తెలంగాణలో లాక్‌డౌన్‌
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో లాక్‌డౌన్‌

నేటి నుంచి పదిరోజులపాటు నిషేధాజ్ఞలు
ఉదయం 6 - 10 గంటల మధ్య సడలింపు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా తీవ్రత నేపథ్యంలో బుధవారం నుంచి లాక్‌డౌన్‌ విధించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. పదిరోజుల పాటు ఇది అమల్లో ఉంటుంది. రోజూ ఉదయం 10 గంటల నుంచి 20 గంటల పాటు దీనిని కఠినంగా అమలు చేయాలని నిర్దేశించింది. జనసంచారం, క్రయవిక్రయాలు, ఇతర కార్యకలాపాలకు నిషేధాజ్ఞలు వర్తిస్తాయని తెలిపింది. ప్రజల సౌకర్యార్థం రోజూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యావసర వస్తువులు, ఇతర కొనుగోళ్లకు, కార్యకలాపాలకు వీలు కల్పించింది. అత్యవసర సేవలు, ధాన్యం ఇతర వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, మరికొన్ని రంగాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపులు ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు 33 శాతం సిబ్బందితో యథావిధిగా పనిచేస్తాయి. ఉపాధిహామీ పనులూ యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది. బ్యాంకులు, ఏటీఎంలు పనిచేస్తాయని తెలిపింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మెట్రో, ఆర్టీసీ వంటి ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు రేషన్‌ దుకాణాలు తెరిచే ఉంటాయి. వంట గ్యాస్‌ సరఫరా కొనసాగుతుంది. మినహాయించినవి కాకుండా మిగిలిన వాటి విషయంలో పూర్తిస్థాయిలో నిబంధనలు కఠినంగా పాటించేలా చూడాలని సీఎస్‌ను, డీజీపీని మంత్రిమండలి ఆదేశించింది. యుద్ధ ప్రాతిపదికన టీకాలను సేకరించాలని తీర్మానించింది. ప్రభుత్వ రంగంతోపాటు, ప్రైవేట్‌ రంగంలో కూడా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్‌, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు అంతర రాష్ట్ర బస్సు సర్వీసులను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగులు, కార్మికులందరికీ పూర్తి వేతనాలు చెల్లించాలని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 20న మరోసారి కేబినెట్‌ సమావేశమై లాక్‌డౌన్‌ కొనసాగింపు విషయమై సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందని సీఎం తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని