పోలింగ్‌ 80.71%
close

ప్రధానాంశాలు

పోలింగ్‌ 80.71%

విజయనగరంలో గరిష్ఠంగా 87.09
విశాఖపట్నంలో కనిష్ఠంగా 69.28
రెండో దశతో పోల్చితే స్వల్పంగా తక్కువ
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రశాంతం
ఈనాడు - అమరావతి

మూడోదశ పంచాయతీ ఎన్నికల్లో 80.71% పోలింగు నమోదైంది. రెండో దశతో పోలిస్తే ఈసారి 0.9% తగ్గింది. విజయనగరం జిల్లాలో గరిష్ఠంగా 84.60%, విశాఖపట్నం జిల్లాలో కనిష్ఠంగా 69.28% పోలింగు నమోదైంది. మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో పోలింగు ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 1.30కే ఇక్కడ పోలింగు నిలిపివేయడంతో రెండోదశ ఎన్నికల్లో నమోదైన ఓటింగుతో పోలిస్తే విశాఖపట్నం జిల్లాలో 1.75, తూర్పుగోదావరి జిల్లాల్లో 8.06 శాతం పోలింగు తగ్గింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి పోలింగు కేంద్రం ఏపీవో దైవ కృపావతి గుండెపోటుతో మృతిచెందారు. ఎన్నికలు నిర్వహించిన 2,639 పంచాయతీల్లో ఉదయం 6.30 నుంచే ప్రజలు పోలింగు కేంద్రాలకు రావడం మొదలై 10-12.30 గంటల మధ్య ఎక్కువ మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. గుంటూరు, కృష్ణా, కర్నూలు, పశ్చిమగోదావరి, విజయనగరం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఓటర్లు పోలింగు కేంద్రాల ముందు బారులు తీరారు.

గుంటూరు జిల్లాలోని కొన్ని పంచాయతీల్లో ఓటర్లు వరుసలో ఉన్నందున గడువు ముగిసినా ఓటింగుకు అనుమతించారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ మండలాల్లో మధ్యాహ్నం ఒంటి గంటకు 65 శాతానికిపైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ మధ్యాహ్నం 1.30 గంటలకు పోలింగు నిలిపివేసి 2 గంటల తర్వాత ఓట్లు లెక్కించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ విజయవాడలోని తన కార్యాలయంలో నుంచి వెబ్‌ కాస్టింగులో వివిధ జిల్లాల్లో పోలింగును సమీక్షించారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఓట్ల లెక్కింపును వీడియో రికార్డు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగు కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగు సదుపాయం ఉన్నందున మిగతాచోట్ల వీడియో కెమెరాలతో ఓట్ల లెక్కింపును చిత్రీకరించారు. ప్రజలంతా ప్రజాస్వామ్య స్ఫూర్తితో మూడోదశ ఎన్నికల్లో పాల్గొని ఓటుహక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేశ్‌కుమార్‌ అన్నారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఆయన అభినందనలు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని