వైరస్‌పై అస్త్రాల్లేని యుద్ధమా!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైరస్‌పై అస్త్రాల్లేని యుద్ధమా!

  టీకాలకు కేటాయించిన బడ్జెట్‌ రూ.35వేల కోట్లు
  ఇప్పటి వరకూ ఇచ్చింది రూ. 4,744 కోట్లే..

దిల్లీ: దేశ ప్రజలపై కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ... వైరస్‌పై యుద్ధాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తగిన అస్త్రాలను మాత్రం సంధించలేకపోతోంది. కరోనా ముప్పును గుర్తించి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించినా, వాటి విడుదల మాత్రం అవసరాలకు తగినట్లుగా లేవన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘2021-22 బడ్జెట్‌లో కరోనా టీకాల కోసం రూ.35 వేల కోట్లు కేటాయించాను. అవసరమైతే ఇంకా ఇవ్వడానికి సిద్ధమే. ఆరోగ్య శాఖ బడ్జెట్‌ను రూ.94,452 కోట్ల నుంచి రూ.2,23,846 కోట్లకు పెంచాం. అంటే ఏకంగా 137% మేర పెంచాం’’ అని బడ్జెట్‌ ప్రసంగం రోజున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కేటాయింపులు ఘనంగా ఉన్నా వాటి వినియోగం అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా లేదని స్పష్టమవుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ ఇటీవల చేసిన ట్వీట్‌ ప్రకారం కేంద్రం టీకా కార్యక్రమం కోసం ఇప్పటివరకూ ఖర్చు చేసిన మొత్తం రూ. 4,744.45 కోట్లు. ఇందులో కొవిషీల్డ్‌ ఉత్పత్తి చేసే సీరమ్‌ సంస్థకు రూ.3,639.67 కోట్లు, కొవాగ్జిన్‌ తయారు చేసే భారత్‌ బయోటెక్‌కు రూ.1,104.78 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. సీరమ్‌కు చెల్లించిన నిధుల్లో రూ.1732.50 కోట్లు మే, జూన్‌, జులై నెలల్లో సరఫరా చేయాల్సిన 11 కోట్ల డోసుల కోసం అడ్వాన్సు. మరో రూ.1,907.17 కోట్లు... ఇంకో 15 కోట్ల డోసుల కోసం అడ్వాన్సు. మొత్తం 26కోట్ల డోసుల టీకాకు గాను సీరమ్‌ సంస్థ ఇప్పటి వరకూ 14.344 కోట్ల డోసుల టీకాను సరఫరా చేసినట్లు అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు.   భారత్‌ బయోటెక్‌కు కేంద్రం ఇప్పటి వరకూ 8 కోట్ల టీకా డోసుల కోసం రూ.1104.78 కోట్లు చెల్లించింది. ఈ మొత్తంలోనే మే, జూన్‌, జులై నెలల్లో సరఫరా చేయాల్సిన 5 కోట్ల టీకా డోసులకు చెందిన రూ.787.5 కోట్ల అడ్వాన్సు కూడా కలిసి ఉంది.  టీకాల కోసం కేంద్రం చెల్లించిన మొత్తంలో గత ఆర్థిక సంవత్సరపు నిధులెన్ని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌కు చెందిన నిధులెన్ని అన్న విషయాన్ని స్పష్టం చేయలేదు.

విపక్షాల విమర్శలతో...
దేశంలోని టీకాల ఉత్పత్తిదారులకు ప్రభుత్వం ఆర్డర్లు ఆలస్యంగా ఇచ్చిందని, విదేశీ టీకాలకు అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేసిందని విపక్షాలు మండిపడ్డాయి. దీంతో ఇటీవల ప్రభుత్వం ఓ ప్రకటన చేస్తూ సీరమ్‌ సంస్థ (11 కోట్ల డోసులు), భారత్‌ బయోటెక్‌ సంస్థ(5 కోట్ల డోసులు)లకు కలిపి ఏప్రిల్‌ 28న రూ.2,520 కోట్ల మేర ముందస్తు చెల్లించినట్లు తెలిపింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో టీకాలకు కేటాయించిన రూ.35వేల కోట్లలో ఈ మొత్తం 7.2శాతం మాత్రమే. అనురాగ్‌ ఠాకుర్‌ తెలిపినట్లుగా రూ.4,744 కోట్ల చెల్లింపులను పరిగణనలోకి తీసుకున్నా ప్రస్తుత బడ్జెట్‌లో ఆ మొత్తం 14శాతం కన్నా తక్కువే. మే 6 నాటి లెక్కల ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం 17.15 కోట్ల డోసులు ఉచితంగా ఇచ్చింది. 16.24 కోట్ల మందికి టీకాలు అందాయి. ఇందులో 3.14 కోట్ల మంది రెండు డోసులు, 13.09 కోట్ల మంది ఒక్క డోసు పొందగలిగారు.
ఇచ్చిన ఆర్డర్లు ఎంత?
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చెప్పిన వివరాల ప్రకారం మే, జూన్‌, జులై నెలల కోసం 11 కోట్ల కొవిషీల్డ్‌ డోసులు, 5 కోట్ల కొవాగ్జిన్‌ డోసుల కోసం ఆర్డర్లు ఇచ్చారు. ఈ మూడు నెలల కోసం 16 కోట్ల డోసుల కోసం ఆర్డర్లు ఇవ్వగా, ప్రస్తుతం అవసరాల దృష్ట్యా అవి ఏమాత్రం సరిపోవు. నిధుల కొరత లేనందున ఆర్డర్లు పెంచడం, దానికి అనుగుణంగా కంపెనీల్లో అదనపు వసతుల కోసం అడ్వాన్సులు ఇవ్వాల్సి ఉండగా దానిపై తగినంత శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు