ఏ క్షణమైనా విశాఖకు..
close

ప్రధానాంశాలు

ఏ క్షణమైనా విశాఖకు..

పరిపాలన రాజధాని తరలింపుపై మంత్రి బొత్స
త్వరితగతిన పరిషత్‌ ఎన్నికలు
మిగిలిన పురపాలికలకు కూడా...

రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే: పరిపాలన రాజధానిని ఏ క్షణమైనా విశాఖపట్నానికి తరలిస్తామని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని, మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామన్నారు.  జడ్పీటీసీ, ఎంపీటీసీ, సహకార ఎన్నికలతోపాటు మిగిలిన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల ఎన్నికలను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్‌రామ్‌ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పమని, దీనికి విధానపరమైన నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఉన్న అవకాశాలను తెదేపా అయిదేళ్ల పాలనలో చంద్రబాబునాయుడు దుర్వినియోగం చేశారని, అవినీతితోపాటు.. అమరావతిని ఒక వర్గానికి చెందిన రాజధానిగా చేసి అభివృద్ధిని 20 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు. కోర్టు అడ్డంకులు తొలగిపోగానే విలీన గ్రామాలతో కలిపి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం ఎన్నికలు పూర్తయిన మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో సౌకర్యాల కల్పనపై దృష్టి సారించామన్నారు. ఇందులో భాగంగా మున్సిపల్‌ ఛైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లకు ఈ నెల 31, వచ్చే నెల 1న రెండురోజులపాటు విజయవాడలో కార్యశాల నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, కురసాల కన్నబాబు, ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు ఉదయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని