close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాష్ట్రంలో 3,495 మందికి కరోనా

9 మంది మృతి
ఆరున్నర నెలల తర్వాత అత్యధిక పాజిటివిటీ రేటు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో దాదాపు ఆరున్నర నెలల తర్వాత తొలిసారి 24 గంటల వ్యవధిలో అత్యధికంగా కొవిడ్‌ పాజిటివిటీ రేటు నమోదైంది. గతేడాది సెప్టెంబరు 23న 10.97 శాతం పాజిటివిటీ రేటు నమోదై.. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. మళ్లీ మార్చి నెల చివరి వారం నుంచి క్రమంగా పెరుగుతూ ఆదివారంనాటికి 11.01 శాతానికి చేరింది. శనివారం ఉదయం 9గంటల నుంచి ఆదివారం ఉదయం 9గంటల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 31,719 నమూనాలను పరీక్షించారు. వారిలో 3,495 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. ఈ మహమ్మారి బారిన పడిన వారిలో తాజాగా చిత్తూరులో నలుగురు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 9,25,401కు, మరణాలు 7,300కు చేరాయి. తాజాగా వచ్చిన కరోనా కేసుల్లో అత్యధికం చిత్తూరు (719), గుంటూరు (501), విశాఖపట్నం (405) జిల్లాల్లో ఉన్నాయి. ఉభయగోదావరి మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ వందకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 20,954 క్రియాశీల కేసులున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 1,54,29,391 నమూనాలను పరీక్షించారు. 24 గంటల వ్యవధిలో 1,198 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

వ్యాక్సిన్‌ వేయించుకోవాలి: గవర్నర్‌

కొవిడ్‌-19 మహమ్మారి మళ్లీ పెద్దఎత్తున వ్యాపిస్తున్నందున ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సూచించారు. మన పిల్లల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని ప్రకటనలో కోరారు. వ్యాక్సిన్‌ పూర్తిగా సురక్షితమని, అర్హులందరూ వేయించుకోవాలని పేర్కొన్నారు.


క్వారంటైన్‌లోకి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆయన వ్యక్తిగత, భద్రతా సిబ్బంది, ముఖ్య కార్యనిర్వాహకుల్లో ఎక్కువ మంది వారం వ్యవధిలో ఒక్కొక్కరుగా కొవిడ్‌ బారిన పడ్డారు. వీరంతా ఆయనకు సమీపంలో విధులు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో కరోనా విస్తృత నివారణలో భాగంగా ముందు జాగ్రత్త చర్యగా ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. వైద్యుల సూచన మేరకు ఆయన ప్రశాంత వాతావరణంలో ఉంటున్నారని వివరించింది. అక్కడి నుంచే రోజువారీ విధులు నిర్వహిస్తూ పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారని, టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారని తెలిపింది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు