close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పోలవరం ఖర్చంతా కేంద్రమే భరించాలి

రాష్ట్రానికి రావాల్సింది  రూ.7,053 కోట్లే అనడం సరికాదు
హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వాదనలు
ఎంపీ కేవీపీ వేసిన పిల్‌లో ప్రతివాదిగా చేర్చుకోవాలని పిటిషన్‌

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2013-14 అంచనా ధరల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సింది కేవలం రూ.7,053 కోట్లు మాత్రమేనని కేంద్రం పేర్కొనడం సరికాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. రూ.30వేల కోట్లకు పైగా కోత పెట్టాలని చూస్తున్నారన్నారు. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్‌ 90 ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున దాని వ్యయాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉందని చెప్పారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున వ్యయం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించేలా ఆదేశించాలని కోరుతూ అప్పటి కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు 2017లో హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ వేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) హరినాథ్‌ వాదనలు వినిపించారు. పోలవరం ప్రాజెక్టుపై వ్యాజ్యాలు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున, కేవీపీ పిల్‌ను అక్కడికే బదిలీ చేయాలని కోరుతూ కేంద్రం 2019లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిందన్నారు. ఆ పిటిషన్‌ పెండింగ్‌లో ఉందన్నారు. కేవీపీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ఉండవల్లి ఇంప్లీడ్‌ పిటిషన్‌పై తమకు అభ్యంతరం లేదన్నారు. తమ పిల్‌పై తుది విచారణ చేపట్టాలని కోరారు. ఉండవల్లి వాదనలు వినిపిస్తూ.. తెలంగాణలో భారీగా నీటిని పంపింగ్‌ చేస్తున్నారన్నారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలో రబీ సాగుకు ఇప్పటికే నీటికొరత ప్రారంభమైందని చెప్పారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈ వ్యాజ్యంపై విచారణను ఇకపై సాగదీయడం సరికాదని అభిప్రాయపడింది. హైకోర్టులో పిల్‌ను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రం వేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుందో చెప్పాలని సహాయ సొలిసిటర్‌ జనరల్‌కు స్పష్టం చేసింది. విచారణను మార్చి 17కు వాయిదా వేసింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు