నిర్లక్ష్యం.. సమన్వయలోపం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిర్లక్ష్యం.. సమన్వయలోపం

 పేలుడు పదార్థాల విషయంలో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
 ఆ లీజు తమ జాబితాలో లేదంటున్న గనుల భద్రతా విభాగం
 బ్లాస్టింగ్‌ అనుమతులున్నాయంటున్న పోలీస్‌ శాఖ
 కారులో పేలుడు పదార్థాలొచ్చినా తనిఖీ చేయని వైనం
ఈనాడు - అమరావతి

కడప జిల్లా కలసపాడు మండలంలోని ముగ్గురాయి గనుల వద్ద జరిగిన పేలుడు ఘటనపై వివిధ శాఖల అధికారులు ఒక్కో విధంగా చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది. ఆ లీజు తమ జాబితాలో లేదని గనుల భద్రతా విభాగం చెబుతుండగా, బ్లాస్టింగ్‌ అనుమతులున్నట్లు అక్కడి పోలీసులు పేర్కొంటున్నారు. అసలు ఎక్కడి నుంచి పేలుడు పదార్థాలు తీసుకొచ్చారు? ఎవరు సరఫరా చేశారనే విషయాలపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. గనుల్లో పేలుడు పదార్థాల వినియోగంపై ఎప్పటికప్పుడు రెవెన్యూ, పోలీస్‌శాఖ, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్‌ సేఫ్టీ (డీజీఎంఎస్‌) అధికారులు తనిఖీలు చేసి వివరాలు నమోదు చేయాలి. ఇవి సంఘవిద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా నిరంతర పరిశీలన ఉండాలి. మామిళ్లపల్లె గని వద్దకు పట్టపగలు, కారులో పేలుడు పదార్థాలు తీసుకొచ్చినా, ఎక్కడా తనిఖీలు చేయలేదని తెలుస్తోంది. ఆయా శాఖల మధ్య సమన్వయలోపం ఈ ప్రమాదానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిర్లక్ష్యంగా కారులో..
తాజా ఘటనలో పేలుళ్ల కోసం జిలెటిన్‌ స్టిక్స్‌, ఎలక్ట్రిక్‌ డిటోనేటర్ల(ఈడీ)ను నిర్లక్ష్యంగా కారులో తీసుకొచ్చారు. వాస్తవానికి వీటి రవాణాకు ప్రత్యేకంగా మ్యాగ్జైన్‌ వ్యాన్‌ ఉంటుంది. అందులో జిలెటిన్‌ స్టిక్స్‌, ఈడీలను వేర్వేరుగా ఉంచే వీలుంటుంది. చల్లÆట¨ ఉష్ణోగ్రతల మధ్య తరలించాలి. దీనివల్ల ప్రమాదాలు జరగవు. వీటి లోడింగ్‌, అన్‌లోడింగ్‌ సమయంలో, వినియోగించేటపుడు అనుభవం ఉన్న మైన్స్‌ మేనేజర్‌ లేదా షార్ట్‌ ఫైరర్‌ లైసెన్స్‌ ఉన్నవారు పర్యవేక్షించాలి. అక్కడ ఎవరూ పొగతాగకుండా చూడాలి. ఇనుప రాడ్లు వంటివి లేకుండా జాగ్రత్తలు పాటించాలి. ప్రమాదాలకు ఆస్కారం ఉండే ఫోన్లు వినియోగించకుండా చూడాలి. శనివారం ప్రమాదం జరిగినచోట ఇటువంటి నిబంధనలేమీ పాటించలేదు. కొందరు కూలీలే వీటిని దించుతుండగా ప్రమాదం జరిగింది.
పులివెందుల నియోజకవర్గం నుంచి..?
ఏదైనా గనుల్లో పేలుళ్ల కోసం చీఫ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ నుంచి అనుమతి తీసుకోవాలి. ఇందుకు పోలీస్‌, రెవెన్యూ, అగ్నిమాపకశాఖలు నిరభ్యంతర పత్రాలివ్వాలి. ఈ లైసెన్స్‌ ఆధారంగా ఏయే గనుల్లో పేలుళ్లు జరుపుతున్నారనేది డీజీఎంఎస్‌ పర్యవేక్షిస్తుంది. ఇదంతా పెద్ద ప్రక్రియ కావడంతో అతి కొద్దిమందే ఈ లైసెన్స్‌ కలిగి ఉంటారు. వీరితో లీజుదారులు ఒప్పందం చేసుకొని తమ గనిలో పేలుళ్లు జరపాల్సివచ్చినపుడు పేలుడు పదార్థాలు తెప్పించుకుంటారు. ఇదంతా లైసెన్స్‌దారుడు పర్యవేక్షించాలి. వీటి రవాణా కూడా అతనే చూడాలి. కడప జిల్లాలో జరిగిన ఘటన విషయంలో.. ఆ లీజుకు పేలుళ్ల అనుమతులు లేవని, తమ జాబితాలో ఆ లీజు లేదని డీజీఎంఎస్‌ డీడీ యోహన్‌ తెలిపారు. మరోవైపు కడప జిల్లాలో పులివెందులకు చెందిన ఓ వ్యక్తి పేరిట మాత్రమే ఎక్స్‌ప్లోజివ్‌ లైసెన్స్‌ ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ లీజుకు అతని నుంచి పేలుడు పదార్థాలు వెళ్లాయా? వేరొక చోటి నుంచి లీజుదారుడు సమకూర్చుకున్నాడా? అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు, గనులశాఖ అధికారులు మాత్రం పులివెందుల నియోజకవర్గ పరిధిలో వేముల మండలం నుంచి ఈ పేలుడు పదార్థాలు వచ్చినట్లు చెబుతున్నారు. ఘటనలో మృతిచెందిన వారిలో కూడా ఎక్కువ మంది ఇదే నియోజకవర్గం వారున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని