close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వైకాపా పాలనలో బీసీలకు మొండిచెయ్యి

తిరుపతి ఉపఎన్నికలో అరాచక పాలన అంతానికి నాంది పలకండి
నెల్లూరు జిల్లా రాపూరు బహిరంగ సభలో చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌- నెల్లూరు, న్యూస్‌టుడే- రాపూరు: ‘వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో 25 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనదే. దాన్ని మళ్లీ 33 శాతానికి పెంచిందీ తెదేపానే. ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ రిజర్వేషన్లను 25 శాతానికి తగ్గించడంతో బీసీలకు 16 వేల పదవులు పోయాయి. మా హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో 36 మంది బీసీలకు స్థానం కల్పిస్తే.. వైకాపాకు కేవలం ముగ్గురు మాత్రమే కనిపించారు. ఇదీ బీసీలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి. జగన్‌రెడ్డి జమానాలో బీసీలకు సామాజిక న్యాయం.. నేతిబీరలో నెయ్యి అంత వాస్తవం’ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వెంకటగిరి నియోజకవర్గం రాపూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపాను ఎందుకు ఓడించాలో, తెదేపాను ఎందుకు గెలిపించాలో మీ అందరికి చెప్పేందుకే వచ్చానన్నారు. ఆదాయం తగ్గి, ఖర్చులు పెరగడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూడలేక.. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని వచ్చానన్నారు. జగన్‌రెడ్డికి సంస్కృతి, సంప్రదాయాలు తెలియవని ఎద్దేవా చేశారు. నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యే చనిపోతే.. మొదటిసారి పోటీ లేకుండా ఆయన కుటుంబసభ్యులను గెలిపించిన ఘనత తెదేపాదే అని చెప్పారు. తిరుపతి ఎంపీ కరోనాతో చనిపోతే, కనీసం పరామర్శకు రాని జగన్‌రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కక్షసాధింపు రాజకీయం పెరిగిందని, పవన్‌కల్యాణ్‌ కూడా బాధితుడయ్యారన్నారు.

నమ్మకద్రోహి జగన్‌
‘ఒక్కసారి ఆలోచించండి. ఈ వయసులో ఈ కష్టం నాకు అవసరమా? సీఎం పదవి నాకు కొత్తకాదు. ప్రజలు నన్ను గౌరవించి సమైక్యాంధ్రకు పదేళ్లు సీఎంగా కూర్చోబెట్టారు. ఆ రికార్డును ఎవరూ బద్దలుకొట్టలేరు. రాష్ట్రం నాశనమైపోతుంటే మౌనంగా ఉండలేకపోతున్నా. 2029 నాటికి దేశంలో ఏపీ మొదటి స్థానంలో ఉండాలని కష్టపడ్డాను. ఇప్పుడు చూడండి. రెండేళ్లకే రాష్ట్రం ఎంత దీనావస్థకు చేరుకుందో’ అని వివరించారు. పాదయాత్రలో మాయమాటలు చెప్పి.. ప్రజలను మోసం చేసిన నమ్మకద్రోహి జగన్‌రెడ్డి అని విమర్శించారు. ‘దేశంలో ఉచిత ఇసుకను ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇప్పుడు పక్కనే ఉన్న నదిలో ఇసుకైనా మీకు దొరుకుతోందా? కానీ చెన్నై, బెంగళూరులో దొరుకుతుంది. మీకు కావాలంటే బ్లాక్‌లో రూ.5వేలు పెట్టాలి. నేను సీˆఎంగా ఉన్నప్పుడు సిమెంట్‌ బస్తా రూ.250. ఇప్పుడు రూ.400 అయింది. జగన్‌రెడ్డి సొంత కంపెనీ భారతీ సిమెంట్‌కు లాభాలు చేకూర్చేందుకే ధరలు పెంచేశారు. భారతి సిమెంట్‌ను ఎవరు కొంటే.. వారికే ఇసుక ఇస్తున్నారు’ అన్నారు.

ఎందుకు ఓటెయ్యాలని నిలదీయండి
‘ఈ ఎన్నికల్లో వైకాపాకు ఎందుకు ఓటేయాలి? ధరలు పెంచినందుకా? ప్రత్యేక హోదా సాధిస్తానని నమ్మించి మోసం చేసినందుకా? మద్యపాన నిషేధమని చెప్పి భారీగా ధరలు పెంచినందుకా? సీపీఎస్‌ రద్దు చేస్తామని ఉద్యోగులను మోసం చేసినందుకా? రైతు భరోసా పేరిట మిగిలిన పథకాలను రద్దు చేసినందుకా?’ అని వైకాపా నాయకులను ప్రశ్నించాలని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైకాపా నేతలు త్వరలో ఇంటింటికి వచ్చి.. ఓటుకు రూ.1000, రూ.2వేలు, అవసరమైతే రూ.5వేలు ఇస్తారన్నారు. అవి తీసుకుని మీరు ప్రలోభపడితే.. కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అని హెచ్చరించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ నడుం బిగించాలని, తిరుపతి ఉప ఎన్నికల్లో పనబాక లక్ష్మిని గెలిపించి.. వైకాపా అరాచక పాలన అంతానికి నాంది పలకాలని కోరారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు