చేతుల్లోలేని అంశాలకూ బాధ్యత వహిస్తున్నాం: Jagan
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చేతుల్లోలేని అంశాలకూ బాధ్యత వహిస్తున్నాం: Jagan

రుయా ఆసుపత్రిలో ఘటన తీవ్రంగా కలచివేసింది
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం
అన్నీ తెలిసి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు: సీఎం జగన్‌

ఈనాడు-అమరావతి: ‘ఎంత బాగా కష్టపడుతున్నా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మన చేతుల్లో లేని అంశాలకు కూడా బాధ్యత వహించాల్సి వస్తోంది. సోమవారం రాత్రి తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటన కూడా అలాంటిదే. తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ సరైన సమయానికి రాకపోవడంతో ఆక్సిజన్‌ కొరత ఏర్పడి 11 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. ఆక్సిజన్‌ కోసం సోమవారం కూడా ఒడిశాకు ఆరు ట్యాంకర్లను విమానంలో పంపాం. రవాణా సమయాన్ని ఆదా చేయడానికి ఎయిర్‌ లిఫ్ట్‌ చేశాం. అక్కడ ఆక్సిజన్‌ నింపి రోడ్డు మార్గంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. విదేశాల్లో కూడా ఆక్సిజన్‌ కొనుగోలు చేసి నౌకల్లో తెప్పిస్తున్నాం. ఇంతగా ప్రయత్నిస్తున్నా కూడా మన చేతుల్లో లేని కొన్ని అంశాల వల్ల నష్టాలు జరుగుతున్నాయి. రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటన తీవ్రంగా కలచి చేసింది’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘స్పందన‘ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లతో మంగళవారం నిర్వహించిన వీడియో సమావేశంలో సీఎం మాట్లాడారు. ‘మన తప్పు కాకపోయినా, పక్క రాష్ట్రం నుంచి రావాల్సిన ట్యాంకర్‌ సకాలంలో రాకపోయినా సరే బాధ్యత తీసుకుని రుయా ఘటనలో మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని చిత్తూరు కలెక్టర్‌ను ఆదేశించాను. మృతుల కుటుంబాల దగ్గరకు వెళ్లి పరిహారం అందించి వారికి బాసటగా నిలవాలని కోరాను. ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా భవిష్యత్తులో ఎం చేయగలుగుతాం అనే దానిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. మన ప్రభుత్వంలో తప్పును ఒప్పుకోవడం అన్నది చిన్నతనం కాదు. కొవిడ్‌ పరీక్షల్లో, రోగులకు వైద్యం అందించడంలో ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామో దేశం మొత్తానికి చూపిస్తున్నాం’ అని కలెక్టర్లను ఉద్దేశించి జగన్‌ అన్నారు.

వ్యాక్సిన్ల పరిస్థితి ఏమిటో దేశంలో ప్రతి ఒక్కరికీ తెలుసు
వ్యాక్సిన్ల పరిస్థితి ఏమిటో రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 7 కోట్ల డోసులన్న విషయం ప్రతిపక్ష నాయకులకూ తెలిసినా దుష్ప్రచారం చేస్తున్నారు. దేశం మొత్తానికి ఇప్పటివరకూ ఇచ్చిన డోసులు కేవలం 17 కోట్లు మాత్రమే. దేశ ప్రజలకు రెండు డోసులు చొప్పున 172 కోట్లు అవసరం. ఇప్పటివరకూ 10 శాతం లోపే ఇవ్వగలిగాం’ అని సీఎం అన్నారు. ‘రాష్ట్రం విషయానికొస్తే 45ఏళ్ల పైబడ్డవారు, వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు కలిపి రాష్ట్రంలో 1.48 కోట్ల మంది ఉన్నారు. వీరికి 2 డోసులు చొప్పున దాదాపుగా 3 కోట్ల డోసులు ఇవ్వాలి. 18 నుంచి 45 ఏళ్ల లోపు ఉన్న 2 కోట్ల మందికి దాదాపు 4 కోట్ల డోసులు కావాలి. అంటే మొత్తం దాదాపు 7 కోట్ల డోసులు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకూ కేవలం 73 లక్షల డోసులు కేంద్రం నుంచి మనకు అందాయి’ అని ముఖ్యమంత్రి వివరించారు.
కొంటామన్నా టీకాలు ఇవ్వడం లేదు
‘వ్యాక్సిన్‌ కంపెనీలు కూడా మనం డబ్బులు ఇస్తామని చెప్పినా టీకాలు సరఫరా చేయడం లేదు. ఎందుకంటే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో నడుస్తున్నాయని కేంద్రమే స్పష్టం చేసింది. రాష్ట్రాలు ఎంత కొనుగోలు చేయాలంటే అంత వ్యాక్సిన్లు ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో పేర్కొంది’ అని జగన్‌ అన్నారు.  ‘ఇలాంటి పరిస్థితి ఉందని తెలిసి కూడా ప్రతిపక్ష నాయకుడు, మీడియా చేస్తున్న ప్రచారాలు చూస్తే బాధ అనిపిస్తోంది. వ్యాక్సిన్లకు రూ.1,600 కోట్లు ఖర్చు చేయడానికి మనసు రావడంలేదని, కమీషన్ల కోసం ఇలా చేస్తున్నారంటూ చాలా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు’ అని సీఎం వ్యాఖ్యానించారు.‘ఈ 23 నెలల్లోనే రూ.87 వేల కోట్లు పేదల బ్యాంకు ఖాతాల్లో జమచేశాం. ఇలాంటి ప్రభుత్వం వ్యాక్సిన్ల కోసం రూ.1,600 కోట్లు ఖర్చు చేయడానికి వెనకాడుతుందా? అయినా విమర్శలు చేస్తున్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో కూడా ఆక్సిజన్‌ సరఫరా అవసరమైనంత మేరకు ఏర్పాటు చేయాలి. వైద్య ఆరోగ్యశాఖ ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్ల కొనుగోలుపై దృష్టి పెట్టినందున త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పైపులైన్లను పర్యవేక్షించాలి. సాంకేతిక సిబ్బందిని కచ్చితంగా నియమించి నిర్దేశిత ప్రమాణాల ప్రకారం సరైన ఒత్తిడితో ఆక్సిజన్‌ వెళ్లేలా చేయాలి. ఐసీయూల్లో కూడా ప్రెషర్‌ బూస్టర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి’ అని జగన్‌ ఆదేశించారు. ‘కర్ణాటక, తమిళనాడు, ఒడిశా నుంచి మనకు ఆక్సిజన్‌ వస్తున్న మూడు రాష్ట్రాలకు ముగ్గురు అధికారులను పంపిస్తున్నాం. ఆక్సిజన్‌ సరఫరా పెంచడంపై వీరు దృష్టి పెడతారు. జిల్లాల్లోనూ ఆక్సిజన్‌ వార్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలి. అత్యవసర సమాచారం రాగానే వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే నౌకాదళ బృందాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వెళుతున్నాయి. వారు ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. వాటి సేవలను బాగా వినియోగించుకోండి’ అని కలెక్టర్లకు సీఎం సూచించారు.

‘కొవాగ్జిన్‌’ సాంకేతికతను బదిలీ చేయాలి
పేటెంట్‌, మేధో హక్కులు అడ్డంకి కాబోవు
భారత్‌ బయోటెక్‌కు సూచించండి
ప్రధాని మోదీకి సీఎం జగన్‌

‘దేశ అవసరాలకు అనుగుణంగా కొవాగ్జిన్‌ ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా ఆ సాంకేతికతను దేశంలో వ్యాక్సిన్‌ తయారీకి సిద్ధంగా ఉన్న ఫార్మా కంపెనీలకు బదిలీ చేసేలా భారత్‌ బయోటెక్‌కు సూచించాలి. కొవాగ్జిన్‌ ఉత్పత్తి చేసేందుకు ఇతర ఫార్మా సంస్థలకు ఉన్న అవకాశాలపై దృష్టి సారించాలి. ఆ సాంకేతికతను, అందుకు ఉపయోగపడే మేధోపరమైన హక్కులను బదలాయించేలా చూడాలి’’ అని ప్రధానమంత్రి మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మంగళవారం లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని మీడియాకు విడుదల చేశారు.  ‘మీ నాయకత్వంలో స్వదేశీ వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌ను భారత్‌ బయోటిక్‌ తయారు చేసింది. ఇందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవి) సహకరించాయి. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ను భారత బయోటెక్‌ (బయోసేఫ్టీ లెవెల్‌ 3) తయారు చేస్తోంది. 2021 జనవరిలో సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ అత్యవసర వినియోగానికి అనుమతులూ ఇచ్చింది. ఈ టీకా ఉత్పాదక సామర్థ్యం ప్రస్తుత దేశ అవసరాలను తీర్చలేదని తెలిసింది. ఇదే వేగంతో ఉత్పత్తి చేస్తే టీకాలు వేయడానికి చాలా కాలం పడుతుంది. అందుకే కొవాగ్జిన్‌ ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా ఆసక్తి ఉన్న వారికి ఆ సాంకేతికతను బదిలీ చేయాలి. ఇందుకు మేధో ఆస్తి హక్కులు(ఐపీఆర్‌), పేటెంట్లు వంటివి అడ్డంకి కాబోవు’ అని జగన్‌ తన లేఖలో పేర్కొన్నారు. ‘విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ఆసక్తి చూపే కంపెనీలను, సామర్థ్యం ఉన్న సంస్థలను ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తికి ప్రోత్సహించాలి. ఈ విషయంలో మీ జోక్యాన్ని కోరుకుంటున్నాను. ఈ చర్య వ్యాక్సిన్ల సరఫరాను వేగవంతం చేస్తుంది’ అని సీఎం ఆ లేఖలో పేర్కొన్నారు.
‘ఏపీలో ప్రస్తుతం 1,86,695 క్రియాశీల కేసులు ఉన్నాయి. కరోనా నివారణకు అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నాం. చికిత్సకు ఏర్పాట్లు చేశాం.  ఎన్ని చర్యలు తీసుకున్నా అంతిమ పరిష్కారం టీకా వేయడమే. గతంలో మేం రోజుకు 6 లక్షల టీకాలు వేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించాం. టీకాల కొరత వల్ల జనాభాకు తగ్గట్టుగా వాటిని వేయలేకపోతున్నాం’ అని ముఖ్యమంత్రి ప్రధానికి లేఖలో వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని