Ruia: నాలుగున్నర గంటల ఆలస్యం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ruia: నాలుగున్నర గంటల ఆలస్యం

 ఆక్సిజన్‌ ట్యాంకర్‌ రాకనే 11 మంది మృత్యువాత
 రుయాలో ముందస్తు చర్యలు చేపట్టని అధికారులు
 తమిళనాట ఆంక్షలూ కారణమేనా!

ఈనాడు, తిరుపతి: ప్రాణవాయువు సరఫరాలో జరిగిన ఆలస్యం 11 మంది ఆయువు తీసింది. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో సోమవారం రాత్రి ఆక్సిజన్‌ సరఫరా తగ్గడంతో బాధితులు మృత్యువాతపడినట్లు అధికారులు చెబుతున్నారు. ఆక్సిజన్‌ నిల్వలు తగ్గుతున్నాయని ముందుగానే గుర్తించినా.. తమిళనాడు నుంచి ట్యాంకర్‌ సకాలంలో రాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలిపారు. అనుకున్న సమయం కన్నా సుమారు నాలుగున్నర గంటలు ఆలస్యంగా ట్యాంకర్‌ వచ్చినట్లు చెబుతున్నారు. ఆక్సిజన్‌ ట్యాంకర్‌ వద్ద ఉన్న సెన్సార్లు పనిచేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనితో పాటు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. తమిళనాడు నుంచి వచ్చే ఆక్సిజన్‌పై ఆంక్షలు విధిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. కారణాలు ఏమైనా 11 మంది విగతజీవులుగా మారడం అందరినీ కలచివేసింది.
రుయా అధికారులు శ్రీపెరంబదూరులోని లిండే సంస్థతో మూడేళ్ల ఒప్పందం చేసుకున్నారు. రుయాలోని మూడు ఆక్సిజన్‌ ప్లాంట్ల వద్ద సెన్సార్లు ఉన్నాయి. ట్యాంకులోని ఆక్సిజన్‌ స్థాయి 2/3 లేదా 50 శాతం తగ్గిన వెంటనే సెన్సార్ల ద్వారా సమాచారం ఆ సంస్థకు చేరుతుంది. వెంటనే ట్యాంకర్లలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ను నింపుకొని ఇక్కడికి తీసుకొస్తుంటారు. వాస్తవానికి సోమవారం ఉదయం 11 గంటలకు శ్రీపెరంబదూరులో ఆక్సిజన్‌ ట్యాంకర్‌ బయల్దేరి సాయంత్రం 4 గంటలకు రుయాకు చేరుకోవాలి. కానీ సాయంత్రం 4.15 గంటల సమయంలో ట్యాంకర్‌ బయల్దేరినట్లు చెబుతున్నారు. రుయాకు సుమారు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో చేరుకుంది. అంటే నాలుగున్నర గంటలు ఆలస్యంగా ట్యాంకర్‌ రుయాకు చేరుకుంది. సెన్సారు సక్రమంగా పనిచేయని కారణంగా ఆలస్యమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు అక్కడి ప్రభుత్వం ఆక్సిజన్‌ సరఫరాలో ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రెజర్‌ తగ్గడంతో..
ట్యాంకర్‌ రావడం ఆలస్యం కావడంతో రుయా అధికారులు సిలిండర్లలోని ఆక్సిజన్‌ను అందించే ప్రయత్నం చేశారు. సుమారు 20 సిలిండర్ల ద్వారా ఆక్సిజన్‌ను సరఫరా చేశారు. సిలిండర్ల ద్వారా సరఫరా చేసే వాయువు అంతవేగంగా వెళ్లే పరిస్థితి ఉండదు. ప్రెజర్‌ తగ్గడంతో కింద అంతస్తులో చికిత్స పొందుతున్న బాధితులకు మాత్రం గ్రావిటీ ద్వారా వాయువు రావడంతో కొంత ఉపశమనం కలిగింది. పై అంతస్తులో ఉన్న బాధితులకు నెమ్మదిగా వెళ్లడంతో పాటు ప్రెజర్‌ తక్కువగా ఉండటం వల్ల ప్రాణనష్టం వాటిల్లినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం..
ప్రతి ఆసుపత్రిలోనూ ఇద్దరిని పర్యవేక్షణాధికారులుగా నియమించారు. వీరు ఆసుపత్రిలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాల్సి ఉంది. ఆక్సిజన్‌ తగ్గిపోతున్న సమయంలో యుద్ధప్రాతిపదికన తెప్పించేందుకు ప్రయత్నించాలి. కానీ ఆఖరి నిమిషం వరకు వేచిచూసిన ధోరణి అవలంబించారని బాధితులు వాపోతున్నారు.
అర్ధరాత్రి మృతదేహాల తరలింపు....
మృతదేహాలను సోమవారం అర్ధరాత్రి కొవిడ్‌ కేంద్రం నుంచి తరలించారు. ఇంటికి తీసుకువెళ్లి దహన సంస్కారాలు నిర్వహించుకుంటామని అడిగిన వ్యక్తులకు మృతదేహాలను అప్పగించారు. తాము తీసుకెళ్లలేమని చెప్పిన వారి మృతదేహాలను మార్చురీకి తరలించారు. మొత్తంగా తెల్లవారుజామున 2.30 గంటలకల్లా ప్రక్రియను ముగించారు.
అందుబాటులోకి మరో ట్యాంకర్‌
రుయా దుర్ఘటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సోమవారం రాత్రి ఒక ఆక్సిజన్‌ ట్యాంకర్‌ రాగా మంగళవారం మరొకటి చేరుకుంది. దీన్ని ట్యాంకులోకి నింపారు. ఘటనపై కొవిడ్‌-19 ప్రత్యేక అధికారి రామ్‌గోపాల్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జరిగిన ఘటన గురించి అధికారులు ఆయనకు వివరించారు. మరోవైపు ఆక్సిజన్‌ అవసరాలు, సరఫరా, వినియోగం వంటి అంశాలపై చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌ వీరబ్రహ్మం అధికారులతో సమీక్షించారు. ఇందుకోసం ప్రత్యేక వార్‌రూంను ఏర్పాటు చేసి.. పర్యవేక్షించేందుకు అధికారులను నియమించారు. చిత్తూరు జిల్లా పరిధిలో మూడు సంస్థలు పరిశ్రమలకు ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నాయి. దీన్ని కూడా ఆసుపత్రులకు తరలించనున్నారు. అధికారులు అన్నివేళలా అందుబాటులో ఉండి ఆసుపత్రికి ఆక్సిజన్‌ సరఫరాపై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఆర్డీవో స్పష్టం చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని