close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మట్టి, నీరు తప్ప అమరావతిలో ఏముంది?

విజయవాడ, గుంటూరును నాశనం చేశారు
రాష్ట్ర మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘దేశమంతా తిరిగి చెంబు మట్టి, గ్లాసు నీళ్లు తెచ్చి అమరావతిలో పోగేశారు. అంతకుమించి అక్కడ ఏముంది? ఒక షెడ్డు వేసి మట్టి తెచ్చి షో చేశారు’ అని సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. అమరావతి పేరుతో మహా నగరాన్ని నిర్మిస్తామని చెప్పి గ్రాఫిక్స్‌ చూపించి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ‘అదే రాజధానిని విజయవాడలోగానీ, గుంటూరులోగానీ కట్టి ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు ఆయన ఏ ముఖం పెట్టుకుని విజయవాడలో ఓట్లు అడుగుతున్నారు’ అని ప్రశ్నించారు. ‘అమాయకులైన రైతులను బెదిరించి, ఆశ చూపి వేల ఎకరాల భూములను లాక్కున్నారు. అక్కడ చంద్రబాబు, ఆయన అనుచరులు పెట్టుబడులు పెట్టి భూములను సంపాదించుకున్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలిక భవనాలు కట్టి ప్రజల్ని మోసం చేశారు. వర్షం వస్తే అసెంబ్లీ, సచివాలయం కురిసే పరిస్థితి. భూముల్ని దోచుకోవడంపై పెట్టిన శ్రద్ధ భవనాల నిర్మాణంపై పెట్టలేదు’ అని మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

పవన్‌ కల్యాణ్‌ దిల్లీ వెళ్లి ఏం చేశారు..
‘జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దిల్లీ పర్యటనకు వెళ్లి ఏం మాట్లాడి వచ్చారు? గతంలో అవసరమైతే కేంద్రాన్ని విజయవాడ వీధుల్లోకి తీసుకొస్తామని చెప్పారుగా? ఇప్పుడు తెచ్చి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేయాలిగా? మీరు ఒక్క మాట చెబితే అయిపోతుందిగా?’ అని ఎద్దేవా చేశారు. ‘పవన్‌ పార్టీ బీఫారాలు వేరే వాళ్ల చేతిలో పెట్టారు. సినిమాకు వచ్చి వెళ్లినట్లు రాష్ట్రానికి వచ్చి వెళుతున్నారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం ఉంటే ఇంత స్వేచ్ఛగా తిరగగలరా? ప్రజల్ని మోసం చేయడం ఆపాలి’ అని అన్నారు.

చంద్రబాబు సంగతి అసెంబ్లీలో చూస్తా: మంత్రి కొడాలి

ఈనాడు డిజిటల్‌- అమరావతి: తాను పేకాట క్లబ్బులు నిర్వహించానని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి అంటే ఆయన సంగతి అసెంబ్లీలో చూస్తానని పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. ‘చంద్రబాబు అమరావతి పేరుతో కోట్లు దోచుకున్నారు. అక్రమాలపై కేసులు పెడితే న్యాయస్థానం నుంచి స్టే తెచ్చుకున్నారు. వాటిని ఎత్తివేస్తే 24 గంటల్లో ఆయన్ను అరెస్టు చేయకపోతే రాజకీయాల నుంచి విరమించుకుంటా. నేను పేకాట క్లబ్బులు నిర్వహించానని ప్రతిపక్ష నేత నమ్మితే.. గుడివాడలో నాపై పోటీ చేయాలి. ఎవరేంటో ప్రజలే తేలుస్తారు. ఆయనకు ధైర్యం ఉంటే గుడివాడకు రావాలి. అక్కడే తేల్చుకుంటాం’ అని సవాల్‌ చేశారు. ఆదివారం తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో కొడాలి నాని విలేకర్లతో మాట్లాడారు.  ‘డీజిల్‌, పెట్రోలు, గ్యాస్‌ ధరల పెరుగుదల, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు బాధ్యులెవరు? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విశాఖ ఉక్కును జగన్‌ ప్రైవేటీకరిస్తారా? డీజిల్‌, గ్యాస్‌ ధరలను జగన్‌ పెంచుతారా? చంద్రబాబుకు దమ్ముంటే వీటికి కారణమైన ప్రధాని మోదీని ప్రశ్నించాలి’ అని వ్యాఖ్యానించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు