంటాయి’ అని భరోసా ఇచ్చారు.
రాజకీయ కుట్ర కోణం ఉండొచ్చు: ఆళ్ల నాని
అంతుచిక్కని వ్యాధుల సంఘటనలకు సంబంధించి రాజకీయ కుట్రకోణం ఉన్నట్లు భావించాల్సి వస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అనుమానం వ్యక్తంచేశారు. కొమిరేపల్లిలో బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... ‘పరిస్థితి అదుపులోనే ఉంది. ఇటీవల ఏలూరు పరిసర ప్రాంతాల్లో వ్యాధిని వారం రోజుల్లో పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాం. రెండు రోజుల కిందట పూళ్ల, శుక్రవారం కొమిరేపల్లిలో అక్కడక్కడా కేసులు నమోదు కావడం అనుమానాలకు తావిస్తోంది. నమూనాల పరీక్షల నివేదికలు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని వివరించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, జేసీ హిమాన్షు శుక్లా, డీఎంహెచ్‌వో సునంద తదితరులు ఉన్నారు.
తోపులాట.. కిందపడిన జనసేన నాయకురాలు
కొమిరేపల్లిలో బాధితులను పరామర్శించడానికి వచ్చిన జనసేన దెందులూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి అక్కడ జరిగిన తోపులాటలో కిందపడ్డారు. పార్టీ కండువా వేసుకుని వెంకటలక్ష్మి అక్కడికి రావడంపై ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి అభ్యంతరం తెలిపారు. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆమెను అక్కడి నుంచి పంపించేయాలని వైకాపా కార్యకర్తలకు ఆయన సూచించారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని వెంకటలక్ష్మిని అక్కడి నుంచి పంపించే క్రమంలో తోపులాట జరగ్గా... ఆమె కిందపడ్డారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ మంత్రి, ఎమ్మెల్యేల సమక్షంలో పోలీసులు తనపై చేయి చేసుకున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
ఏలూరు కాలువపై ప్రత్యేక దృష్టి
ఏలూరు కాలువ ద్వారా వంద గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందని శువ్రారంనాటి అధికారిక సమావేశంలో చర్చ జరిగింది. ఈ కాలువ వెంబడి ఉన్న గ్రామాలు, నీటి సరఫరా కేంద్రాలు, ఇతరచోట్ల నమూనాలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. పూళ్ల గ్రామంలో సేకరించిన నీటి, ఆహార పదార్థాల నమూనాలను పరీక్షించగా అనుమానించదగ్గ ఫలితాలు రాలేదని, కొమిరేపల్లెలోనూ నమూనాలను సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో 12 రకాల కూరగాయలు, మూడు ప్రదేశాల్లో మాంసం, పది రకాల బియ్యం, రెండు రకాల పప్పు దినుసులు, నూనె, పాల నమూనాలు సేకరించి కొన్నింటిని ఏలూరు ప్రయోగశాలకు, ఇంకొన్నింటిని హైదరాబాద్‌లోని ఐఐసీటీకి పంపారు. సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. బాధితులు తీసుకున్న ఆహారంపై ఆరా తీశారు. గ్రామానికి చుట్టూ పొలాలు ఉండటంతో ఇటీవల పురుగు మందులు పిచికారీ చేయడం.. తదితర అంశాలనూ పరిశీలిస్తున్నారు.

కుటుంబం అంతా బాధితులం
- గుర్రం శేషగిరిరావు, కొమిరేపల్లి

మొదట నా భార్య, కొడుకు మూర్ఛ, తలనొప్పి, కాళ్లు చేతులు వణుకుతో కళ్లు తిరిగి పడిపోయారు. వారిని నేను ఆసుపత్రికి తీసుకొచ్చా. ఇంతలో మా ఇద్దరు అబ్బాయిలు, నేను కూడా పడిపోయాం. తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. కళ్లు తెరిచి చూస్తే అందరం ఆసుపత్రిలో ఉన్నాం. తర్వాత మా తమ్ముడి కొడుకు కూడా పడిపోయాడు. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను.

వారం రోజుల్లో రెండుసార్లు పడ్డాను
- శ్రీనివాసరావు, పూళ్ల

వారం రోజుల్లో రెండుసార్లు మూర్ఛ వచ్చింది. మొదట గత ఆదివారం అనూహ్యంగా తలనొప్పితో కళ్లుబయర్లు కమ్మాయి. ఒక్కసారిగా ఇంట్లో సింక్‌పై పడ్డాను. భుజానికి బలమైన గాయమైంది. స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లా. మళ్లీ అదే తరహాలో గురువారం మూర్ఛ వచ్చింది. ఈ సమయంలో నాలుక కొరుక్కోవటంతో గాయాలయ్యాయి.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు