close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాజధాని భూముల విలువ పెంచుతున్నాం

జాతీయ రహదారితో ప్రతి గ్రామం అనుసంధానం
మంత్రి పేర్ని నాని వెల్లడి

ఈనాడు, అమరావతి: ‘తమకు గజాల లెక్కన కేటాయించిన భూములకు విలువ పెరగాలనేదే రాజధాని రైతుల అంతిమ డిమాండు. దానికి ఏం కావాలో అన్నీ ప్రభుత్వం చేస్తోంది. ఈ రోజు వరకూ ఎక్కడా వెనక్కి తగ్గలేదు, చెప్పిన మాటమీదే ముందుకు వెళ్తున్నాం’ అని సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించిన సందర్భంగా ఆయన విలేకరుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ‘జగన్‌ ప్రభుత్వం వందల కోట్లతో జాతీయ రహదారిని నిర్మిస్తోంది. బ్యారేజి, వంతెనలు కడుతున్నాం.. గొల్లపూడి నుంచి నిమిషాల్లో తమ గ్రామాలకు చేరుకోవడానికి అన్ని రకాల వసతులూ కల్పిస్తాం. తిట్టినా, పొగిడినా ఈ కార్యక్రమాలను జగన్‌ ఆపరు’ అని స్పష్టం చేశారు. ‘తాను అమరావతికి వ్యతిరేకం కాదని, అయితే ఇక్కడ ఒక్కచోటే కాకుండా అన్నిచోట్లా అభివృద్ధి చేద్దామని జగన్‌ చెబుతున్నారు. ఎవరికి విశ్వాసం ఉన్నా లేకున్నా.. ఆయన ఒక మాట చెప్పారంటే చేసి తీరతారు. అదే పనిలో ఉన్నారు..’ అని మంత్రి పేర్కొన్నారు. ‘విశాఖలో పాలనా రాజధానిని చూసే రోజు తప్పకుండా వస్తుంది. దాని కోసం అందరం ఎదురు చూస్తున్నాం..’ అని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.రాజధాని రైతుల్ని ఆహ్వానించలేదనే ప్రశ్నలను మంత్రి నాని ఖండించారు. ‘వెళ్లినరోజు వెళ్లాం.. తిట్లు తిని వచ్చాం.. ఎంపీలు వెళ్లి తన్నులు, తిట్లు తిని వచ్చేశారు. పాత దుస్తుల్లో బట్టలు కుక్కి వాటికి రకరకాలుగా ఫొటోలు పెట్టించుకున్న మంత్రులమూ ఉన్నాం’ అని తెలిపారు. ‘మేం ముందునుంచీ చెబుతున్నాం.. అమరావతి ప్రాంత అభివృద్ధికి జగన్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎవరెన్ని రెచ్చగొట్టినా.. తిట్టినా, దూషించినా, ద్వేషించినా.. అమరావతిని ఏమీ లేకుండా చేయడానికి జగన్‌ వ్యతిరేకం’ అని వివరించారు.

కేంద్రసంస్థలకు ఎన్‌ఓసీ
అమరావతిలో స్థలాలు పొందిన కేంద్రప్రభుత్వ సంస్థలు భవనాల నిర్మాణానికి ఎన్‌ఓసీ (నిరభ్యంతర పత్రం) అడిగితే.. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి నాని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘ఎన్‌ఓసీ కావాలని మా కార్యాలయాలకు రాలేదు, సీఎం ఆఫీసులో అపాయింట్‌మెంటూ అడగలేదు’ అని వివరించారు. అమరావతిలో రహదారులు, ఇతర పనులకు రూ.3వేల కోట్ల నిధులకు బ్యాంకు గ్యారంటీ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు