close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఉత్కంఠ

నేడు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌
ఎన్నికలపై చకచకా ఎస్‌ఈసీ నిర్ణయాలు
ఇప్పట్లో సాధ్యం కాదు.. సమయం కావాలన్న ప్రభుత్వం
సుప్రీంకోర్టులో పిటిషన్‌
సోమవారం విచారణ
అధికారులు, న్యాయనిపుణులతో సీఎం చర్చలు
సిబ్బందికి టీకాల తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీకి సీఎస్‌ లేఖ
ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై శుక్రవారమంతా హైడ్రామా నడిచింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పిన తర్వాత కూడా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణపై అటు ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉండటంతో..  శుక్రవారం రాత్రి పొద్దుపోయేవరకు ఉత్కంఠ నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో షెడ్యూల్‌ ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రమేశ్‌కుమార్‌ కృతనిశ్చయం ప్రదర్శిస్తుండగా.. ఇప్పట్లో ఎన్నికలు సాధ్యం కాదని, ఇంకా సమయం కావాలన్న ధోరణికే ప్రభుత్వం కట్టుబడి ఉంది. తొలిదశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ శనివారం ఉదయం 10 గంటలకు జారీ చేస్తామని ప్రకటించిన రమేశ్‌కుమార్‌... శుక్రవారం ఉదయం నుంచీ అందుకు తగ్గట్లుగా చకచకా నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారం రప్పించుకున్నారు. గత మార్చిలో ఎన్నికల ప్రక్రియ సందర్భంగా అక్రమాల్ని, హింసను నివారించడంలో విఫలమయ్యారన్న కారణంతో 9 మంది అధికారుల్ని విధుల నుంచి తప్పించాలని ఆదేశించారు.
రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహాయ సహకారాలందించేలా చూడాలని కోరారు. ఒకపక్క ఎన్నికల కమిషనర్‌ ఇలా తీరిక లేకుండా ఉండగా.. మరోపక్క ఎన్నికలు జరగకుండా చూసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి జగన్‌ తన కార్యాలయంలో అధికారులతో మంతనాలు సాగించారు. సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ క్యాంప్‌ కార్యాలయం కేంద్రంగానూ చర్చలు జరిగాయి. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు రావాలని ఎస్‌ఈసీ జారీ చేసిన ఆదేశాల్ని పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌ మొదట పట్టించుకోలేదు. ముఖ్యమంత్రితో అత్యవసర సమావేశం ఉన్నందున, తమకు వేరే సమయం కేటాయించాలని కోరారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎస్‌ఈసీ వారికి సమయమిచ్చారు. ఈలోగా ద్వివేది, గిరిజాశంకర్‌లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసింది. వివరాలు సరిగ్గా లేవని మొదట కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించడంతో ప్రభుత్వ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. తప్పుల్ని సవరించి మళ్లీ పిటిషన్‌ వేయడంతో సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టడంతో.. ప్రభుత్వం ఆశించినట్టుగా ఆ పిటిషన్‌ శుక్రవారం విచారణకు రాలేదు. సోమవారం దీనిపై విచారణ జరగనుంది. ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం సాయంత్రం హోం మంత్రి సుచరిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌లతో ప్రభుత్వ వ్యూహంపై చర్చించారు. మరోపక్క ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్‌తో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని స్పష్టం చేశారు.

ఎస్‌ఈసీ కార్యాలయంలో ఉత్కంఠ
సాయంత్రం 4 గంటలు దాటినా ద్వివేది, గిరిజాశంకర్‌ రాకపోవడంతో రమేశ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు గంటల్లోగా రావాలని, అదే చివరి అవకాశమని గిరిజా శంకర్‌కు మెమో జారీ చేశారు. వారిద్దరూ ఎస్‌ఈసీ కార్యాలయానికి వెళుతున్నట్టు సాయంత్రం 5.30 గంటలకు మీడియాకి సమాచారం వచ్చింది. కానీ వారు నేరుగా సీఎస్‌ దగ్గరకు వెళ్లారు. ప్రభుత్వ వైఖరిని పునరుద్ఘాటిస్తూ లేఖ సిద్ధం చేశారు. ద్వివేది, గిరిజాశంకర్‌ ఆ లేఖను తీసుకుని రాత్రి 8 గంటల సమయంలో ఎస్‌ఈసీ కార్యాలయానికి వెళ్లి అందజేశారు. మీడియా ప్రతినిధుల కంటపడకుండా వేరే మార్గంలో తిరిగి వెళ్లారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అన్ని విభాగాల సిబ్బందికీ కరోనా వ్యాక్సిన్‌ వేసిన తర్వాత, 60 రోజులు దాటాకే ఎన్నికలు నిర్వహించాలని అప్పటి వరకు వాయిదా వేయాలని ఎస్‌ఈసీని లేఖలో కోరారు. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించలేమని, ఎస్‌ఈసీ ఆదేశించినట్టుగా అధికారులపైనా చర్యలు తీసుకోలేమని తెలిపారు. సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేవరకు ఎన్నికలపై ముందుకెళ్లొద్దనీ విజ్ఞప్తి చేశారు. మొత్తంగా ఎన్నికల నిర్వహణ కోసం ఎస్‌ఈసీ ప్రభుత్వాన్ని కోరిన ఏ చర్యలకూ సీఎస్‌ సానుకూలంగా స్పందించకపోవడం గమనార్హం.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు