close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టీకా ఉత్సవ్‌.. కరోనాపై రెండో యుద్ధానికి నాంది

మాస్క్‌ పెట్టుకోండి.. అందరినీ కాపాడండి
ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా ప్రారంభమైన ‘టీకా ఉత్సవ్‌’ను కొవిడ్‌-19పై రెండో పెద్ద యుద్ధానికి నాందిగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మహాత్మ జ్యోతిబా ఫులే జయంతి (ఏప్రిల్‌ 11) నుంచి బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి (ఏప్రిల్‌ 14) వరకు నిర్వహించే ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ సందర్భంగా అందరూ వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు సామాజిక పరిశుభ్రతకు విశేష ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన ఆదివారం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. వైరస్‌ కట్టడికి ప్రజలంతా నాలుగు విషయాలను గుర్తుంచుకోవాలని ప్రధాని మోదీ కోరారు.
* ప్రతి ఒక్కరూ.. ఒకరికి టీకా వేయించాలి (ఈచ్‌ వన్‌ - వ్యాక్సినేట్‌ వన్‌). చదువుకోని వాళ్లు, వయోధికులు, స్వయంగా కేంద్రాలకు వెళ్లి టీకా వేయించుకోలేనివారికి వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి అందరూ సహకరించాలని ప్రధాని పిలుపునిచ్చారు.
* ప్రతి ఒక్కరూ.. ఒకరికి చికిత్స అందించాలి (ఈచ్‌ వన్‌ - ట్రీట్‌ వన్‌). వనరులు, విషయ పరిజ్ఞానం లేనివారికి కరోనా చికిత్స అందించడంలో సహాయం చేయాలి.
* ప్రతి ఒక్కరూ.. ఒకర్ని కాపాడాలి (ఈచ్‌ వన్‌ సేవ్‌ వన్‌). ఈ సూత్రాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించడం ద్వారా తమను తాము రక్షించుకోవడంతోపాటు ఇతరులనూ కాపాడాలి. ఇందుకు అందరూ అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
* నాలుగో విషయం.. ఎక్కడైనా ఒక కరోనా పాజిటివ్‌ కేసు బయటపడితే, వెంటనే ఆ కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు ‘మైక్రో కంటెయిన్‌మెంట్‌ జోన్‌’ను ఏర్పాటు చేయాలి. భారత్‌ లాంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలో కరోనాపై యుద్ధం చేయడానికి ఇదో మహత్తర ఆయుధంగా ప్రధాని పేర్కొన్నారు. ఒక్క పాజిటివ్‌ కేసు కనిపించినా అందరూ అప్రమత్తం కావాలి. అందరికీ పరీక్షలు చేయించడం తప్పనిసరి.

టీకా అందరి బాధ్యత..

‘‘అర్హులైన వారందరికీ టీకా వేయించే బాధ్యత ప్రభుత్వంతోపాటు, సమాజానికీ ఉంటుంది. ఒక్క వ్యాక్సిన్‌ కూడా వృథా కాకుండా మనం జాగ్రత్తపడాలి. టీకా వినియోగాన్ని గరిష్ఠస్థాయికి తీసుకెళ్లాలి. మన సామర్థ్యం పెంచుకోవడానికి ఇదీ ఓ మార్గం. అవసరమైనప్పుడు తప్పితే మిగతా సమయాల్లో ఇంటికే పరిమితం కావడం ఇతర నిబంధనలు పాటించడంపైనే కరోనాపై జరుగుతున్న యుద్ధంలో మన విజయం ఆధారపడి ఉంటుంది. ఈ నాలుగు రోజులు మనం వ్యక్తిగతంగా, సామాజికంగా, ప్రభుత్వపరంగా లక్ష్యాలను నిర్దేశించుకొని అమలు చేయాలి. ప్రజా భాగస్వామ్యంతో మనం మరోసారి కరోనాను నియంత్రణలోకి తేగలుగుతామన్న పూర్తి విశ్వాసం నాకుంది’’ అని ప్రధాని మోదీ లేఖలో పేర్కొన్నారు.

భాజపా శ్రేణులకు నడ్డా పిలుపు

దేశవ్యాప్తంగా అర్హులైన ప్రజలందరికీ టీకాలు వేసే లక్ష్యంతో ప్రారంభించిన టీకా ఉత్సవ్‌ను విజయవంతం చేయాలని భాజపా శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం పిలుపునిచ్చారు. సమాజం ఆరోగ్యకరంగా ఉండేలా చూడాలని కోరారు. ఈ వ్యాక్సిన్‌ డ్రైవ్‌కు సంబంధించి ప్రధాని మోదీ చేసిన సూచనలను తప్పక పాటించాలన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు