గ్రామాల్లో మాస్క్‌ లేకపోతే జరిమానా

ప్రధానాంశాలు

గ్రామాల్లో మాస్క్‌ లేకపోతే జరిమానా

కనిష్ఠంగా రూ.50...గరిష్ఠంగా రూ.200 వరకు

ఈనాడు, అమరావతి: గ్రామాల్లో ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌ పెట్టుకోవాల్సిందే. వీధుల్లోకి వచ్చినా, ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లినా ఈ నిబంధన వర్తిస్తుంది. దీనికి విరుద్ధంగా వ్యవహరించే వారిపై జరిమానా విధించాలని గ్రామ పంచాయతీలు తీర్మానం చేస్తున్నాయి. ఇప్పటికే 70 శాతానికిపైగా పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి కొవిడ్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాయి. రెండో దశ కొవిడ్‌ గ్రామాలకు విస్తరిస్తుండడంతో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వీటిని నియంత్రించే క్రమంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. సర్పంచి అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించి తీర్మానం చేసి అమలు చేయాలని ఆదేశించింది. ప్రతి ఒక్కరూ మాస్క్‌ పెట్టుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.200 వరకు జరిమానా విధిస్తారు. ఇతర ప్రాంతాల వారు మాస్క్‌ పెట్టుకోకపోతే గ్రామాల్లోకి అనుమతించరు. వివాహాలు, పండగలు, ఇతర వేడుకలకు నిర్దేశించిన పరిమితికి మించి అనుమతించరు.

పంచాయతీలు ఏం చేయాలంటే?
* స్వీయ నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రచారం చేయాలి.
* వీధుల్లో సోడియం హైపోక్లోరైడ్‌, బ్లీచింగ్‌ చల్లాలి. చెత్త తొలగించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఇప్పటికే ఉన్న హరిత రాయబారుల (గ్రీన్‌ అంబాసిడర్ల) సేవలు సమర్థంగా వినియోగించుకోవాలి.
* పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణలో స్వయం, సహాయక సంఘాలను భాగస్వాములను చేయాలి. వ్యక్తిగత శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
* కొవిడ్‌ నియంత్రణ, పారిశుద్ధ్య కార్యక్రమాలకు సర్పంచి ఛైర్మన్‌గా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి. పంచాయతీ కార్యదర్శి కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో పంచాయతీ సభ్యులు, మహిళా పోలీసు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్త సభ్యులుగా ఉంటారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని