అంబులెన్సులను అడ్డుకోవద్దు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంబులెన్సులను అడ్డుకోవద్దు

ఉత్తర్వులు లేకుండా అంతర్రాష్ట్ర రాకపోకలను ఎలా అడ్డుకుంటారు?
తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసిన ఆ రాష్ట్ర హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: పొరుగు రాష్ట్రాల నుంచి వైద్యసేవల నిమిత్తం కొవిడ్‌ రోగులతో వచ్చే అంబులెన్స్‌లను అడ్డుకోరాదని తెలంగాణ పోలీసులను ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి ఉత్తర్వులు...మార్గదర్శకాలు లేకుండా రాకపోకలను అడ్డుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ‘అత్యవసర వైద్యం కోసం పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న అంబులెన్స్‌లను అడ్డుకోవడం అమానవీయం. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అంతర్రాష్ట్ర ప్రవేశాలపై ఎలాంటి నిషేధం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులుకానీ... సలహాగానీ ప్రకటించకుండా ఏకపక్షంగా సరిహద్దులను మూసివేయడం రాజ్యాంగ ఉల్లంఘనే. ఎలాంటి నిషేధం లేనప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సంచరించే హక్కు పౌరులకు ఉంది’ అని మంగళవారం ఉదయం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఒక కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ‘‘పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ తీవ్రత నేపథ్యంలో గత నెల 23న సరిహద్దులు మూసేయాలని మేం చెప్పలేదు. నియంత్రణపై దృష్టి సారించాలని చెబితే కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాకపోకలను నిషేధించలేమని, అవసరంలేదని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడేమో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అంబులెన్సులను ఆపేస్తున్నారు.  అనాలోచితంగా రాకపోకలను అడ్డుకుంటారా’’ అని ధర్మాసనం ప్రశ్నించింది.
ఆర్‌ఎంపీలు తీసుకొచ్చి గాలికొదిలేస్తున్నారు: ఏజీ
పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారి వల్ల ఇక్కడి ప్రజలకు సరైన వసతులు కల్పించలేకపోతున్నామని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ తెలిపారు. బెడ్‌లు ఖాళీ లేకపోయినా ఆ రాష్ట్రాల ఆర్‌ఎంపీలు రోగులను ఇక్కడికి తీసుకొచ్చి వారిని గాలికి వదిలేస్తున్నారని వివరించారు. సరిహద్దులో డాక్టర్ల బృందం ఉందని, అంబులెన్సులో ఉన్న రోగి పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. నివాసం ఆధారంగా వైద్యాన్ని నిరాకరించడానికి వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని