మొబైల్‌ కొనుగోలుపై 10% రాయితీ
close

ప్రధానాంశాలు

మొబైల్‌ కొనుగోలుపై 10% రాయితీ

రాష్ట్ర ప్రభుత్వ మహిళా దినోత్సవ కానుక
దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే వారికి వర్తింపు
మహిళా పోలీసులందరికీ 8న సెలవు
మహిళా ఉద్యోగులకు అదనంగా 5 సీఎల్‌లు
సీఎం జగన్‌ వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే మహిళలకు ఎంపిక చేసిన దుకాణాల్లో మహిళా దినోత్సవం రోజున మొబైల్‌ ఫోన్‌ కొనుగోలుపై 10% రాయితీ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా రాష్ట్రంలో క్యూఆర్‌ కోడ్‌తో 2 వేల స్టాండ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసుశాఖలో పని చేస్తున్న మహిళలందరికీ మహిళా దినోత్సవం(మార్చి 8) రోజు ప్రత్యేక సెలవు దినం(స్పెషల్‌ డే ఆఫ్‌)గా ప్రకటించారు. ఆరోజు ప్రతి విభాగం నుంచి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను సత్కరించాలని అధికారులను ఆదేశించారు. మహిళా భద్రత, సాధికారతపై షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలను నిర్వహించాలని సూచించారు. మహిళా ఉద్యోగులకు అదనంగా 5 సీఎల్‌లు ఇచ్చేందుకు అంగీకరించారు. నాన్‌ గెజిటెడ్‌ మహిళా ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు ప్రకటించారు. మహిళా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా మార్చి 7న కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు-నేడు, వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూల్‌, సంపూర్ణ పోషణపై సీఎం సమీక్షించారు.

అంగన్‌వాడీ ఉద్యోగులకు ఏటా ఆరోగ్య పరీక్షలు
అంగన్‌వాడీ ఉద్యోగులందరికీ ఏటా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ‘చేయూత దుకాణాల్లో శానిటరీ ప్యాడ్స్‌ అందుబాటులో ఉంచుతాం. ఇందుకోసం సెర్ప్‌, మెప్మా, హెచ్‌ఎల్‌ఎల్‌ మధ్య ఒప్పందం చేసుకోనున్నాం. ఎస్సెస్సీ ఉత్తీర్ణులైన బాలికలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్లస్‌-1, ప్లస్‌-2లలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం’ అని సీఎం వెల్లడించారు. ‘జూనియర్‌ కళాశాల నుంచి పైస్థాయి వరకు ’దిశ‘పై ప్రచారం నిర్వహిస్తూ హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలి. అందులో దిశ యాప్‌ సహా అన్ని రకాల వివరాలు ఉంచాలి’ అని అధికారులను ఆదేశించారు.

పిల్లలకు ఆంగ్ల, తెలుగు మాధ్యమ నిఘంటువు
పాఠశాలల్లోని పిల్లలకు ఆంగ్ల, తెలుగు మాధ్యమ నిఘంటువును అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రోజూ ఒక పదం చొప్పున నేర్చుకునేలా చూడాలన్నారు. ‘రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నూతన అంగన్‌వాడీ కేంద్రాలు, నాడు-నేడు కింద చేపడుతున్న అభివృద్ధి పనులు ఏకకాలంలో పూర్తయి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి’ అని సూచించారు.

20 నుంచి పుస్తకాల పంపిణీ...
అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఈ నెల 20 నుంచి పుస్తకాల పంపిణీ చేపట్టనున్నట్లు సీఎం వెల్లడించారు. ఏప్రిల్‌ 5 నాటికి పంపిణీ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా 26 బోధనోపకరణాల్లో ఇప్పటికే 16 పంపిణీ చేశామని, మిగతావి నెల రోజుల్లోగా అందిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని