
ప్రధానాంశాలు
అది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనే
బలవంతపు ఏకగ్రీవాలను సహించం
ఎస్ఈసీ రమేశ్ కుమార్ స్పష్టీకరణ
ఈనాడు, అమరావతి: ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక దానికి సంబంధించిన విషయాలన్నీ ఎన్నికల సంఘం పరిధిలోనే ఉంటాయని, ఎన్నికలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూసే ఏ చర్యనూ ప్రభుత్వం గానీ, ప్రభుత్వ సంస్థలు గానీ... ఎస్ఈసీ దృష్టికి తీసుకురాకుండా చేపట్టకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించేలా సమాచార పౌరసంబంధాల శాఖ (ఐ అండ్ పీఆర్) కమిషనరు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని, అది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని ఆయన స్పష్టం చేశారు. దానిపై ఐ అండ్ పీఆర్ కమిషనరు నుంచి సంజాయిషీ కోరినట్లు బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. బలవంతపు ఏకగ్రీవాలను సహించేది లేదన్నారు. ‘ప్రోత్సాహకాలు పెంచుతున్నాం కాబట్టి ఏకగ్రీవాలు చేసుకోండని సూచిస్తూ ప్రభుత్వం పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇవ్వడంపై నాలుగైదు పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. మళ్లీ ఏకగ్రీవాల దిశగా పంచాయతీ ఎన్నికలను మలుపు తిప్పడానికి జరుగుతున్న ప్రయత్నంలో భాగంగానే ఆ ప్రకటన ఇచ్చారన్న భయాందోళనలు వ్యక్తం చేశాయి’ అని ఎస్ఈసీ పేర్కొన్నారు. ‘ఆ ప్రకటన నిజమేనని, ఆ ప్రకటనలోని కొన్ని విషయాలు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేలా ఉన్నాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చాం. పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్న అంశాలు నేరుగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించినవి. అలాంటి ప్రకటనలు జారీచేసే ముందు ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు ముందస్తుగా ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలి. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తూ ఏ అధికారంతో ఆ ప్రకటనలు జారీ చేశారో వివరణ ఇవ్వాలని ఐ అండ్ పీఆర్ కమిషనరును కోరాం’ అని ఆ ప్రకటనలో రమేశ్ కుమార్ పేర్కొన్నారు. గ్రామస్థులందరి ఏకాభిప్రాయంతో సాధారణంగా జరిగే ఏకగ్రీవాలను ఎవరూ తప్పుపట్టరని, బలవంతపు ఏకగ్రీవాలను, ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించడాన్ని మాత్రం కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందని రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఒకవేళ ఏకగ్రీవాలు జరిగినా నిశితంగా పరిశీలించాకే ఆమోదించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- బాబు గీసిన బొమ్మ.. ఎంజాయ్ చేస్తోన్న అనుపమ
- మార్చి 4 నుంచి రష్మిక మకాం అక్కడే!
- జయసుధను ఇలా చూశారా..?
- సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- ఇంతకీ నీ అసలు వయసెంత అఫ్రిది?
- బీమాసురులు
- అతన్ని చంపబోయాను..అనిల్‌కపూర్
- నటి హిమజకు పవన్ లేఖ
- ఇంగ్లాండ్ కోచ్ ఫిర్యాదు చేయొద్దు: పీటర్సన్
- గృహ రుణాలపై ఎస్బీఐ గుడ్‌న్యూస్