MP రఘురామకృష్ణరాజు అరెస్టు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MP రఘురామకృష్ణరాజు అరెస్టు

 హైదరాబాద్‌లోని నివాసంలో అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ అధికారులు
 రోడ్డు మార్గంలో విజయవాడ మీదుగా గుంటూరుకు
 సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలింపు
 బెయిల్‌ కోసం హౌస్‌మోషన్‌ పిటిషన్‌ వేసిన రఘురామ
 నేడు హైకోర్టులో విచారణ

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే-హైదరాబాద్‌: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైకాపా ఎంపీ కె.రఘురామకృష్ణరాజును ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఏపీ సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్‌లో ఉన్న రఘురామకృష్ణరాజు నివాసానికి చేరుకుని ఆయన్ను అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన్ను వాహనంలో ఎక్కించుకుని హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. అక్కడి నుంచి రాత్రి 9.50 గంటల సమయంలో గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రి రఘురామకృష్ణరాజును అక్కడే ఉంచారు. శనివారం న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉంది. శుక్రవారం ఎంపీ జన్మదినం కావడంతో హైదరాబాద్‌లోని నివాసంలో కుటుంబసభ్యులతో ఉండగా అరెస్టు చేశారు. రఘురామకృష్ణరాజు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని, ప్రభుత్వం పట్ల అవిధేయతను ప్రోత్సహిస్తున్నారనే సమాచారంపై ప్రాథమిక విచారణ జరిపామని సీఐడీ అదనపు డీజీపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అదంతా వాస్తవమని తేలటంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశామని పేర్కొంది. రఘురామకృష్ణరాజుకు వై కేటగిరీ భద్రత ఉంది. ఆయన భద్రత విధుల్లో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఉన్నారు. ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకుని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో పాటు, ఎంపీ కుమారుడు భరత్‌ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంపీ కుర్చీపై కూర్చోగా.. ఆయన చుట్టూ సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది వలయంగా ఏర్పడి సీఐడీ అధికారుల్ని దగ్గరకు రానివ్వకుండా నిలువరించారు. సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులు  అనుమతిస్తేనే ఎంపీని అదుపులోకి తీసుకునేందుకు అంగీకరిస్తామని వారు సీఐడీ అధికారులకు తేల్చిచెప్పడంతో కొంతసేపు వాగ్వాదం  చోటుచేసుకుంది. చివరకు సీఐడీ అధికారులు.. సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులతో మాట్లాడి రఘురామకృష్ణరాజును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు కుటుంబసభ్యులకు నోటీసిచ్చేందుకు ప్రయత్నించగా వారు తీసుకోలేదు. దీంతో ఎంపీ భార్య రమాదేవికి ఇస్తున్నట్లుగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద గోడకు నోటీసు అంటించారు.

నోటీసులో ఏముందంటే?: ‘ఐపీసీ సెక్షన్‌ 124 (ఏ), 153, 505 రెడ్‌విత్‌ 120బీ సెక్షన్ల కింద రఘురామకృష్ణరాజుపై మంగళగిరిలోని సీఐడీ పోలీసుస్టేషన్‌లో క్రైమ్‌ నెంబర్‌ 12/2021 కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేస్తున్నాం. ఇది బెయిల్‌కు వీలులేని కేసు. ఆయన న్యాయస్థానం ద్వారానే బెయిల్‌ పొందేందుకు వీలుంది’ అని పేర్కొంటూ సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 50(2) ప్రకారం నోటీసు జారీచేశారు. దానిపై గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయం అదనపు సూపరింటెండెంట్‌ ఆర్‌.విజయ్‌పాల్‌ సంతకం ఉంది.
శాంతిభద్రతలకు భంగం కలిగించే కుట్ర: ‘ఒక పథకం, ప్రణాళిక ప్రకారం కులాల మధ్య విద్వేషాలు, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా రఘురామకృష్ణరాజు నిత్యం ప్రసంగాలు చేస్తున్నట్లు మా ప్రాథమిక విచారణలో తేలింది. ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తుల్ని ఆయన లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆయన ప్రసంగాలు, చర్యలు విద్వేషపూరితం. ప్రభుత్వానికి వ్యతిరేకం. పలు మీడియా ఛానళ్లతో కలిసి రాష్ట్రంలో సామాజిక, ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు రఘురామకృష్ణరాజు కుట్ర చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశాం’ అని సీఐడీ అదనపు డీజీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
సీఐడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు: రఘురామకృష్ణరాజును గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొస్తుండటంతో రాత్రి 7 గంటల నుంచే పలు రహదారుల్లో పోలీసులను భారీగా మోహరించారు. సీఐడీ కార్యాలయం వైపు మీడియాతో పాటు ఇతరులు ఎవరూ రాకుండా బారికేడ్లు అడ్డుగా పెట్టారు.

పోలీసులా రౌడీలా అర్థం కాలేదు: భరత్‌.. ఎంపీ  అరెస్టును ఆయన కుమారుడు భరత్‌  ఖండించారు. పోలీసులతో ఆయన  వాగ్వాదానికి దిగారు. ముందస్తు నోటీసులివ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ  ప్రశ్నించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘వారెంటు  లేకుండా 30 మంది వచ్చి పుట్టినరోజు నాడే మా నాన్నను తీసుకెళ్లారు. ఆయనకు  గుండె శస్త్రచికిత్స జరిగి 3 నెలలే అయింది. సాధారణ దుస్తుల్లో వచ్చింది  సీఐడీ అధికారులా లేక రౌడీలా అర్థం కాలేదు. పొరుగు రాష్ట్రంలో ఉన్న ఎంపీని ఏ విధంగా అరెస్టు  చేస్తారు? ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపితే అరెస్టు చేస్తారా? మా  నాన్నను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు. అరెస్టుపై న్యాయపోరాటం  చేస్తాం’ అని చెప్పారు.

  బెయిల్‌ కోసం అత్యవసర పిటిషన్‌

సీఐడీ నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు శుక్రవారం రాత్రి అత్యవసరంగా హౌజ్‌మోషన్‌ విధానంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శనివారం మధ్యాహ్నం విచారణ జరుపుతామన్న హైకోర్టు.. అప్పటి వరకు ఎంపీ రఘురామకృష్ణరాజును మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచవద్దని పేర్కొంది. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఔషధాలు, ఆహారం బయటి నుంచి పొందేందుకు వెసులుబాటు ఇవ్వాలంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు