పాజిటివ్‌ ధ్రువపత్రం లేకున్నా చేర్చుకోవాలి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాజిటివ్‌ ధ్రువపత్రం లేకున్నా చేర్చుకోవాలి

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌ రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడానికి సంబంధించి కేంద్ర వైద్యఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. బాధితుల వద్ద కరోనా పాజిటివ్‌ ధ్రువపత్రం లేకున్నా ఆసుపత్రుల్లో చేర్చుకొని వైద్యం అందించాలని నిర్దేశించింది. ధ్రువీకరణ లేకున్నా లక్షణాలు కనిపించేవారిని కరోనా అనుమానిత కేసులుగా పరిగణించి రోగ తీవ్రతనుబట్టి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌, డెడికేటెడ్‌ కొవిడ్‌ హెల్త్‌ సెంటర్‌, డెడికేటెడ్‌ కొవిడ్‌ హాస్పిటళ్లలో చేర్చుకొని చికిత్స అందించాలని సూచించింది.

* ఏదో ఒక కారణం చెప్పి రోగికి వైద్యసేవలు నిరాకరించడానికి ఇకపై వీల్లేదు. వేరే నగరానికి చెందిన రోగి అయినా ఆక్సిజన్‌, అత్యవసర మందులు అందించాలి.

* రోగి స్థానిక గుర్తింపుకార్డు చూపించలేదన్న కారణంతో ఆసుపత్రిలో చేర్చుకోకుండా నిరాకరించడానికి వీల్లేదు.

* అవసరం ప్రాతిపదికన ఆసుపత్రిలో ప్రవేశం కల్పించాలి. మరోవైపు.. అవసరం లేనివారితో పడకలు నిండిపోకుండానూ చూసుకోవాలి. కొత్త డిశ్చార్జి పాలసీకి అనుగుణంగా రోగులను డిశ్చార్జి చేయాలి.

* ఈ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదార్శులు మూడు రోజుల్లోపు స్థానిక ఆసుపత్రులకు ఉత్తర్వులు జారీ చేయాలి.

* కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ (సీసీసీ)లలో తేలికపాటి లక్షణాలున్నవారికి వైద్యం అందించాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో ఈ కేంద్రాలను హాస్టళ్లు, హోటళ్లు, పాఠశాలలు, స్టేడియంలు, లాడ్జిల్లో ఏర్పాటు చేయొచ్చు. అత్యవసరమైతే, విధిలేని పరిస్థితుల్లో కొవిడ్‌ హెల్త్‌కేర్‌ సెంటర్లలోని నాన్‌ కొవిడ్‌ విభాగాలను కూడా కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మార్చుకోవాలి.

* డెడికేటెడ్‌ కొవిడ్‌ హెల్త్‌ సెంటర్‌ (డీసీహెచ్‌సీ)లలో మధ్యస్థాయి లక్షణాలున్న రోగులందరికీ వైద్యసేవలు అందించాలి. ఒక ఆసుపత్రిని పూర్తిగా కానీ, అందులో కొంత భాగాన్ని కానీ డీసీహెచ్‌సీగా ప్రకటించవచ్చు. వీటికి ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు వేర్వేరుగా ఉండాలి. ప్రైవేటు ఆసుపత్రులను కూడా కొవిడ్‌ డెడికేటెడ్‌ హెల్త్‌ సెంటర్లుగా మార్చొచ్చు. ఇందులోని పడకలకు తప్పనిసరిగా ఆక్సిజన్‌ అందించే సౌకర్యం ఉండాలి.

* డెడికేటెడ్‌ కొవిడ్‌ హాస్పిటల్స్‌ (డీసీహెచ్‌)లో వ్యాధిపరంగా తీవ్ర లక్షణాలున్నట్లు ప్రకటించిన రోగులకు సమగ్ర వైద్యం అందించవచ్చు. ఇందులో ఐసీయూ, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌తో కూడిన పడకలు ఉండాలి.

* పైన పేర్కొన్న క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొటోకాల్‌ ప్రకారం ఆసుపత్రులను వర్గీకరించి తేలికపాటి కేసులను కొవిడ్‌ కేర్‌ సెంటర్లు (సీసీసీ), మధ్యస్థాయి కేసులను డెడికేటెడ్‌ కొవిడ్‌ హెల్త్‌కేర్‌ సెంటర్లు (డీసీహెచ్‌సీ), తీవ్రస్థాయి కేసులనైతే డెడికేటెడ్‌ కొవిడ్‌ హాస్పిటళ్ల (డీసీహెచ్‌)లో చేర్చుకోవాలని కేంద్రం సూచనలు చేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు