close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘అనంత’లో మృత్యుఘోష

ప్రాణవాయువు అందక నలుగురి మృతి

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: అనంతపురంలోని జేఎన్‌టీయూ సమీపంలోని క్యాన్సర్‌ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి ఆక్సిజన్‌ అందక నలుగురు కొవిడ్‌ బాధితులు మృత్యువాత పడ్డారు. మొన్న సర్వజనాస్పత్రిలో.. నిన్న హిందూపురం ఆస్పత్రి.. తాజాగా క్యాన్సర్‌ ఆస్పత్రిలో మరణాలు సంభవించడంతో బాధితుల్లో భయాందోళన నెలకొంది. రోజూలాగే బాధితులు మంగళవారం రాత్రి భోజనం ముగించుకున్నారు. ఇక నిద్రలోకి జారుకునే సమయంలో ఒక్కసారిగా కేకలు, అరుపులు వినిపించాయి. ఆక్సిజన్‌ కొరతతో ఒక్కొక్కరుగా తుదిశ్వాస వదిలారు. ఆక్సిజన్‌ పైపులైన్‌లో మంటలు వచ్చాయన్న వదంతులు వ్యాపించడంతో బాధితులు, బంధువులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే కలెక్టరు గంధం చంద్రుడు, జేసీ సిరి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కామేశ్వర్‌ ప్రసాద్‌, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను ప్రత్యేక అంబులెన్సుల్లో సర్వజనాస్పత్రికి తరలించారు. ఈక్రమంలో లోపల ఏం జరుగుతుందో తెలియక రోగుల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఏం జరిగిందంటే...
క్యాన్సర్‌ ఆసుపత్రిలో రోగులకు ఆక్సిజన్‌ అందకనే నలుగురు మృతి చెందినట్లు అధికార వర్గాల సమాచారం. ప్లాంటులో ఆక్సిజన్‌ అయిపోతున్న విషయాన్ని ఆసుపత్రి నిర్వాహకులు సకాలంలో గుర్తించలేదు. దీంతో ఆక్సిజన్‌పై చికిత్స పొందుతున్న బాధితులు అల్లాడారు. కొందరిని పక్కనే ఉన్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి ఆక్సిజన్‌ అందించారు. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు ట్యాంకరు రప్పించి, ప్లాంటుకు గ్యాస్‌ నింపే ఏర్పాట్లు చేశారు. గ్యాస్‌ పైపులైన్‌ పగిలి నిప్పులు రాలాయని, దీంతో భయాందోళన చెంది రోగులు బయటకు పరుగులు తీశారని వారి బంధువులు చెబుతున్నారు. ఘటన చోటుచేసుకున్న వెంటనే క్యాన్సర్‌ ఆసుపత్రి వద్ద పోలీసులను భారీగా మోహరించారు. ఎవరినీ లోపలకు అనుమతించలేదు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అక్కడికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు.

ప్రకటన చేయని కలెక్టరు
క్యాన్సర్‌ ఆస్పత్రి లోపల ఏమి జరిగిందన్న దానిపై కలెక్టరు గంధం చంద్రుడు ఎలాంటి ప్రకటన చేయలేదు. మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. అలాగే డీఎంహెచ్‌ఓ, ఆస్పత్రి అధికారులు కూడా స్పందించలేదు. లోపల ఏం జరిగిందన్న దానిపై స్పష్టత లేదు.

ఆక్సిజన్‌ సరఫరాలో లోపంతోనే

ఆక్సిజన్‌ సరఫరాలో లోపం తలెత్తింది. విషమ పరిస్థితిలో ఉన్న నలుగురు మృతి చెందారు. మిగతా వారంతా బాగున్నారు. ప్రాణవాయువు సరఫరాలో సమస్య లేకుండా చూడాలని అధికారులకు సూచించాం. బాధితులతోనూ మాట్లాడాం. ధైర్యంగా ఉండాలని చెప్పాం. ఆక్సిజన్‌ సమస్య తలెత్తినప్పుడు అలారం మోగేలా చూడాలని తెలిపాం.

-అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే

నా భర్త చనిపోయాడు

నా భర్త పేరు సోహెల్‌. కరోనా సోకడంతో మూడు రోజుల కిందట క్యాన్సర్‌ ఆస్పత్రిలోని వార్డులో చేర్పించాం. ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. రెండు, మూడు రోజుల్లోనే ఇంటికి వెళ్లొచ్చన్నారు. ఈలోపే ఆక్సిజన్‌ అందక నా భర్త చనిపోయాడు. వైద్యులు సరిగా పట్టించుకోలేదు.

-నసిరున్‌, హిందూపురం

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు