close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కాష్ఠం.. కష్టం

గుంటూరు బొంగరాలబీడులో రెండు రోజుల్లో 92 మందికి అంత్యక్రియలు
గతంలో రోజుకు 4, 5 మృతదేహాలే వచ్చేవి
ప్రస్తుత స్థితికి కొవిడ్‌ కల్లోలమే కారణమా?
నివేదికల్లో మాత్రం గుండెపోటుగా నిర్ధారణ

ఈనాడు డిజిటల్‌ - గుంటూరు, న్యూస్‌టుడే - గుంటూరు సిటీ, నగరంపాలెం : భగభగమండే చితిమంటలు ఓవైపు.. ఆప్తులను కోల్పోయిన ఆవేదన, ఆర్తనాదాలు మరోవైపు.. మరుభూమికి సైతం అంతులేని వేదన మిగులుస్తున్నాయి. శ్మశానాలు సైతం వైరాగ్యం వదిలి భోరున విలపిస్తున్నాయి. వెల్లువలా వస్తున్న మృతదేహాలను చూసి వల్లకాడు సైతం తన వల్లకాదంటూ రోదిస్తోంది. గుంటూరు జిల్లాలో కొన్నిరోజులుగా అసాధారణ రీతిలో మరణాలు నమోదవుతున్నాయి. వీటిలో ఎక్కువభాగం కొవిడ్‌ మరణాలే అయినప్పటికీ అధికారులు సాంకేతికంగా వీటిని ధ్రువీకరించడం లేదు. గుంటూరు నగరం బొంగరాలబీడులోని మహాప్రస్థానానికి ఇటీవల కొన్నిరోజులుగా మృతదేహాలు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. బుధవారం 40 మృతదేహాలకు, మంగళవారం 52 భౌతికకాయాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నెల 19న 23, 18న 26 మృతదేహాలకు దహన సంస్కారాలు చేశారు. సాధారణంగా ఈ శ్మశానానికి రోజుకు 4 నుంచి 5 మృతదేహాలు తీసుకొస్తారు. కొవిడ్‌ వైరస్‌ వల్లే ఇన్ని మరణాలు నమోదవుతున్నాయనేది ఈ గణాంకాలే చెబుతున్నాయి. కొవిడ్‌ కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉన్న గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో కూడా 15 నుంచి 20 మృతదేహాలే వచ్చాయి. అలాంటిది ప్రస్తుతం సగటున రోజుకు 30 నుంచి 40 భౌతికకాయాలకు అంత్యక్రియలు చేయాల్సి వస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. నాలుగు రోజుల్లోనే ఏకంగా 141 మందికి ఇక్కడ దహన సంస్కారాలు నిర్వహించారు. ఇందులో దాదాపు 98 కొవిడ్‌ మృతదేహాలేనని సమాచారం. ఇక్కడికి వచ్చే భౌతికకాయాల్లో దాదాపు 80 శాతం ఆసుపత్రుల నుంచి ప్లాస్టిక్‌ కవర్లలో జిప్‌ వేసి వస్తున్నవే కావడం గమనార్హం. జీజీహెచ్‌తో పాటు కొత్తపేటలోని ప్రైవేటు ఆస్పత్రుల నుంచి మృతదేహాలను ఇక్కడికే తీసుకొస్తున్నారు. స్తంభాలగరువు, సంగడిగుంటతో పాటు నగరంలోని మొత్తం 11 శ్మశానవాటికల్లోనూ మృతదేహాల తాకిడి పెరిగింది.

అసాధారణ మరణాల వెనుక?
శ్మశాన నిర్వాహకులకు మృతదేహంతో పాటు అప్పగించే పత్రంలో మరణానికి కారణాన్ని ఎక్కువగా గుండెపోటుగా చూపుతున్నారు. కార్డియాక్‌ అరెస్టు లేదా కార్డియాక్‌ పల్మనరీ అరెస్టు లేదా కార్డియాక్‌ రెస్పిరేటరీ అరెస్టని పేర్కొంటున్నారు. సహజ మరణాలని చెబుతున్నా.. ఇవి పరోక్షంగా కొవిడ్‌ వైరస్‌ వల్లేనని వారి పరీక్షల నివేదికలు నిర్ధారిస్తున్నాయి. కరోనా బారినపడి కోలుకోలేనివారు చివరకు గుండెపోటుతో ఎక్కువగా మృతి చెందుతున్నారు. కొందరు మృతుల పరీక్షల నివేదికలో కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారిస్తుండగా, ఇంకొందరికి బైలేటరల్‌ న్యుమోనియాగా.. మరికొందరికి న్యుమోనియా వైరల్‌గా చూపుతున్నారు. చికిత్స అందించేటప్పుడు కరోనాగా చెప్పి మృతి చెందిన తర్వాత మాత్రం సాధారణ గుండెపోటు అని చూపడానికి కారణాలేమిటో బంధువులకు అంతుపట్టడం లేదు. సాధారణ మరణాలైతే అంతిమ సంస్కారాల నిర్వహణకు బంధువులు తరలివస్తారు. కొన్ని రోజులుగా మృతదేహాల వెంట ఎవరూ రావడం లేదు. శ్మశాన నిర్వాహకులతో పాటు అమ్మ ఛారిటబుల్‌ ట్రస్టు, రుద్ర ఛారిటబుల్‌ ట్రస్టు సభ్యులే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు.

ఇన్ని మరణాలు ఎప్పుడూ చూడలేదు

మహాప్రస్థానానికి సాధారణ రోజుల్లో 4 నుంచి 7 వరకు మృతదేహాలు వస్తాయి. గతేడాది కొవిడ్‌ వ్యాప్తి గరిష్ఠంగా ఉన్నప్పుడు 15-20 వరకు వచ్చాయి. ఇటీవల 25 నుంచి 30 వరకు పెరిగాయి. గడిచిన రెండ్రోజుల్లో 90కి పైగా మృతదేహాలకు ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. ఇందులో ప్రతి పదింటిలో 8 కొవిడ్‌ మరణాలే. ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది.

-గాంధీ, మహాప్రస్థానం మేనేజర్‌, బొంగరాలబీడు

ఒక్కరోజే 52 మృతదేహాలు

కొవిడ్‌ ఉద్ధృతితో మంగళవారం ఒక్కరోజే 52 మృతదేహాలు మహాప్రస్థానానికి వచ్చాయి. కొవిడ్‌ బారినపడి చనిపోతున్నవాళ్లే ఎక్కువ మంది. చనిపోయినవారికి అమ్మ ఛారిటబుల్‌ ట్రస్టు తరఫున అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. దీనికి హాజరైన బంధువులను చుట్టుపక్కలవారు రానివ్వకపోతే మేమే 15 రోజులపాటు ఆశ్రయం కల్పిస్తున్నాం.

-లక్ష్మీనారాయణ, అమ్మ ఛారిటబుల్‌ ట్రస్టు సభ్యుడు

నిద్రాహారాలు లేకుండా పని చేస్తున్నాం

కరోనా కేసులు ఎక్కువ కావడంతో మహాప్రస్థానానికి మృతదేహాలు తీసుకురావడానికే సమయం సరిపోవడం లేదు. నిద్రాహారాలు లేవు. నీళ్లు తాగి కడుపు నింపుకుంటున్నాం. మృతుల బంధువులు అంత్యక్రియలకు దూరంగా ఉంటున్నారు. మాకు మృతదేహాలను అప్పగించిన తర్వాత చాలామంది ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేస్తున్నారు. మేమే అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. గతంలో అనాథ శవాలకు ఇలా అంతక్రియలు చేసేవాళ్లం.

-మస్తాన్‌రావు, రుద్ర ఛారిటబుల్‌ ట్రస్టు సభ్యుడు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు