సరిహద్దుల్లో కొనసాగిన ఆంక్షలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సరిహద్దుల్లో కొనసాగిన ఆంక్షలు

ఏపీ అంబులెన్సులను ఆపిన తెలంగాణ పోలీసులు  
 రాత్రి నుంచి అనుమతులు యథాతథం

ఈనాడు-అమరావతి, జగ్గయ్యపేట, కర్నూలు నేరవిభాగం- న్యూస్‌టుడే: కొవిడ్‌ వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు అంబులెన్సుల్లో వెళ్తున్న బాధితులను తెలంగాణ సరిహద్దుల్లో మంగళవారం రాత్రి వరకూ కూడా నిలిపేశారు. వారికి పడకలు కేటాయిస్తామంటూ సంబంధిత ఆసుపత్రి ల్యాండ్‌లైన్‌ నంబర్‌ నుంచి తనిఖీ కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీసులకు ఫోన్‌ చేయించిన వారిని మాత్రమే అనుమతించారు. అలా ఫోన్‌ చేయించేందుకు రోగుల కుటుంబసభ్యులు ఇబ్బందులు పడ్డారు. అంబులెన్సులను రోడ్డు పక్కన ఆపి ఆసుపత్రుల నుంచి ఫోన్‌కాల్స్‌ వచ్చేంతవరకూ నిరీక్షించారు. కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌పోస్టు దాటిన తర్వాత రామాపురం వద్ద పలు అంబులెన్సులు నిలిచిపోయాయి. విజయవాడలోని సత్యనారాయణపురం, పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలానికి చెందిన ఇద్దరు రోగులు వేర్వేరుగా వారి కుటుంబ సభ్యులతో కలిసి అంబులెన్సుల్లో వెళ్తుండగా నిలిపేశారు. హైదరాబాద్‌లోని ఆయా ఆసుపత్రుల నుంచి ఫోన్‌ చేయించిన తర్వాతే అనుమతించారు. ‘అత్యవసర పరిస్థితిలోనే రోగిని హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నాం. అనుమతుల పేరిట మమ్మల్ని నిలిపేసి ఆలస్యం చేస్తున్నారు. అంబులెన్సులో ఆక్సిజన్‌ పరిమితంగానే ఉంది. ఆస్పత్రికి చేరేదాకైనా సరిపోతుందా? లేదా? అని భయంగా ఉంద’ంటూ ఓ బాధితుడు వాపోయారు. ఏపీ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న అంబులెన్సులను తెలంగాణ పోలీసులు రానివ్వడం లేదన్న సమాచారం వ్యాపించడంతో ముందస్తు అనుమతులు ఉన్నవారు మాత్రమే ఆ మార్గాల్లో వెళ్లారు. వారికీ అడ్డంకులు తప్పలేదు. రోగి పేరు, వివరాలు, వాహనం నంబర్‌ తదితరాలు నమోదు చేసుకున్నాకే పంపించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా రాకపోకలు షురూ
ఏపీ నుంచి తెలంగాణలోకి అంబులెన్సుల ప్రవేశంపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు తొలగించడంతో మంగళవారం రాత్రి 7.30 గంటల తర్వాత పలు మార్గాల్లో రాకపోకలు మొదలయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిలో వాడపల్లి చెక్‌పోస్ట్‌, కోదాడ-జగ్గయ్యపేట మార్గంలోని రామాపురం క్రాస్‌రోడ్డు, నాగార్జునసాగర్‌-మాచర్ల రహదారి చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు అంబులెన్స్‌ల్లోని పత్రాలను పరిశీలించి పంపించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని