ప్రైవేటీకరణ.. కాదంటే మూత

ప్రధానాంశాలు

ప్రైవేటీకరణ.. కాదంటే మూత

ప్రభుత్వ రంగ సంస్థల భవిష్యత్తుపై కేంద్రం స్పష్టీకరణ
ఈనాడు - దిల్లీ

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను సాధ్యమైనంతవరకు ప్రైవేటీకరిస్తామని, అందుకు వీలుపడని వాటిని మూసేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు ఈమేరకు సమాధానమిచ్చారు. ‘2020-21 బడ్జెట్‌ సవరించిన అంచనాల ప్రకారం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంటే రూ.32వేల కోట్లే వచ్చాయి. కొవిడ్‌ కారణంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు పెట్టుబడుల ఉపసంహరణపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇప్పుడు స్టాక్‌మార్కెట్‌ పుంజుకోవడంతో ఈ ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాన్ని చేరుకోవడానికి భారత్‌కు నిధులు కావాలి. అందుకే కేంద్రం కొత్త ప్రభుత్వరంగ సంస్థల విధానాన్ని ఖరారుచేసి అన్ని నాన్‌స్ట్రాటజిక్‌, స్ట్రాటజిక్‌ రంగాల్లో పెట్టుబడుల ఉపసంహరణకు మార్గసూచిని విడుదల చేసింది. ఇందులో కేవలం 4రంగాలను స్ట్రాటజిక్‌ విభాగం కింద గుర్తించింది. ఈ సంస్థల్లో ప్రభుత్వ మనుగడ నామమాత్రమే. హోల్డింగ్‌ కంపెనీ మాత్రమే ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. మిగిలిన వ్యవహారాలన్నీ ప్రైవేటీకరించడమో లేదంటే విలీనం చేయడమో, మరో ప్రభుత్వరంగ సంస్థకు అనుబంధంగా మార్చడమో లేదంటే మూసేయడమో జరుగుతుంది’ అని అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు.
తిరుపతి మా పరిధిలోకి రాదు
ఆధ్యాత్మిక నగరం తిరుపతి సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ అంశం తమ పరిధిలోకి రాదని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ పేర్కొన్నారు. ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ) తమ శాఖ పరిధిలోకి వస్తున్నందున దాని ద్వారా అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. మంగళవారం రాజ్యసభలో ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. అలాగే జాతీయ ప్రాధాన్యం ఉన్న స్మారక చిహ్నాలు దేశంలో 3,693 ఉండగా... ఏపీలో 135, తెలంగాణలో 8 ఉన్నాయని చెప్పారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఉషామెహ్రా కమిషన్‌ సిఫారసు
ఏపీలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఉషామెహ్రా కమిషన్‌ సిఫారసు చేసిందని కేంద్ర సామాజిక సాధికారశాఖ సహాయమంత్రి రతన్‌లాల్‌ కటారియా తెలిపారు. మంగళవారం లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యుడు రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈమేరకు సమాధానమిచ్చారు. ‘ఏపీలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య పరిశీలనకు జస్టిస్‌ ఉషా మెహ్రా నేతృత్వంలో ఏర్పాటైన జాతీయ కమిషన్‌ 2008 మే 1న నివేదిక ఇచ్చింది. ఎస్సీ కులాలను ఉపకులాలుగా, ఉప-ఉపకులాలుగా వర్గీకరించడానికి వీలుగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 341ని సవరించాలని సిఫారసు చేసింది. దీనిపై అభిప్రాయాలు చెప్పాలని చివరగా 2019 డిసెంబరు 9న రాష్ట్రాలకు గుర్తుచేశాం. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉంది’ అని రతన్‌లాల్‌ కటారియా పేర్కొన్నారు. ఏపీలోని బుడగ జంగమ వర్గాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ వచ్చిన ప్రతిపాదనను తిప్పి పంపినట్లు మంత్రి చెప్పారు. ఆరెకటిక, కటికలను ఎస్సీల్లో చేర్చాలన్న ప్రతిపాదనను తిరస్కరించినట్లు చెప్పారు. కులాల వర్గీకరణ అంశంపై మంగళవారం లోక్‌సభలో వైకాపా సభ్యురాలు వంగా గీత అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఓబీసీ వర్గీకరణకు సంబంధించి 11, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి కేంద్రానికి అందినట్లు ఆయన చెప్పారు.

విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించొద్దు: కనకమేడల
ప్రజా ఉద్యమాలు, త్యాగాల పునాదులపై పుట్టుకొచ్చిన విశాఖ స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరించొద్దని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ మంగళవారం రాజ్యసభలో కోరారు. జీరోఅవర్‌లో ఆయన మాట్లాడారు.  ‘నాకు తెలిసినంతవరకు గౌరవ ఛైర్మన్‌ (వెంకయ్యనాయుడు)కూడా ఆ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రైవేటీకరించడానికి బదులు స్టీల్‌ప్లాంటుకు తక్కువ ధరలో ఇనుప ఖనిజం సరఫరా చేయాలి’ అని సూచించారు.
ఏపీలోని అరాచక పాలనపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఏ.కె.భల్లాకు సాక్ష్యాలను అందజేశామని ఎంపీ కనకమేడల తెలిపారు. దిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఏ.కె.భల్లాను తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌, ఎంపీ కనకమేడల ఆయన కార్యాలయంలో కలిశారు.

ఆజాద్‌ను అభినందిస్తున్నా: విజయసాయిరెడ్డి
కాంగ్రెస్‌ పార్టీ అంటే తనకు సదభిప్రాయం లేకపోయినా ప్రతిపక్షనాయకుడిగా గులాంనబీ ఆజాద్‌ పనితీరును అభినందిస్తున్నట్లు వైకాపా నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
ఒక్కో రైతు కుటుంబంపై రూ. 87 వేల రుణభారం
ఏపీలో ఒక్కో రైతు కుటుంబంపై రూ.87,777 రుణ భారం ఉన్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ లోక్‌సభలో తెలిపారు. తెలంగాణ రైతు కుటుంబాలపై సగటున రూ.68,028 అప్పు ఉందని పేర్కొన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వండి: శ్రీకృష్ణదేవరాయలు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైకాపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ జోక్యం చేసుకొని రాజ్యాంగ వ్యవస్థపై సభలో విమర్శలు చేయడం సరికాదని పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తారు.
డోర్‌ డెలివరీకి కేంద్రం నిధులివ్వదు
ఏపీ ప్రభుత్వం తలపెట్టిన ఇంటింటికీ రేషన్‌ సరఫరాకు కేంద్రం నిధులివ్వదని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి దాన్వే రావ్‌సాహెబ్‌ దాదారావ్‌ తెలిపారు. ఏపీ అమలుచేస్తున్న ఈ పథకానికి కేంద్రం ప్రత్యేక గ్రాంట్‌ కింద రూ.1,409 కోట్లు ఇవ్వడానికి నిర్ణయమేమైనా తీసుకుందా అని లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని