AP: 300 టన్నుల Oxygen ప్లాంటు
close

ప్రధానాంశాలు

AP: 300 టన్నుల Oxygen ప్లాంటు

 కడప లేదా కృష్ణపట్నంలో యుద్ధప్రాతిపదికన ఏర్పాటు
 అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలు

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రంలో 300 టన్నుల సామర్థ్యంతో కొత్తగా ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులోనూ మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత రాకుండా దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. కృష్ణపట్నం, కడప ప్రతిపాదిత స్టీల్‌ప్లాంట్ల అవసరాలు తీర్చడంతో పాటు రోగులకు ఉపయోగపడేలా ఈ ఆక్సిజన్‌ ప్లాంటు నిర్మించేందుకు యోచించాలి. కడప లేదా, కృష్ణపట్నంలో దీన్ని యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలి’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ పరిస్థితులపై క్యాంపు కార్యాలయంలో ఆయన గురువారం సమీక్షించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పడకలకు అనుగుణంగా సరైన ఒత్తిడితో ప్రాణవాయువు సరఫరా చేసేలా చూడాలని ఆదేశించారు. నౌకాదళ, ఇతర సాంకేతిక సిబ్బంది సహకారం తీసుకోవాలని, అవసరమైన పరికరాలను సమకూర్చుకోవాలని నిర్దేశించారు. 125 కిలోలీటర్ల మెగా స్టోరేజీ ట్యాంకు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పగా ప్రతిపాదిత ఆక్సిజన్‌ ప్లాంటు వద్ద దీన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కొవిడ్‌  వ్యాక్సిన్‌ కోసం గ్లోబల్‌ టెండర్లు పిలిచామని, సరఫరాదారులు మూడు వారాల్లోగా బిడ్లు దాఖలు చేయాలని సూచించామని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వివరించారు.
అధికారులు ఏమన్నారంటే..
‘రాష్ట్రంలో ప్రస్తుతం ఆక్సిజన్‌ వినియోగం రోజుకు 600 మెట్రిక్‌ టన్నులకు పెరిగింది. కేటాయింపులు 590 టన్నులే ఉన్నాయి. ప్రత్యామ్నాయ విధానాలతో లోటును అధిగమిస్తున్నాం. 8 క్రయోజనిక్‌ స్టోరేజీ ట్యాంకులను జిల్లాలకు పంపాం. లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా చేసే వాహనాలను 78కి పెంచాం. ఒడిశా నుంచి 210 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను 36 వాహనాల్లో తీసుకొస్తున్నాం. నాలుగు వాహనాలను విజయవాడ నుంచి రోజూ ఆకాశమార్గంలో వైమానికదళం సాయంతో పంపుతున్నాం. రాష్ట్రానికి మరో 2 ఐఎస్‌వో ట్యాంకర్లు, 15 వేల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 10 వేల డి-టైపు సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. 53 చోట్ల కొత్తగా పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు. ఆస్పత్రుల వద్ద కనీసం 25-50 పడకలు ఉండేలా జర్మన్‌ హేంగర్లను 2, 3 రోజుల్లో ఏర్పాటు చేయబోతున్నాం. కొవిడ్‌ చికిత్స కోసం రాష్ట్రంలో 669 ఆస్పత్రుల్లో మొత్తం 47,693 పడకలు సిద్ధం చేయగా 39,749 నిండాయి. కిందటి ఏడాది కన్నా వెంటిలేటర్లు, పడకలు, ఐసీయూ పడకలు, ఆక్సిజన్‌ పడకలు పెంచాం. రాష్ట్రంలో 21,340 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు సిద్ధంగా ఉన్నాయి’ అని వివరించారు. సమీక్షలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌, డీజీపీ గౌతం సవాంగ్‌, కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ జవహర్‌రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్‌, ఉన్నతాధికారులు కృష్ణబాబు, కాటమనేని భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

7 కోట్ల డోసులు కావాలి

‘రాష్ట్రంలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లతోపాటు 45 సంవత్సరాలకు పైబడినవారు దాదాపు 1.48 కోట్ల మంది ఉన్నారు. వారందరికీ దాదాపు 3 కోట్ల డోసులు కావాలి. 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న మరో 2 కోట్ల మందికి రెండు డోసులు వేయడానికి 4 కోట్ల డోసులు అవసరం. అంటే అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలంటే రాష్ట్రంలో దాదాపు 7 కోట్ల డోసులు కావాలి. కానీ కేంద్రం మనకు సరఫరా చేసింది 73 లక్షలే. అంటే 10 శాతం కూడా మించలేదు. దేశంలో కేవలం భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ అనే రెండు కంపెనీలే వ్యాక్సిన్లు తయారు చేస్తుండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. భారత్‌ బయోటెక్‌ నెలకు కోటి, సీరమ్‌ సంస్థ 6 కోట్లు కలిపి నెలకు 7 కోట్ల టీకాలు ఉత్పత్తి చేస్తున్నాయి’ అని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని