close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనా వేళ.. కన్నతల్లులై..

రోగులకు అన్నీ తానై... లాలన
రోగులను కంటికి రెప్పలా కాపాడుకున్న మహిళామణులు
ఆర్తులకు వనితల సేవలు అసామాన్యం
మహిళా దినోత్సవ వేళ స్మరణీయ గాథలు
ఈనాడు, అమరావతి, హైదరాబాద్‌

ఆమె మమతకు ప్రతిరూపం...
దక్షతలో దీక్షాధారి...
ఓర్పులో భూదేవి...
కరుణకు చిరునామా...

కరోనా కష్టమొస్తే అమ్మలా కన్నీళ్లు తుడిచింది. భరించలేని బాధల్లో తోబుట్టువై ఓదార్చింది. ఒంటరి అయిన రోగిని వెన్నంటి నడిపించింది. అష్టభుజిగా మారి అండగా నిలిచింది. సొంత మనుషులూ చేయలేనంత సహనంతో ఆర్తులకు సేవలందించింది. మృత్యువుతో పోరులో బాధితులు ఓడిపోతే ఈమె మనసు కన్నీరైంది. కోలుకొని ఇంటికెళ్తుంటే ఆనందబాష్పాలు రాల్చింది. గత ఏడాది కొవిడ్‌ విలయ తాండవం చేసిన రోజుల్లో మహిళామణులు అందించిన సేవలు నిరుపమానం. తాము రోజుల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ.. కనిపించని శత్రువుతో యుద్ధమే చేశారు. ఎంతోమంది రోగులను విజేతలుగా నిలిపారు.
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఈ సందర్భంగా కొందరు స్త్రీమూర్తుల స్ఫూర్తిదాయక సేవలపై ప్రత్యేక కథనం...

కరోనా సృష్టించిన కల్లోలం తలచుకుంటేనే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. ఆ మహమ్మారి ప్రపంచాన్ని అల్లాడించింది. మానవ సంబంధాలను చిన్నాభిన్నం చేసింది. కొన్ని లక్షల కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. అలాంటి కల్లోలంలోనూ కొందరు తల్లులు మేమున్నామంటూ ముందుకొచ్చారు. కడుపులో ఆకలి, కళ్లల్లో దైన్యంతో... ఎడతెగని తీరాలవైపు నడిచిపోతున్న వలస కూలీలకు అన్నం పెట్టిన అమ్మ ఒకరు... వేలాది మంది కరోనా బాధితులను కంటికి రెప్పలా చూసుకుంటూ.... వ్యాధి నయమై ఇంటికి పంపేంత వరకు తోడునీడలా ఉన్న అధికారిణి మరొకరు... వైద్యురాలిగా, నర్సుగా, కరోనా నిర్ధరణ పరీక్షల కేంద్రం ఇన్‌ఛార్జిగా... వైరస్‌కి ఎదురొడ్డి పోరాడి, బాధితులకు అండగా నిలిచిన ధీర వనితలు మరికొందరు. ఈ మహిళా దినోత్సవం రోజున అటువంటి కొందరిని ‘ఈనాడు’ పలకరించింది.

బ్రిటన్‌ నుంచి ఇప్పటికీ ఎస్‌ఎంఎస్‌లు

కరోనా కారణంగా నలుగురు వ్యక్తులు ఒకచోట చేరాలంటేనే భయపడే కాలమది. అలాంటి సమయంలో నిత్యం వెయ్యి మంది కరోనా రోగులుండే జిల్లా కోవిడ్‌ సెంటర్‌కి ఆమె ప్రత్యేకాధికారిణిగా సేవలందించారు ఎస్‌.లక్ష్మి. తిరుపతి నగరాభివృద్ధి సంస్థలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఆమె... గత ఏడాది మార్చి నుంచి ఈ సంవత్సరం జనవరి వరకు తిరుచానూరులోని ‘పద్మావతి నిలయం’ కొవిడ్‌కేర్‌ సెంటర్‌కు బాధ్యురాలిగా విధులు నిర్వర్తించారు. మొత్తం 100 మంది వైద్యులు, నర్సులు, సిబ్బంది, సహాయక సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ... సెంటర్‌ని ఉత్తమ సేవలకు చిరునామాగా మార్చారు.

పద్మావతి నిలయాన్ని మొదట్లో క్వారంటైన్‌ కేంద్రంగా ప్రారంభించారు. ఆ సమయంలో 1,005 మంది కొవిడ్‌ బాధితులు అక్కడుండేవారు. తర్వాత దాన్ని జిల్లా కోవిడ్‌ చికిత్స కేంద్రంగా మార్చారు. పది నెలల్లో మొత్తం 14,500 మందికి చికిత్స అందించాం. ఈ పది నెలలూ ఒక యజ్ఞంలా అంకిత భావంతో... విరామం ఎరగకుండా పనిచేశాం. ఉదయం 8.30 గంటలకు వెళితే... రాత్రి మళ్లీ 9 గంటల వరకు అక్కడే ఊపిరి సలపని పని ఉండేది. రాత్రివేళ ఇంటికి వెళ్లినా గుండె పట్టేస్తోందని, ఇబ్బందిగా ఉందని, ఊపిరి ఆడటం లేదని... ఇలా అర్ధరాత్రి, తెల్లవారుజామున కూడా ఫోన్లు వచ్చేవి, సిబ్బంది, బాధితులతో ఒక వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశాం. రోగులు తమకు ఏ సమస్య ఉన్నా దానిలో పోస్ట్‌ చేస్తే 10-20 నిమిషాల్లోపు పరిష్కరించేవాళ్లం. గ్రూప్‌లో మెసేజ్‌లు చూస్తూ, ఫోన్లకు సమాధానమిస్తూ 24/7 విధి నిర్వహణ కొనసాగేది. క్వారంటైన్‌ కేంద్రంగా ఉన్నప్పుడు ఒక్కోసారి... ఒక ఊరు ఊరినే తీసుకొచ్చేవారు. వారు ఇంటికి పోతామని గొడవ చేసేవాళ్లు. వారికి నచ్చజెప్పి కొనసాగించాల్సి వచ్చేది. గంటల వ్యవధిలోనే అందరికీ వసతులు ఏర్పాటు చేసేవాళ్లం. కేంద్రంలోని బాధితులందరికీ రెండుపూటలా ఆహారం, పాలు, డ్రైఫ్రూట్లు, పళ్లు వంటివన్నీ సిద్ధంగా ఉంచేవాళ్లం. అత్యవసరానికి అంబులెన్సులను ఉండేలా చూసుకునేవాళ్ల. ఇక్కడ ఒక బ్రిటన్‌ జాతీయుడు నెల రోజులు క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన ఇప్పటికీ మన దేశాన్ని పొగుడుతూ, కృతజ్ఞతలు చెబుతూ సందేశాలు పంపుతున్నారు.

పిల్లల్ని ఇంట్లో ఉంచి తాళం వేసి విధులకు...

కొవిడ్‌ రోగులకు స్టాఫ్‌ నర్సులు అందించిన సేవలు నిరుపమానమైనవి. అనూహ్య పరిస్థితుల కారణంగా... విశాఖ కేజీహెచ్‌లో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్న గంగాభవానీకి కుటుంబ బాధ్యతల్నీ, ఉద్యోగాన్నీ సమన్వయం చేసుకోవడం తలకుమించిన భారమైంది. అప్పుడు... తన అవసరం కరోనా రోగులకే ఎక్కువని భావించారు. విధి నిర్వహణకే ఓటేశారు.

అండమాన్‌లో మెరైన్‌ ఇంజినీరుగా పనిచేస్తున్న నా భర్త గత మార్చిలో విశాఖ వచ్చారు. పిల్లల్ని చూసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత అండమాన్‌ తిరిగి వెళ్తూ ముంబయికి చేరుకోగా అక్కడ కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఒకవైపు ఆ టెన్షన్‌... మరోవైపు పిల్లల్ని చూసుకోవాలి... ఉద్యోగానికి వెళ్లాలి. ఆయన్ని తలచుకుంటే ఏడుపొచ్చేది. ఏదో తెగింపుతో... పిల్లల్ని ఇంటోనే ఉంచి తాళమేసి విధులకు హాజరయ్యేదాన్ని. పదేళ్ల నా రెండో కొడుకు... ‘త్వరగా ఇంటికి రా అమ్మా’... అని మారాం చేసేవాడు. రాత్రి ఎప్పుడో ఇంటికెళ్లాక వేరే గదిలో ఉండేదాన్ని. కొన్నాళ్లకు నాలోనూ కోవిడ్‌ లక్షణాలు కనిపించాయి. రెండు రోజులే విధులకు దూరంగా ఉండి, మళ్లీ హాజరయ్యా. ఇలాంటి పరిస్థితుల్లో నీకీ ఉద్యోగం అవసరమా? అన్న ప్రశ్న బంధువుల నుంచి ఎదుర్కొన్నా. అక్కడ ఆసుపత్రిలో ఒక్కొక్కరీ ఒక్కో వ్యథ. వైరస్‌ సోకిన ఓ గర్భిణి పాపకు జన్మనిచ్చింది. పాపను వేరే గదిలో ఉంచాం. ఆమె తన పాపను చూపించాలని గొడవ చేసేది. వీడియో కాల్‌ ద్వారా చూపించి ఓదార్చేదాన్ని. తల్లిదండ్రులకు కరోనా సోకితే... పిల్లల్ని వేరేగా ఉంచేవాళ్లం. అమ్మానాన్నల్ని చూపించాలని వారు అడుతుంటే కన్నీళ్లొచ్చేవి. ఎంత కష్టమైనా... అంత భయంకరమైన పరిస్థితుల్లో ప్రజలకు సేవలందించానన్న సంతృప్తి ఉంది.

నమూనాలను పరీక్షించి... పోరాటానికి ఊతమిచ్చి

ఒకరికి కరోనా సోకితే... కుటుంబ సభ్యులంతా దూరంగా జరిగిపోయిన పరిస్థితులవి. కానీ.. వేలాది మంది నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించాల్సిన ఉద్యోగం ఆమెది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనాబారిన పడే ప్రమాదం ఉంటుంది. అంత ప్రతికూలతలోనూ నిభాయించుకుని సేవలందించారు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోని కరోనా నిర్ధరణ(వీఆర్‌డీఎల్‌) కేంద్రం ఇన్‌ఛార్జి డాక్టర్‌ కె.ప్రశాంతి.
అప్పుడు మేం ఎదుర్కొన్న ఒత్తిడిని మాటల్లో చెప్పలేం. సాధారణ రోజులకు భిన్నంగా మూడు షిఫ్ట్‌ల్లోనూ 50-60 మందిమి 24 గంటలూ సైనికుల్లా పనిచేశాం. సిబ్బందిని ఉత్సాహపరుస్తూ నిర్విరామంగా పనిచేయించడం, వారి భద్రతకు భరోసా ఇచ్చేలా రక్షణ చర్యలు చేపట్టడం... కత్తిమీద సాములా అనిపించేది. నిరుడు ఏప్రిల్‌ మొదటి వారంలో రోజుకి 100 నుంచి 150 నమూనాలే పరీక్షించేవాళ్లం.. చూస్తుండగానే రోజుకి వెయ్యి, రెండు వేలు, ఒక దశలో రోజుకి 6000 వరకు పరీక్షలు చేయాల్సి వచ్చింది. ఇళ్లకు వెళ్లకుండా ల్యాబ్‌ పక్కనే ఉన్న గదుల్లో నిద్ర పోయేవాళ్లం. వారం రోజులకు ఒకసారి దుస్తులు తెచ్చుకునేవాళ్లం. కరోనా రోగులకు చికిత్స అందించే వైద్యులు, ఇతర సిబ్బందికి ఒకవారం విధుల్లో ఉంటే, మరో వారం క్వారంటైన్‌ సదుపాయం ఉండేది. ల్యాబ్‌ల్లో పనిచేసే వారికి ఆ సదుపాయం ఉండేది కాదు. పైగా మాతో అద్దె ఇళ్లు ఖాళీ చేయించిన యజమానులూ ఉన్నారు. అయితే... మహమ్మారిపై పోరాటంలో తొలి వరుసలో నిలిచి సేవలందించామన్న తృప్తి ముందు అవేవీ పెద్ద సమస్యల్లా అనిపించలేదు.

ఆత్మబంధువులమై ధైర్యం చెప్పాం

వైద్య సదుపాయాలు పెరిగాక... ఏ మందులు వాడాలో తెలిశాక... కరోనా అంటే ఇప్పుడు కాస్త భయం తగ్గిందిగానీ... మొదట్లో కొవిడ్‌ సోకిందంటే నిలువెల్లా వణికిపోయేవారు. బతికి బయటపడతామా? అన్న ఆందోళనతో మానసికంగా కుంగిపోయేవారు. అలాంటి వారికి వైద్యులే ఆత్మబంధువులయ్యారు. విజయవాడలోని రాష్ట్ర కొవిడ్‌ ఆస్పత్రిగా ఉన్న జీజీహెచ్‌లో ఆలుపెరగని సేవలందించిన వైద్యుల్లో డాక్టర్‌ సిద్ధేశ్వరి ఒకరు.
కరోనా ఉద్ధృతి సమయంలో మా ఆస్పత్రి యుద్ధరంగాన్ని తలపించేది. వచ్చేపోయే అంబులెన్సులు, వేదనలో ఉన్న రోగులతో గంభీర వాతారణం ఉండేది. మా ఆసుపత్రికి ఎక్కువగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల్ని తీసుకొచ్చేవారు. కొందరైతే రోగులను ఆసుపత్రి గేటు వద్దే వదిలి వెళ్లిపోయేవారు. బాధితులు తమ కుటుంబ సభ్యుల గురించి అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక సతమతమయ్యేవాళ్లం. పదేపదే ఫోన్లు చేసినా ఇక్కడికి వచ్చేవారు కాదు. మేమే ఆప్తుల్లా మారి బాధితులకు సపర్యలు చేశాం. అపస్మారక స్థితిలో చేరినవారికి చికిత్స అందించడం సవాల్‌గా ఉండేది. కుటుంబ సభ్యులు లేకపోవడంతో కొందరికి ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయా? అని తెలుసుకోవడం కష్టమయ్యేది. బాధితుల్లో కొందరు తమకెందుకిలా జరిగిందన్న వేదనతో విలపించేవారు. ఎంతో సముదాయిస్తే తప్ప మామూలు మనుషులయ్యేవారు కాదు. నిర్దిష్ట చికిత్స విధానం లేకున్నా... వెంటిలేటర్‌పైకి వెళ్లినవారిని సైతం బతికించగలిగాం. కోలుకుని ఇళ్లకు తిరిగి వెళుతున్నప్పుడు వారి కళ్లలో కనిపించిన సంతోషం మేం పడ్డ కష్టాన్ని మాయం చేసేది.

అన్నార్తులకు అమృతహస్తం

పిల్లల ఆకలి అమ్మకే తెలుస్తుంది. కరోనా వేళ వందల కిలోమీటర్లు కాలి నడకన తరలిపోతున్న వలస కార్మికుల ఆకలి... ఆమెలోని తల్లిపేగుని కదిలించింది. అప్పటికే ‘అమృతహస్తం’ సేవా సంస్థను ఏర్పాటు చేసి, పేదలు, అనాథలకు అన్నం పెడుతున్న ఆమె... బృహత్‌ యజ్ఞాన్ని భుజానికెత్తుకున్నారు. ఒకరా ఇద్దరా... రోజుకి 15 వేల మంది చొప్పున, తొమ్మిది నెలల్లో 12 లక్షల మంది కడుపునింపారు విజయవాడకు చెందిన దారా కరుణశ్రీ.
2018లో మేం ‘అమృతహస్తం’ ప్రారంభించాం. పెళ్లిళ్లు, విందుల సమయంలో వృథా అయ్యే ఆహారాన్ని ‘డోంట్‌ త్రో... డొనేట్‌’ అనే నినాదంతో సేకరించేవాళ్లం. ఇలా నిరుడు మార్చి వరకు రెండేళ్లలో 20 లక్షల మందికి ఆహారం అందజేశాం. కరోనా సమయంలో ఫంక్షన్లు లేకపోవడంతో బయటి నుంచి ఆహార పదార్థాలు వచ్చేవి కాదు. మేమే సొంత ఖర్చులతో వెయ్యి మందికి ఆహారం అందజేయాలని అనుకున్నాం. మా సేవల్ని గుర్తించి ఐఆర్‌సీటీసీ రోజూ 5000 మందికి మా ద్వారా ఆహారం అందజేసేందుకు ముందుకొచ్చింది. ఇతర సంస్థలూ జత కలవడంతో నిత్యం 15 వేల మందికి ఆహారం అందజేశాం. మా వాళ్లు ఫలానాచోట చిక్కుకుపోయారు. భోజనం అందించండని ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వచ్చేవి. వెంటనే అందిపుచ్చుకునేవాళ్లం. బస్తీల్లో ఉన్న పేదలు, హాస్టళ్లలో ఉండిపోయిన విద్యార్థులు, కార్మికులు... ఇలా విభిన్న వర్గాల వారిని చేరుకున్నాం. మా సేవల్ని చూసి... ఐఏఎస్‌ అధికారి పీయూష్‌ కుమార్‌ ఐటీసీ వాళ్లతో మాట్లాడి రూ.8.5 లక్షల విలువైన 30 వేల జ్యూస్‌ ప్యాకెట్‌లు ఇప్పించారు. 100 కి.మీ.ల దూరంలో ఒకచోట తోటలో అరటి గెలలు ఉండిపోయాయి, ఉచితంగా ఇస్తామంటే వెళ్లి తీసుకొచ్చి కరోనా రోగులకు ఇచ్చాం. లేస్‌ కంపెనీ 450 పెద్ద బాక్సుల్లో చిప్స్‌ ఇస్తే... రైళ్లలో వెళ్లేవారికి, వలస కార్మికులకు సరఫరా చేశాం. రైల్వే, మున్సిపల్‌ కార్మికులకు నిత్యావసరాలు, దుస్తులను ఇచ్చాం’’.

బయో వ్యర్థాల నడుమ... భయం లేకుండా

మనిషిని మనిషి చూసి భయపడిన రోజులవి. అలాంటి సమయంలో కరోనా రోగుల వార్డులను, మరుగుదొడ్లను శుభ్రం చేయడం ఎంతో ప్రమాదకరం. ఈ విభాగంలో ఎక్కువ మంది మహిళాలే ధైర్యంగా ప్రాణాలొడ్డి సేవలందించారు. ‘కరోనా వార్డులో ఎక్కువ మంది వృద్ధులే ఉండేవారు. వారిని మరుగుదొడ్లకు తీసుకెళ్లడం, డైపర్లు మార్చడం వంటివి చేసేవాళ్లం. అలాగే కరోనా రోగులు, వైద్యులు, సిబ్బంది వాడిన పీపీఈ కిట్లు, ఐసీయూల్లోని ఇతర వ్యర్థాలను డబ్బాల్లోకి సేకరించి, డంపింగ్‌ యార్డుకు తరలించేవాళ్లం. ఎంత సేవ చేసినా రోగులు చనిపోయినప్పుడు చాలా బాధనిపించేంది. మృతుల బంధువులు రాకుంటే... మేమే కవర్లతో ప్యాక్‌ చేసేవాళ్లం. మా ఇళ్ల దగ్గర ఇరుగుపొరుగు మమ్మల్ని రానిచ్చేవారు కాదు. లాక్‌డౌన్‌లో ఆటోలు లేక ఎండలో నడుచుకుంటూ ఇళ్లకు వెళ్లాల్సి వచ్చేది. ఇంటికెళ్లాక పిల్లల్ని దగ్గరి రాకుండా చూడటం ఎంతో కష్టమయ్యేది’ తెలంగాణలోని నిజామాబాద్‌ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న శైలజ, బబ్లి తెలిపారు.

వాళ్లు గాజులు తీసుకెళితే... మేం అమ్మను ఆదరించాం

తెలంగాణ హన్మకొండలోని 108 వాహనంలో పనిచేసే మమత కరోనా సమయంలో వరంగల్‌ నుంచి సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి 100 మంది బాధితులను తీసుకొచ్చారు. అప్పుడు ఎదురైన అనుభవాలు ఆమె మాటల్లోనే... ‘కొవిడ్‌ సమయంలో మేం పడిన అవస్థలకన్నా దెబ్బతిన్న మానవ సంబంధాలను చూసి కన్నీళ్లు వచ్చేవి. హన్మకొండలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన వృద్ధురాలికి పాజిటివ్‌ వచ్చింది. ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు మేం వెళ్లాం. ఆమె చేతికి నాలుగు బంగారు గాజులున్నాయి. కొడుకులు, కుమార్తెలు దగ్గరకు కూడా రాలేదు. కానీ, బంగారు గాజులు ఇవ్వాలని వార్డు బాయ్‌ని పంపారు. 4 గాజులూ ఇచ్చేస్తే, పిల్లలు తనను ఆసుపత్రిలోనే వదిలేస్తారేమోనని భయపడ్డ ఆ తల్లి రెండే ఇచ్చారు. మరో వ్యక్తి మాకు ఫోన్‌ చేసి మట్టెవాడలో తన తల్లి మరణించిందని తాను ఊళ్లో లేనని చెప్పాడు. అక్కడికెళ్లి చూస్తే, ఆమె బతికే ఉంది’ అంటూ మమత వివరించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు