close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సెస్సులో వాటా ఇప్పించలేం

ఆ అధికారం మాకు లేదు
రాష్ట్రాల అభ్యంతరాలు సబబే
పన్ను మినహాయింపులను క్రమేణా ఎత్తివేయాలి
ఈనాడు, ఈటీవీ భారత్‌ ముఖాముఖిలో 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే సెస్సు, సర్‌ఛార్జీల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఇచ్చే అవకాశం లేదని 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌ స్పష్టంచేశారు. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంటుందని, దీనిపై సిఫార్సులు చేసే అధికారం ఒక్కటే ఆర్థిక సంఘాలకు ఉందని తెలిపారు. సెస్సు, సర్‌ఛార్జీల వ్యవహారం వీటి పరిధిలోకి రాదని చెప్పారు. వస్తువులు, సేవలతో పాటు ఆదాయాలపై కేంద్ర ప్రభుత్వం పన్నులతో పాటు సెస్సు, సర్‌ఛార్జీలు విధిస్తోంది. పన్నుల శాతాన్ని పెంచకుండా కేంద్రం సెస్సు, సర్‌ఛార్జీలను పెంచుతూ ఆ ఆదాయాన్ని తన వద్దే ఉంచుకుంటోందని రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయి. వీటన్నింటిని పరిశీలించి తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యంలో ఆయన ‘ఈనాడు’, ‘ఈటీవీ భారత్‌’లకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు...
ప్రశ్న: కేంద్ర-రాష్ట్రాలు; వివిధ రాష్ట్రాల మధ్య ఆదాయం పంపిణీకి సూత్రం రూపకల్పనలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు?
జవాబు: వాటాల నిర్ణయం ప్రథమ ఆర్థిక సంఘం నుంచీ సమస్యగానే ఉంది. దీంతోపాటు ప్రతి ఆర్థిక సంఘానికీ కొన్ని పరిశీలనాంశాలు ఉంటాయి. మాకు రక్షణ వ్యవహారాలను చూడాలని ఇచ్చారు. దీనికి తోడు కరోనా ఎదురయ్యింది. అందువల్ల ఆరోగ్య రంగం విస్తరణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు, ఖర్చులను దృష్టిలో పెట్టుకొని సిఫార్సులు చేశాం.

ప్రశ్న: పన్నుల్లో 50 శాతం వాటా కావాలని రాష్ట్రాలు అడిగాయి. దీన్ని ఎలా పరిష్కరించారు?
జవాబు: మునుపటి ఆర్థిక సంఘాలన్నీ రాష్ట్రాల వాటాను పెంచుకుంటూ పోయాయి. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాల వాటాను 32% నుంచి 42%కి పెంచింది. ఇది కేంద్రంపై భారాన్ని పెంచింది. రాష్ట్రాలకు ఇచ్చే వాటా తగ్గించాలని కేంద్రం ఆశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాల వాటా పెంచలేం. అలాగని తగ్గించలేం కూడా. అందుకే రాష్ట్రాల వాటాను 41 శాతానికి పరిమితం చేశాం.
అయిదేళ్ల కాలానికి స్థూలంగా ఆదాయం రూ.153.4 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశాం. కేంద్రానికి రిజర్వు బ్యాంకు ఇచ్చే డివిడెండు, కేంద్ర రంగ సంస్థలు ఇచ్చే లాభాలు, ఇతరత్రా ఆదాయాల్లో రాష్ట్రాలకు వాటా ఉండదు. వాటిని మినహాయిస్తే మొత్తం పన్నుల వసూళ్లు రూ.135.4 లక్షల కోట్లుగా తేలుతుంది. ఇందులో నుంచి సెస్‌, సర్‌ఛార్జీలను తీసివేస్తే వాటాలు వేయాల్సిన ఆదాయం రూ.103 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇందులో 41 శాతం అంటే రూ.42 లక్షల కోట్లు రాష్ట్రాలకు వాటాగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కాకుండా గ్రాంట్ల రూపంలో రూ.10.5 లక్షల కోట్లు, ప్రకృతి వైపరీత్యాల సహాయం కింద రూ.1.22 లక్షల కోట్లు, రెవెన్యూ లోటు భర్తీ కింద నిధులు ఇవ్వాలని సూచించాం. వీటిని కూడా కలుపుకొంటే రాష్ట్రాలకు అందేది 41 శాతానికి మించే ఉంటుంది.
ప్రశ్న: సెస్‌, సర్‌ఛార్జీల రూపంలో కేంద్రం అధికంగా వసూలు చేస్తోందని, అందులో వాటా ఇవ్వడం లేదని రాష్ట్రాలు అంటున్నాయి కదా?
జవాబు: రాష్ట్రాల అభ్యంతరాల్లో వాస్తవం ఉంది. సెస్సు, సర్‌ఛార్జీల రూపంలో జరిగిన వసూళ్లు 2010-11లో మొత్తం ఆదాయంలో 10.4%గా ఉండగా, 1920-21లో 19.9%కు పెరిగింది. అంటే దాదాపుగా రెట్టింపయ్యింది. సెస్సు, సర్‌ఛార్జీల ఆదాయాన్ని వాటా వేయడం ఆర్థిక సంఘం పరిధిలోకి రాదు. 2000లో చేసిన రాజ్యాంగ 80వ సవరణ ద్వారా ఆ అవకాశాన్ని తొలగించారు. దీంట్లో మళ్లీ మార్పులు చేయాలంటే పార్లమెంటుకే ఆ అధికారం ఉంది.
ప్రశ్న: 2011 జనాభా లెక్కల ఆధారంగా సిఫార్సులు చేస్తే నష్టపోతామంటున్న దక్షిణాది రాష్ట్రాల ఆందోళను ఏవిధంగా పరిష్కరించారు?
జవాబు: దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరుగుదలను నియంత్రించాయి. అయితే 2011 లెక్కల ప్రకారం జనాభా తగ్గడంతో ఆ మేరకు నిధులు తగ్గుతాయని ఆందోళన చెందాయి. దీనిని రెండు విధాలుగా పరిష్కరించాం. కొన్నింటికి జనాభాను పరిగణనలోకి తీసుకున్నాం. మరికొన్నింటికి జనాభా నియంత్రణకు పురస్కారంగా నిధులు పెంచాం. ఆ మేరకు నష్టం జరగకుండా చూశాం.
ప్రశ్న: ఆ రాష్ట్రాల ఆవేదనను పూర్తిగా తీర్చారా?
జవాబు: పూర్తిగా అననుగానీ, బాధ్యతతో వ్యవహరించాం. జనాభాను నియంత్రించడం వల్ల ఒక్క నిధులే కాదు...పార్లమెంటు, అసెంబ్లీ సీట్లను నష్టపోతామన్న ఆందోళన కూడా వాటిలో ఉంది.
ప్రశ్న: కొత్త ఆర్థిక సమాఖ్య వ్యవస్థలో అసౌకర్యంగా ఉన్నట్టు రాష్ట్రాలు భావిస్తున్నాయి కదా!
జవాబు: రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర అధికారాల విభజన జాబితా ఉంది. ఇటీవల కాలంలో రాష్ట్రాల పరిధిలోని అంశాలపై కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలవుతున్నాయి. ఉద్యోగ కల్పన, ఆహారం, విద్య తదితరాలు ఈ కోవలోకి వస్తాయి. ఏడో షెడ్యూల్‌నే పునఃపరిశీలించాల్సి ఉంది.
ప్రశ్న: ప్రత్యక్ష పన్నుల విధానంలో సుస్థిరత ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది సాధ్యమేనా?
జవాబు: అంచనా వేయదగ్గ, సుస్థిర పన్నుల విధానం ఉండాలని అందరూ కోరుకుంటారు. ఎక్కువ మందిని పన్నుల పరిధిలోకి తీసుకురావాలని కొందరు కోరుతుంటే.. పన్ను మినహాయింపులు పెంచాలని ఇంకొందరు డిమాండు చేస్తుంటారు. మరింత మందిని పన్నుల పరిధిలోకి తెచ్చి, మినహాయింపులను క్రమేణా ఎత్తివేయాలన్నదే నా అభిప్రాయం. అప్పుడే పన్నుల్లో సుస్థిరత కనిపిస్తుంది.

ప్రశ్న: భవిష్యత్తులో రాష్ట్రాల ఆర్థిక వనరులపై కేంద్ర పెత్తనం పెరుగుతుందని అనుకుంటున్నారా?
జవాబు: అలాంటిదేమీ ఉండదు. నిధుల వాటాలు వేసే ఆర్థిక సంఘం ఎలాంటి కేంద్రీకృత విధానాలను అనుసరించదు. అంతా పారదర్శకంగా, ఒక సూత్రం ఆధారంగా జరుగుతుంది కాబట్టి ఇబ్బందులు ఉండవు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు