close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మందకొడిగా ‘టీకా ఉత్సవం’

ఆదివారం 40 వేల లోపే టీకాల పంపిణీ
విశాఖ, అనంతపురం జిల్లాల్లో ఆగిన ప్రక్రియ
వ్యాక్సిన్‌ కొరతే కారణం
విజయనగరం, చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలుల్లో నిల్వలు ఖాళీ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కొవిడ్‌ వ్యాక్సిన్‌ కొరత కారణంగా ఆదివారం రాష్ట్రంలో ‘టీకా ఉత్సవం’ మందకొడిగా ప్రారంభమైంది. సాధారణంగా జరుగుతున్న టీకా పంపిణీనే పలుచోట్ల స్వల్ప మార్పులతో ఉత్సవంగా మార్చి లాంఛనంగా ప్రారంభించారు. టీకా ఉత్సవం కోసం 25 లక్షల డోసులు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినా ఇంకా అందలేదు. దీంతో జిల్లాల్లో అందుబాటులో ఉన్న డోసులతోనే అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశాఖపట్నం, అనంతపురం జిల్లాల్లో ఆదివారం ఒక్కరికి కూడా వ్యాక్సిన్‌ ఇవ్వలేదు. పశ్చిమగోదావరి జిల్లాలో 1,710 మందికి మాత్రమే టీకా వేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 2 వేలు, చిత్తూరులో 3 వేలు, శ్రీకాకుళంలో 3,500, కర్నూలులో 6 వేలు, గుంటూరులో 7 వేల మందికి టీకా ఇచ్చారు. ఆదివారంతో ఈ జిల్లాల్లో వ్యాక్సిన్‌ నిల్వలు అయిపోయాయి. రాష్ట్రంలో సాధారణ సమయాల్లో రోజుకు లక్ష నుంచి లక్షన్నర డోసులు ఇస్తుండగా.. ఆదివారం ఈ సంఖ్య 40 వేలు దాటకపోవడం గమనార్హం.

ప్రత్యేక కేంద్రాలు అంతంతమాత్రమే
టీకా ఉత్సవాల్లో భాగంగా అదనపు వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. వ్యాక్సిన్‌ కొరత కారణంగా రాష్ట్రంలో ఎక్కువచోట్ల వీటిని ప్రారంభించలేదు. జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలు, నియోజకవర్గాల్లో అంతంతమాత్రంగానే ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా మొత్తమ్మీద ఏలూరులో మూడు కేంద్రాలు ఏర్పాటు చేసి.. 310 మందికి టీకా వేశారు. విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్టాండులో టీకా కేంద్రం ఏర్పాటు చేయగా ఆదివారం సాయంత్రం 5 గంటల వరకూ 120 మంది ఉద్యోగులు వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

శుక్ర, శనివారాల్లో టీకా నిలిపేసి..
టీకా ఉత్సవం కోసం కొన్ని జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో వ్యాక్సిన్‌ను తక్కువగా పంపిణీ చేశారు. ఇలా మిగిలిన టీకాలను ఆదివారం వేశారు. విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఇలా అందుబాటులో ఉన్న డోసులను వేశారు. వ్యాక్సిన్‌ కొరతకు తోడు రవాణా ఇబ్బందుల కారణంగా కొన్ని జిల్లాల్లో టీకా పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైంది. పలుచోట్ల 12 గంటల వరకూ ప్రజలు నిరీక్షించాల్సి వచ్చింది. విజయవాడ యనమలకుదురులోని ప్రభుత్వ పాఠశాలలో ఉదయం 11.30 గంటల వరకూ టీకా పంపిణీ మొదలవకపోవడంతో కొంతమంది వెనుదిరిగారు. మచిలీపట్నంలోని నిల్వ కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు తరలించడంలో ఇబ్బందులు ఎదురుకావడంతో వ్యాక్సినేషన్‌ ఆలస్యమైందని స్థానిక అధికారులు చెప్పారు. రాష్ట్రానికి రానున్న 24 గంటల్లో 2 లక్షల డోసులు రానున్నట్లు సమాచారం అందిందని ఓ జిల్లా అధికారి చెప్పారు. ఇవి వస్తేనే టీకా పంపిణీ జరుగుతుందని, ఇకపై కేటాయింపుల ప్రకారం జిల్లాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తారని వివరించారు.

జిల్లాల్లో నిండుకున్న నిల్వలు
* విజయనగరం జిల్లాలో 102 ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్‌ కేంద్రాలుండగా.. 11 పీహెసీల పరిధిలో 25 కేంద్రాల్లోనే టీకా పంపిణీ చేశారు. టీకా ఉత్సవం కోసం ప్రత్యేక కేంద్రాలేవీ ఏర్పాటు చేయలేదు. ఆదివారంతో జిల్లాలో నిల్వలు అయిపోయాయి.
* వ్యాక్సిన్‌ కొరతతో చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.
* పశ్చిమగోదావరి జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల్లో టీకా పంపిణీ జరగలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,300 టీకాలు వేశారు.
* నెల్లూరు నగరంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని సచివాలయాల్లో వ్యాక్సిన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

రాష్ట్రానికి 6 లక్షల టీకాలు
ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని వెల్లడి

రానున్న రెండు, మూడు రోజుల్లో దశలవారీగా కేంద్రం నుంచి 6 లక్షల కొవిడ్‌ టీకాలు రాబోతున్నాయని ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యం) ఆళ్ల నాని ఆదివారం వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్‌ విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని పేర్కొన్నారు. అర్హులందరికీ టీకా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు