close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వాలంటీర్లు వద్దు

వారిని పంచాయతీ ఎన్నికలకు దూరంగా పెట్టండి
కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో అలసత్వం వహించే తహసీల్దార్లపై చర్యలు
ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులు పరిశీలించి సహకారం
ఎన్నికల్లో కలిసి పని చేద్దాం
కలెక్టర్లతో వీడియో సమావేశంలో ఎన్నికల కమిషనరు రమేశ్‌ కుమార్‌

ఈనాడు, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో గ్రామ వాలంటీర్లను వినియోగించరాదని, వారు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమిషనరు రమేశ్‌ కుమార్‌ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తహసీల్దార్లు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో ఆలసత్వం వహించినట్లు ఫిర్యాదులొస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. ఉద్యోగుల విజ్ఞప్తులను ఎన్నికల సంఘం పరిశీలించి సహాయ సహకారాలు అందిస్తుందని ప్రకటించారు. విజయవాడ నుంచి బుధవారం జిల్లాల్లోని ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో రమేశ్‌ కుమార్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఆర్థిక, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్‌శాఖల ముఖ్య కార్యదర్శులు రావత్‌, సింఘాల్‌, ద్వివేది, పంచాయతీరాజ్‌ కమిషనరు గిరిజా శంకర్‌ కూడా సమావేశంలో ఉన్నారు.
తీవ్ర పదజాలాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు
‘ఉద్యోగ సంఘాలు ఎన్నికల సంఘంపై తీవ్ర పదజాలంతో మాట్లాడినా పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఉద్యోగుల పక్షాన నిలిచిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలను స్వాగతిస్తున్నా. వీలైనంతవరకూ ఉద్యోగుల విజ్ఞప్తులను ఎన్నికల సంఘం పరిశీలించి సహాయ సహకారాలు అందిస్తుంది. ఇతర రాష్ట్రాల కంటే దీటుగా ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నాం. ఓటర్లు, ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని పోలింగ్‌ సమయాన్ని పొడిగించాం. రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఎన్నికలు సజావుగా సాగేలా అంతా సహకరించాలి’ అని ఎన్నికల కమిషనరు విజ్ఞప్తి చేశారు.
పోలింగ్‌ పరిశీలనకు యాప్‌
‘ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఓటింగ్‌ ప్రక్రియ, పోలింగ్‌ కేంద్రాల లోపల, బయట జరిగే ఘటనలపై పరిశీలనకు యాప్‌ తీసుకొస్తున్నాం. పోలింగ్‌ వీడియో క్లిప్పింగులు, ఫొటోలను అందులో అప్‌లోడ్‌ చేయొచ్చు. వీటిని పరిశీలించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఏకగ్రీవాలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు ఖరారైతే సంబంధిత ఆర్వో, ఏఆర్వోలపై చర్యలు తీసుకుంటాం’ అని రమేశ్‌ కుమార్‌ హెచ్చరించారు.
ఎన్నికలు సమర్ధంగా పూర్తి చేద్దాం: సీఎస్‌
ఎన్నికల ప్రక్రియను సమన్వయంతో, సమర్ధంగా పూర్తి చేద్దామని ఈ సందర్భంగా సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ పేర్కొన్నారు. కొవిడ్‌పై ఆందోళన చెందొద్దని, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని వెల్లడించారు. టీకా ప్రక్రియ సమాంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కొవిడ్‌ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
పోలీసు సిబ్బందికి టీకాలు: డీజీపీ
ఎన్నికల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి రెండు రోజుల ముందే టీకా అందేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసు బృందాలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం శాంతి భద్రతల విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు.
ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలి: ద్వివేది
కలెక్టర్లు ఎన్నికలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సూచించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చి పోలింగ్‌ సామగ్రిని సిద్ధం చేయాలన్నారు. బ్యాలట్‌ పత్రాల ముద్రణ లాంటి పనులను స్థానికంగానే చేసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కలెక్టర్లు పంపే ప్రతిపాదనలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి తదనుగుణంగా ఉత్తర్వులు ఇస్తామన్నారు.
టీకా కార్యక్రమంలో మార్పు లేదు:
వైద్య ఆరోగ్యశాఖ కమిషనరు

కొవిడ్‌ టీకాల కార్యక్రమంలో మార్పేమీ లేదని, అది యథావిధిగా కొనసాగుతుందని వైద్య ఆరోగ్యశాఖ కమిషనరు కె.భాస్కర్‌ తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లో సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు, గ్లోవ్స్‌ అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి, అధికారులకు టీకాలు ఇస్తామని తెలిపారు. సమావేశంలో శాంతి భద్రతల అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌, ఐజీ ఎస్‌.సంజయ్‌, డీఐజీ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

గతం చూడొద్దు..

ఎన్నికలను సజావుగా నిర్వహించడమే ధ్యేయంగా అంతా పని చేయాలి. గతం చూడొద్దు.. నేనూ చూడను. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కలిసికట్టుగా పనిచేద్దాం. నాకున్న విశేష అధికారాలను దుర్వినియోగం చేయబోనని స్పష్టం చేస్తున్నా.

-కలెక్టర్లతో సమావేశంలో రమేశ్‌ కుమార్‌


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు