చంద్రబాబు సభపై రాళ్ల దాడి

ప్రధానాంశాలు

చంద్రబాబు సభపై రాళ్ల దాడి

ఇది రాజకీయ కుట్రేనన్న తెదేపా అధినేత
సభావేదిక వద్దే నేలపైనే కూర్చొని ధర్నా
ఎస్పీ కార్యాలయానికి కాలినడకన వెళ్లి ఫిర్యాదు

రాళ్లదాడి చేస్తే భయపడేది లేదు. ఖబడ్దార్‌. జాగ్రత్తగా ఉండండి. గతంలో మీ రౌడీయిజాన్ని అణచివేశా. పోలీసులూ చూడండి. సభలో రాళ్లు వేస్తున్నారు. శాంతిభద్రతల రక్షణ మీకు చేతకాకుంటే నేను 5 నిమిషాల్లో చేసి చూపిస్తా. జడ్‌ప్లస్‌ భద్రత కలిగిన నాకే రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజలకు ఏం రక్షణ ఉంటుంది? 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. ఎప్పుడూ నా సభలో రాయి వేసే సాహసం ఎవరూ చేయలేదు. ఎవరినీ వదలిపెట్టను. అవసరమైతే ప్రజల కోసం పోరాడి జైలుకెళ్తా. రాళ్లు వేసిన వాళ్లను పట్టుకోవాలి. ఇంత పెద్ద సభలో పోలీసులు లేరు. వారు వెంటనే ముందుకు రాకుంటే ఇక్కడే ధర్నా చేస్తా.

- చంద్రబాబు

ఈనాడు, తిరుపతి: తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా తెదేపా నిర్వహించిన బహిరంగ సభలో రాళ్ల దాడి జరగడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు సోమవారం తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ ప్రాంతం నుంచి కృష్ణాపురం ఠాణా వరకు రోడ్‌షో నిర్వహించారు. అక్కడ బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం ముగుస్తున్న సమయంలో కార్యకర్తలు.. తమపై కొందరు రాళ్ల దాడి చేశారని ఫిర్యాదు చేయడంతో చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు. తెదేపా నాయకులపై కక్షగట్టి హత్యాయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి పోలీసులు, ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. దాడి చేసిన వారిని పట్టుకోవడానికి పోలీసులు ముందుకురాకపోతే అక్కడే కూర్చొని ధర్నా చేస్తానని హెచ్చరించారు. పోలీసులు స్పందించకపోవడంతో చంద్రబాబు అక్కడే నేలపై బైఠాయించారు. ఆయనతోపాటు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు, తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి, పలువురు నాయకులు ధర్నాలో కూర్చొన్నారు. రాళ్లు వేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని, ధర్నాను ఉపసంహరించుకోవాలని అదనపు ఎస్పీ మునిరామయ్య, డీఎస్పీ మురళీకృష్ణ పలుమార్లు తెదేపా నేతలను కోరారు. అయితే కలెక్టర్‌, ఎస్పీలు రావాలని చంద్రబాబు పట్టుబట్టారు. తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెదేపా నేతలతో ఫోన్‌లో మాట్లాడినా వారు శాంతించలేదు. చంద్రబాబు అరగంటకుపైగా రహదారిపై బైఠాయించారు. శాంతిభద్రతలను కాపాడటంలో తెదేపా ముందుంటుందని, అందువల్లే తాము ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తామని చెప్పి ధర్నా విరమించారు. కృష్ణాపురం ఠాణా దగ్గర నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ఆయన కాలినడకన వచ్చారు. అదనపు ఎస్పీ (పరిపాలన) సుప్రజ.. ఎస్పీ కార్యాలయం గేటు బయటకు వచ్చి చంద్రబాబుతో మాట్లాడారు. పోలీసులు దోషులతో కుమ్మక్కైనట్లు ఉందని, రాళ్లదాడికి కారకులను పట్టుకుని చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఈసీకి ఫిర్యాదు చేస్తాం

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తిరుపతి సభలో జరిగిన రాళ్ల దాడి తెదేపాపై కాదని, ప్రజాస్వామ్యంపై దాడి అని స్పష్టం చేశారు. ఇది తెదేపాను రాజకీయంగా దెబ్బతీసేందుకు పన్నిన కుట్ర అని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్‌ దీన్ని తీవ్రంగా పరిగణించాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం దీనిపై తమ పార్టీ ఎంపీలు దిల్లీకి వెళ్లి సీఈసీకి ఫిర్యాదు చేస్తారని వెల్లడించారు.  వైకాపా శ్రేణులు స్థానిక సంస్థల్లో చూపించిన గూండాయిజం, రౌడీయిజం ఈ సభలోనూ చూపించి రాళ్ల వర్షం కురిపించారని ధ్వజమెత్తారు. ఈ దాడిలో ఆరేడుగురికి గాయాలయ్యాయన్నారు. అదనపు ఎస్పీ కేసు నమోదు చేస్తామన్నారని, కానీ తమకు పోలీసులపై నమ్మకం లేదని అన్నారు. పోలీసులు కొంతమందిని ఇష్టానుసారంగా వదిలిపెట్టి రౌడీయిజానికి సహకరిస్తున్నారని మండిపడ్డారు. పారామిలిటరీ దళాలు రావాలని, అన్ని బూత్‌లకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

నిప్పుతో ఆడుతున్నారు.. జాగ్రత్త

అంతకుముందు బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ.. తిరుపతికి నిత్యం లక్ష మంది భక్తులు వస్తుంటారని.. అటువంటిది తిరుపతికి ఎవరు వస్తారని ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారని అన్నారు. ఆ  వీడియో బయటకు వస్తే తమపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అందులోని మాటలు తనవి కాదని జగన్‌ నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. నీతి, నిజాయతీతో ఉన్న తమ జోలికి వస్తున్నారని, నిప్పును పట్టుకుంటున్నారు.. జాగ్రత్త అని హెచ్చరించారు. తిరుపతిని ఎంతో పవిత్రంగా చూశానని, ఇప్పుడు దేవుడితో వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోంది. ఆఖరికి భక్తులిచ్చే తలనీలాలను సైతం స్మగ్లింగ్‌ చేస్తున్నారు. తిరుమల ఏడుకొండలు కాదని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జీవో తెచ్చారు. నేను పాదయాత్ర చేస్తే జీవో వెనక్కి తీసుకున్నారు. తిరుమల ప్రధాన అర్చకులు రమణదీక్షితులు నాడు నా ఇంట్లో పింక్‌ డైమండ్‌ ఉందని దుష్ప్రచారం చేశారు. ఇటువంటి వాళ్లను దేవుడైనా, న్యాయస్థానమైనా శిక్షిస్తారు. తిరుమలలోని లడ్డూ, వడల ధరలు విపరీతంగా పెంచారు. స్థానిక సంస్థల ఎన్నికలో ఓటుకు లడ్డూలు పంపిణీ చేశారు. ఇన్ని లడ్డూలు వారికి ఎలా వచ్చాయి’ అని ధ్వజమెత్తారు. తిరుపతి ఎన్నికల్లో తెదేపాకు ఓటేసి, వైకాపాను చిత్తుగా ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. లేకపోతే ధరలు, రౌడీయిజం, బెదిరింపులు అన్నీ పెరుగుతాయన్నారు. తితిదే ఉద్యోగులకు తెదేపా అండగా ఉంటుందన్నారు.

పవన్‌పై కక్షసాధిస్తున్నారు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భాజపాకు మద్దతిస్తున్నారని ఆయనపై ప్రభుత్వం కక్షసాధిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘ఆయన వకీల్‌సాబ్‌ సినిమా తీస్తే ఈయనకు ఎందుకు బాధ వచ్చిందో అర్థం కావట్లేదు. అందరికీ ఐదారు రోజులు టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తుంటారు. పవన్‌ సినిమాకు మాత్రం అవకాశం కల్పించలేదు. ఈ మాట అంటే నేను పవన్‌కు మద్దతిస్తున్నట్లు కాదు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు అందరికీ సమానంగా అందాలి. సినిమా పరిశ్రమపై అనేక మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఎవరికి అన్యాయం జరిగినా తెదేపా పోరాడుతుంది’ అని ఆయన స్పష్టం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని