ఎస్‌ఈసీ ఎందరిని బదిలీ చేసినా పట్టించుకోం
close

ప్రధానాంశాలు

ఎస్‌ఈసీ ఎందరిని బదిలీ చేసినా పట్టించుకోం

పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ ఇప్పటికే బదిలీ అయ్యారు
ఏకగ్రీవాలకు ప్రజలు ముందుకు రావాలి
మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, ఆ శాఖ కమిషనర్‌ ఇప్పటికే బదిలీ అయ్యారు.. ఆయన (రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌) ఇంకా ఎంత మందిని బదిలీ చేసుకున్నా మేం పట్టించుకోం’ అని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఓటర్లను డబ్బు. మద్యంతో ప్రలోభపెట్టి గెలిచే సర్పంచులపై తర్వాత అనర్హత వేటు వేసి, రెండేళ్లపాటు శిక్షపడేలా చట్టం ఉందని తెలిపారు. పల్లెల్లో విద్వేషాలు రాకుండా పంచాయతీలకు ఏకగ్రీవ ఎన్నికలను ప్రభుత్వాలు ప్రోత్సహించడం ఆనవాయితీ అని చెప్పారు. పార్టీల రహితంగా జరిగే ఎన్నికలు కాబట్టి ఏకగ్రీవం చేసుకోవడం ద్వారా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక మొత్తాన్ని తీసుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో పాల్గొంటారు. వ్యాక్సినేషన్‌ ఎలా కొనసాగించాలనే దానిపై కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి, కేంద్ర హోంశాఖ, కేంద్ర ఆరోగ్యశాఖలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖలు పంపుతున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే ఎన్నికలను వాయిదావేయాలని కోరాం తప్ప ఎన్నికలకు భయపడి కాదు. 90శాతంపైగా పంచాయతీల్లో వైకాపా గెలుస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి, ఆశాఖ కమిషనర్‌ల బదిలీ విషయమై మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు తప్పించి అధికారికవర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేదు.
ప్రజారోగ్యం పణంగానా?: కన్నబాబు
ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ తన వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘కోర్టులను మేము గౌరవిస్తాం. సుప్రీంకోర్టు తీర్పు శిరోధార్యమే. ఈ రోజు జరిగిన ఈ నిర్ణయం ఒక వ్యక్తి పట్టుదలకు, ఒక పార్టీ కుట్రకి నిదర్శనంగా భావిస్తున్నామ’ని వ్యాఖ్యానించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని