close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎన్నికల్లో స్వచ్ఛతే ఎస్‌ఈసీ లక్ష్యం

అక్రమాలపై జోక్యం చేసుకునే అధికారం కమిషన్‌కు ఉంది
జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు, ఉపసంహరణలపై ఫిర్యాదులొచ్చాయి
ఏకగ్రీవాల న్యాయబద్ధ ప్రామాణికతను నిర్ణయించేందుకే విచారణ
హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ వేసిన ఎన్నికల కమిషనర్‌

ఈనాడు, అమరావతి: ఎన్నికలను నిష్పాక్షికంగా, స్వచ్ఛంగా నిర్వహించేందుకు పరిస్థితుల ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ వేశారు. అందులో ఉన్న ప్రకారం... ‘‘ఎన్నికలను రద్దు చేయడం, వాయిదా వేయడం, తిరిగి నిర్వహించే అధికారం కమిషన్‌ను ఉంది. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకుంటే జోక్యం చేసుకునే అధికారం ఎస్‌ఈసీకి ఉంది. ఎన్నికల విషయంలో అధికారానికి ఎన్నికల సంఘం ఏకైక కేంద్రబిందువు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టంచేసింది. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికల నిర్వహణ కోసం... పర్యవేక్షణ, నిర్దేశం, నియంత్రణ అధికారాలు అధికరణ 324 ప్రకారం ఎన్నికల సంఘానికి ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలే రాష్ట్ర ఎన్నికల సంఘానికీ ఉంటాయి. ఎన్నికలను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత కేవలం ఎన్నికల సంఘంపై మాత్రమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ శాఖల అధికారులపైనా ఉంటుంది. రిటర్నింగ్‌ ఆధికారులు(ఆర్‌వో) ప్రచురించిన తుది జాబితా ప్రకారం.. జడ్పీటీసీలకు 126 మంది అభ్యర్థులు, ఎంపీటీసీలకు 2363 అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అసాధారణంగా ఏకగ్రీవాల సంఖ్య పెరిగిన విషయం కమిషన్‌ దృష్టికి వచ్చింది. జడ్పీటీసీ, ఎంసీటీసీ నామినేషన్ల దాఖలుకు ముందు రాష్ట్రవ్యాప్తంగా బెదిరింపులు, నామినేషన్ల తర్వాత బలవంతపు ఉపసహరణలు జరిగినట్లు వివిధ రాజకీయ పార్టీలు, వ్యక్తుల నుంచి ఎస్‌ఈసీకి భారీగా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో వాటిని పరిశీలించి, ఏకగ్రీవాల న్యాయబద్ధ ప్రామాణికతను నిర్ణయించేందుకు ఎస్‌ఈసీ విచారణకు చర్యలు తీసుకుంది. వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని పిటిషనర్‌ వేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలి. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల దాఖలుకు అవరోధాలు, బలవంతపు ఉపసంహరణ విషయంలో అందిన ఫిర్యాదులపై విచారణలను నిలువరిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలి’’ అని వివరించారు. బెదిరింపులు, దౌర్జన్యాల కారణంగా గతేడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్‌ వేయలేని వారు, వేధింపుల కారణంగా నామినేషన్‌ ఉపసంహరించుకున్న వారు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ఫిబ్రవరి 18న ఎస్‌ఈసీ ఉత్తర్వులిచ్చింది. వాటిని సవాలు చేస్తూ చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన రత్నశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో... ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నిర్దారిస్తూ ఎన్నికల అధికారి ప్రకటన చేసిన చోట(ఫామ్‌-10 ఇచ్చిన చోట) విచారణ జరపవద్దని, ఫామ్‌-10 ఇవ్వని చోట ఏదైనా చర్యలు తీసుకొని ఉంటే.. వాటిని ప్రకటించొద్దని పేర్కొంటూ హైకోర్టు ఫిబ్రవరి 19న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ వ్యాజ్యంలో ఎన్నికల కమిషనర్‌ తాజాగా కౌంటర్‌ దాఖలు చేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు