అత్యవసర ప్రయాణానికి ఈ-పాస్‌
close

ప్రధానాంశాలు

అత్యవసర ప్రయాణానికి ఈ-పాస్‌

కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయంలో అత్యవసరమై ప్రయాణించే వారి కోసం ఈ-పాస్‌ విధానాన్ని సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. అలాంటివారు ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్ల నుంచి తగిన అనుమతి పొందాలని సూచించారు. ఏ అవసరంపై వెళ్తున్నారో అందుకు సంబంధించిన పత్రాలు చూపాలన్నారు. విజయవాడలోని పోలీసు కంట్రోల్‌రూమ్‌ వద్ద ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతరం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘ఎవరైనా సరే అత్యవసర పరిస్థితుల్లోనే ఇంటినుంచి బయటకు రండి. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల మధ్య బయటకు వచ్చేటప్పుడు కూడా భౌతిక దూరం పాటించాలి. డబుల్‌మాస్క్‌ ధరించాలి. రాజకీయ పార్టీలకు సంబంధించి ఎలాంటి సభలు, సమావేశాలకూ అనుమతి లేదు. శుభకార్యాలు నిర్వహించేవారు స్థానిక అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలి. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారి సమాచారాన్ని ఎవరైనా సరే 100, 112కు తెలియజేయవచ్చు. గృహ ఏకాంతంలో ఉన్న కరోనా రోగులు 104, 1902 నంబర్లకు ఫోన్‌ చేసి సేవలు వినియోగించుకోవచ్చు. అవసరం లేకపోయినా రోడ్లపై తిరుగుతున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు తప్పుడు సమాచారం, వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. అలాంటి సందేశాలు ఏవైనా వస్తే వాటి వాస్తవికత నిర్ధారించుకోకుండా ఫార్వర్డ్‌ చేయొద్దు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారు తగిన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని డీజీపీ పేర్కొన్నారు.

- ఈనాడు, అమరావతి


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని